దేశంలోనే ఖరీదైన ఫ్లాట్.. రేటు చూస్తే మైండ్ బ్లాక్

సాధారణంగా ముంబయిలో అపార్ట్ మెంట్ రేట్లు భారీగానే ఉంటాయి. అయితే ఇప్పుడీ రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి. మంచి లొకేషన్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనాలంటే కళ్లు తిరిగే రేట్లు కనిపిస్తున్నాయి.…

సాధారణంగా ముంబయిలో అపార్ట్ మెంట్ రేట్లు భారీగానే ఉంటాయి. అయితే ఇప్పుడీ రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి. మంచి లొకేషన్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనాలంటే కళ్లు తిరిగే రేట్లు కనిపిస్తున్నాయి. కేవలం ఫ్లాట్ రేట్లే వందల కోట్లు దాటిపోతున్నాయి.

మొన్నటికిమొన్న బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్, ముంబయిలో ఓ ట్రిప్లెక్స్ పెంట్ హౌజ్ కొన్నారు. దాని రేటు అక్షరాలా 252.5 కోట్ల రూపాయలు. ఇప్పుడు దీన్ని మించిన ధర పలికింది మరో ఫ్లాట్. ఈసారి పలికిన రేటు ఎంతో తెలుసా? అక్షరాలా 369 కోట్ల రూపాయలు.

అవును.. సౌత్ ముంబయిలోని మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో ఓ ట్రిప్లెక్స్ ఫ్లాట్ 369 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. దేశంలో ఓ ఫ్లాట్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఇంకా చెప్పాలంటే ఇండియా రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదో రికార్డ్.

లోధా మలబార్ పేరిట సౌత్ ముంబయిలో ఓ భారీ అపార్ట్ మెంట్ నిర్మిస్తోంది లోధా గ్రూప్. ఈ అపార్ట్ మెంట్ లో 26, 27, 28 అంతస్తుల్ని కలిపి ట్రిప్లెక్స్ ఫ్లాట్ గా మార్చారు. సూపర్ లగ్జరీ హంగులతో, అరేబియన్ సముద్రం ఫేసింగ్ తో నిర్మించిన ఈ ట్రిప్లెక్స్ ఫ్లాట్ ను జేపీ టపారియా కుటుంబం పైన చెప్పిన మొత్తానికి దక్కించుకుంది.

దీని రిజిస్ట్రేషన్ కోసం కేవలం స్టాంప్ డ్యూటీ కింద 19.07 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించింది టపారియా కుటుంబం. 27,160 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ ను నిర్మించారు. అంటే సగటున ఒక్కో చదరపు అడుగుకు లక్షా 36వేల రూపాయలు చెల్లించింది ఆ కుటుంబం. ఈ ఫ్లాట్ కు 8 కారు పార్కింగ్ లు కేటాయించారు.

భారత రియల్ ఎస్టేట్ చరిత్రలో కేవలం ఓ ఫ్లాట్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ఈ రికార్డ్ ఎక్కువ రోజులు నిలవదంటున్నారు.