ఏపీలో పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తప్పవు అని ప్రకటించారు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని నిమ్మగడ్డ పేరు మీద విడుదల అయిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే.. ఇంతకీ ఎన్నికలు అడ్డుకునేందుకు ప్రయత్నాలు.. అంటే ఏమిటో అంతుబట్టడం లేదిక్కడ. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. అది కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ వాదనను కొన్ని సార్లు కోర్టు ఆమోదిస్తూ ఉంది, మరి కొన్ని సార్లు నిమ్మగడ్డకు విశేష అధికారాలు ఉన్నాయని కోర్టు చెప్పింది.
ఇలా నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ ఒక సారి రద్దై, మళ్లీ తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది వ్యవహరం, ఈ నెల 25న సుప్రీంలో విచారణ జరగనుంది. ఇక ఎన్నికల నిర్వహణలో కీలకం అయిన ఉద్యోగ సంఘాలు తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేం మొర్రో అంటున్నాయి.
కనీసం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ అయినా వీటిని వాయిదా వేయండని అవి కోరుతూ ఉన్నాయి. అవి కోరుతున్నాయి తప్ప.. రోడ్డెక్కడం లేదు! మానవతా దృక్పథంతో అయినా ఆలోచించాలని అవి కోరుతున్నాయి. వాటి విజ్ఞప్తిని నిమ్మగడ్డ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఎంప్లాయిస్ ఫెడరేషన్ కూడా సుప్రీంను ఆశ్రయించింది.
ఇలా ఎవరికి వారు తమ ముందు ఉన్న చట్టపరమైన మార్గాలను పట్టుకుని నిమ్మగడ్డ తీరును ఆక్షేపిస్తూ ఉన్నారు. మరి వారందరి మీదా చర్యలు ఉంటాయని నిమ్మగడ్డ హెచ్చరిస్తున్నట్టా? ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించడం అంటే.. అది కోర్టును ఆశ్రయించడం కూడా.
కోర్టును ఆశ్రయిస్తున్న వారు ఎన్నికలను ఆపాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. అందులో డౌటేం లేదు. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ఉద్యోగులు వెనకడుగు వేస్తూ ఉన్నారు.
కేరళల్లో ఎన్నికల నిర్వహణ తర్వాత కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఈ అంశం కూడా చర్చకు వస్తూ ఉందిప్పుడు. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు అని నిమ్మగడ్డ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు.
తను రాజకీయ పార్టీలతో జరిపిన సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదిరిందంటూ నిమ్మగడ్డ చెప్పుకున్నారు. అయితే అది శుద్ధ అబద్ధమని పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా ఎన్నికల నిర్వహణకు పూర్తి సానుకూలత వ్యక్తం చేయలేదు.
ఆ పార్టీలు బయట ఈ విషయాన్ని చెప్పాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సమావేశాన్నే బహిష్కరించింది. మరి ప్రముఖ పార్టీలే ఆ తరహా అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు ఏకాభిప్రాయం ఎక్కడ కుదిరినట్టో ఎలా కుదిరినట్టో సామాన్యులకు అంతుబట్టడం లేదు!