అడ్డదారా..? దొడ్డిదారా..? కేసీఆర్ కు దారేది!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొట్టేసి, భాగ్యనగరంపై ఆధిపత్యం చూపించి, సగర్వంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కుదామనుకున్నారు కేటీఆర్. కానీ తండ్రీ-కొడుకుల ఆశలు గల్లంతై.. 56 దగ్గర 'కారు' ఆగింది. అయితే అతిపెద్ద పార్టీగా మాత్రం పరువు…

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొట్టేసి, భాగ్యనగరంపై ఆధిపత్యం చూపించి, సగర్వంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కుదామనుకున్నారు కేటీఆర్. కానీ తండ్రీ-కొడుకుల ఆశలు గల్లంతై.. 56 దగ్గర 'కారు' ఆగింది. అయితే అతిపెద్ద పార్టీగా మాత్రం పరువు దక్కించుకుంది. 

150 సీట్ల జీహెచ్ఎంసీ పాలకవర్గంలో మేయర్ పీఠం దక్కాలంటే రావాల్సిన పాస్ మార్కులు 76. గతంలో 99 కార్పొరేషన్లు దక్కించుకుని ఎంఐఎం సపోర్ట్ లేకుండానే మేయర్ పీఠం దక్కించుకున్న టీఆర్ఎస్ కు ఈ దఫా.. ఏ దారిలో వెళ్లాలో అర్థం కావడంలేదు. 

ప్రస్తుత పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10తో ముగుస్తుండటంతో.. ఆ తర్వాతి రోజు కొత్త పాలక వర్గ ఎన్నికకు మహూర్తం నిర్ణయించారు అధికారులు. 11వతేదీ ఉదయం 11గంటలకు ప్రమాణ స్వాకారాలు మొదలైతే.. 12.30కి మేయర్ ఎన్నిక జరుగుతుందని అంచనా.. కుదరని పక్షంలో తర్వాతి రోజు ఎన్నిక ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

అడ్డదారి..

ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే నేరుగా మేయర్ పీఠంపై కూర్చుని, డిప్యూటీ మేయర్ ని దర్జాగా మజ్లిస్ కి అప్పగించేయొచ్చు. కానీ అలా చేస్తే బీజేపీ ఇన్నాళ్లూ చేసిన వాదన నిజమేనని టీఆర్ఎస్ ఒప్పుకున్నట్టు అవుతుంది. 

టీఆర్ఎస్, మజ్లిస్ రెండిటికీ ఇది మంచిది కాదు. అందుకే అడ్డదారిలో ఎక్స్ అఫిషియో సభ్యుల సహకారంతో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచన ఆ పార్టీ నేతలకు ఉంది.

గ్రేటర్ పరిధిలోని, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులంతా ఎక్స్ అఫిషియోల రూపంలో ఓటింగ్ లో పాల్గొంటే అడ్డదారిలో మేయర్ పీఠం టీఆర్ఎస్ దే. అయితే అందులోనూ ఒకటి రెండు ఓట్లు తక్కువయ్యే అవకాశం ఉండటంతో.. అధికార పార్టీ ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది.

దొడ్డిదారి..

సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక, మేయర్ ఎన్నిక జరిగే సమయంలో ఎంఐఎం వాకవుట్ చేస్తే.. సభలో ఉన్న సభ్యుల హాజరు ప్రకారం సాధారణ మెజార్టీతో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. 

ఆ తర్వాత ఎంఐఎంకి కూడా అదే రకంగా తన సహకారం అందిస్తుంది. అయితే ఎంఐఎంతో పాటు, మరో డిప్యూటీ మేయర్ పోస్ట్ కూడా ఆర్డినెన్స్ ద్వారా సృష్టించి, దాన్ని టీఆర్ఎస్ నేతలకు సర్దుబాటు చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం.

మేయర్ పీఠం దక్కడమే కష్టం అనుకుంటుంటే.. అందులో ఇద్దరు గట్టిగా పోటీ పడుతున్నారు. మహిళా కోటా ఉండటంతో..  ఎంపీ కేశవరావు కుమార్తె విజయలక్ష్మి, ప్రస్తుత మేయర్ రామ్మోహన్ భార్య శ్రీదేవి అధిష్టానం వద్ద తమ మాట నెగ్గించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. వీరితోపాటు మిగతావారి పేర్లు కూడా వినపడుతున్నా.. ఆ ఇద్దరిని దాటి మేయర్ పీఠం బయటకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.

ఈ సంగతి పక్కనపెడితే.. మేయర్ పదవి విషయంలో టీఆర్ఎస్ కు అడ్డదారి-దొడ్డిదారి మినహా.. రహదారి మాత్రం లేదు.

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే