మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన 

పీవీ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన్ని గౌరవించింది మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలే.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినప్పటి నుంచి ఆయనకు దేశ రాజధాని ఢిల్లీలో విడిగా స్మారకం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ కూడా రాశారు.

మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త. పదేళ్లు ప్రధానిగా పనిచేసిన నాయకుడు కాబట్టి ఆయన్ని గౌరవించాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మన్మోహన్ సింగ్ ను అపరిమితంగా గౌరవిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశం దశను దిశను మార్చిన, ఆర్ధిక సంస్కరణలతో దేశానికి జవసత్వాలు కల్పించి బలోపేతం చేసిన, మన్మోహన్ సింగ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆర్ధిక సంస్కరణలను అమలు చేయించిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మరణించాక ఆయన్ని దారుణంగా అవమానించిందని ఆగ్రహించింది.

ఆయన భౌతిక కాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి కూడా సోనియా గాంధీ తీసుకురావడానికి ఒప్పుకోలేదు. హైదరాబాదు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేయాలని పీవీ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులేకాదు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులూ పెద్దగా పట్టించుకోలేదు.

పీవీ వ్యక్తిత్త్వం, పరిపాలన, ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా సోనియా గాంధీ వ్యవహరించిన తీరు గురించి తెలుసుకోవాలంటే వినయ్ సీతాపతి రాసిన హాఫ్ లయన్ (తెలుగులో నరసింహుడు) పుస్తకం చదవాల్సిందే. మన్మోహన్ కు స్మారకం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన నేపథ్యంలోనే తన తన తండ్రి మరణించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఆవేదన చెందారు.

తాజాగా పీవీ నరసింహారావు సోదరుడు పీవీ మనోహర్ రావు ఢిల్లీ మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తన సోదరుడు ఎంతో సేవ చేసినా ఆ పార్టీ ఆయన్ని గౌరవించలేదన్నారు. దేశానికి ప్రధానులుగా పనిచేసినవారు మరణిస్తే ఢిల్లీలోని యమునా నది ఒడ్డునే అంత్యక్రియలు నిర్మించి స్మారకం నిర్మించడం ఆనవాయితీ అని, కానీ పీవీ అంత్యక్రియలు హైదరాబాదులో నిర్వహించాలని ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పీవీకి ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా ఆ పని చేయలేదన్నారు. భారతరత్న కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ ప్రభుత్వమే పీవీని గౌరవించి భారతరత్నను ప్రదానం చేసింది. తెలంగాణలో గులాబీ పార్టీ ప్రభుత్వం పీవీని సముచితంగా గౌరవించింది.

ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఆయన గురించి అనేక పుస్తకాలు ప్రచురించింది. ఆయన కుమార్తె వాణీ దేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. పీవీ జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన్ని గౌరవించింది మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలే.

4 Replies to “మాజీ ప్రధాని సోదరుడి తీవ్ర ఆవేదన ”

Comments are closed.