డైరెక్టర్ కృష్ణవంశీ 27 ఏళ్ల క్రితం తెరకెక్కించిన గులాబీ సినిమాలోని ఓ పాట కుర్రకారును ఊపేసింది. ఆ సినిమాలో …ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనే పాట అప్పటికీ, ఇప్పటికీ మోస్ట్ పాపులర్ సాంగ్ అంటే అతిశయోక్తి కాదు.
రావడం రావడంతోనే హిట్‌సాంగ్‌తో వచ్చిన సింగర్ సునీత …ఇండస్ట్రీలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఒక సింగర్‌కు హీరోహీరోయిన్లతో సమానంగా అభిమానులుండడం ఒక్క సునీతకే ప్రత్యేకం. ఆమె కంఠంతో పోటీ పడుతున్నట్టు సునీత రూపం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.
అందగత్తె అయిన సునీతకు హీరోయిన్ అవకాశాలు బోలెడన్నీ వచ్చాయి. ఆమె అంగీకరించి ఉంటే ఈ పాటికి వందల సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఉండేవారేమో! సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే ఆమె ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇటీవల సునీత వివాహం చేసుకుని మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే ఎవరెన్ని అవకాశాలు ఇచ్చినా హీరోయిన్‌గా నటించకపోవడానికి సునీత మనసులో బలమైన అభిప్రాయాలేవో ఉన్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ అవకాశాలను తిరస్కరించడంపై సునీత నర్మగర్భ వ్యాఖ్యలతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే, అదే సమయంలో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా కాదని తిరస్కరించారని, ఇప్పుడిస్తే చేస్తారా? అనే ప్రశ్నకు సునీత ఆసక్తికర సమాధానం చెప్పారు.
ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అనవసరంగా మార్చడం ఎందుకని.. ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని చమత్కరించారు. తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పకుండా, ఎవరికే విధంగా కావాలో ఆ విధంగా తీసుకోండి అన్నట్టు చెప్పిన సునీత అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సునీత చెబుతున్న ప్రకారం హీరోయిన్ కావడం అంటే ప్రశాంతతను కోల్పోవడమే అన్న మాట అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఏ విధంగా ప్రశాంతత కోల్పోతారో కూడా సునీత చెప్పి హీరోయిన్ కావాలని కలలు కంటున్న వాళ్లకు మంచి చేసినట్టు అవుతుందనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతుండడం గమనార్హం.