గోతులు తీసే క‌ళ!

మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని ప్రేమించు. త‌న శ‌క్తిని గింజ‌గా మార్చి నోటికి అందిస్తుంది. మ‌న్ను త‌డిస్తేనే మొక్క బ‌తికేది. త‌డిని కాపాడుకో, లేదంటే లోప‌ల ఎడారి మిగులుతుంది. Advertisement అపార‌మైన మ‌ట్టి ఒక రోజు నీ…

మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని ప్రేమించు. త‌న శ‌క్తిని గింజ‌గా మార్చి నోటికి అందిస్తుంది. మ‌న్ను త‌డిస్తేనే మొక్క బ‌తికేది. త‌డిని కాపాడుకో, లేదంటే లోప‌ల ఎడారి మిగులుతుంది.

అపార‌మైన మ‌ట్టి ఒక రోజు నీ కౌగిలి కోసం వ‌స్తుంది. చేతులు చాచ‌లేని నిస్స‌హాయుడివి నువ్వు. నేల‌కి ఇచ్చిపుచ్చుకోవ‌డం తెలుసు. నిన్ను స్వీక‌రించి, ఇంకొక‌రిని తిరిగి ఇస్తుంది. నీ మ‌నుమ‌ళ్ల‌కి నువ్వొక ఫొటో మాత్రమే.

జీవితం అంతా ఎవ‌రి కోస‌మో ఎదురు చూస్తూ వుంటాం. అత‌ను రాడు. ఎందుకంటే అత‌ను లేడు. నువ్వెన్న‌డూ చూడ‌ని, ఎదురు చూడ‌ని మ‌నిషి ఒక‌రోజు స్వాగ‌తిస్తాడు. అత‌న్ని గుర్తు ప‌ట్టిన త‌ర్వాత , ఇంకెవ‌రూ నీకు గుర్తు ఉండ‌రు. గ‌డియారం ఆగిపోయే స‌మ‌యం.

ముళ్ల కంచెలు, విష వృక్షాలున్న మాట నిజ‌మే. సూర్యోద‌యాలు, ప‌సిపిల్ల‌ల న‌వ్వులు. గాలికి ఊగే చిన్న గులాబీలు, కొత్త పెళ్లి కూతురి క‌ను రెప్ప‌లు మోసే క‌ల‌లు, ఎక్క‌డికో తెలియ‌కుండా తుళ్లుతూ ప‌రిగెత్తే వాగు, లోకం ప‌చ్చ‌గానే వుంది. మ‌న‌కే రెటీనా స‌మ‌స్య‌.

జీవితం సినిమా కాదు. ప్రొజెక్ట‌ర్ త‌ల‌కిందులుగా వుంటుంది. శుభం అంటూ మొద‌లై గ‌తంలోలా ఇంకేదీ ఉండ‌దు అని పొగాకు యాడ్‌తో ముగుస్తుంది.

యంత్రంగా ప‌ని చేసినా గెల‌వ‌లేన‌ప్పుడు, ఇక మంత్ర‌మే గ‌తి. దేవుడు లేడ‌ని, సాక్షాత్తు దేవుడే వ‌చ్చి చెప్పినా న‌మ్మం క‌దా!

బ‌త‌కాలంటే నోరు మూసుకుని వుండు. మాట్లాడిన చిలుక‌కి పంజ‌ర‌మే ద‌క్కేది. జీవ హింస గురించి క‌త్తులు సంభాషిస్తున్న కాలం. తోడేళ్లు వ్ర‌తాలు చేసి పొర్లు దండాలు పెడుతున్నాయి. న‌క్క‌లు నీతి శాస్త్రాలు రాసి రుద్రాక్ష‌ల‌తో తిరుగుతున్నాయి.

ఆర్టీఫిషియ‌ల్ ఇంటెలిజెంట్ అంటే ఏక కాలంలో ఐదారు ముఖాల‌తో జీవించ‌డం. వాస్త‌విక‌త‌ని హ‌త్య చేసి, కృత్రిమ‌త సంచ‌రిస్తూ వుంది. అన్నీ న‌కిలీలే ఉన్న‌ప్పుడు ఒరిజిన‌ల్ ఎలా వుండేదో ఎవ‌రికి తెలుసు?

ఒక ప్రింటింగ్ యంత్రం సృష్టించే డ‌బ్బు, మ‌నిషిని శాసిస్తుంది. బిర‌డా తీస్తే వ‌చ్చే భూతం, సృష్టించిన వాన్నే భ‌క్షిస్తుంది.

ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు స‌మూహాన్ని కోరుకోవ‌డం, స‌మూహంలో ఒంట‌రిత‌నాన్ని అనుభ‌వించ‌డం మోడ్ర‌న్ లైఫ్‌స్టైల్. ఆరోహ‌ణ‌, అవ‌రోహ‌ణ క‌లిస్తేనే జీవ‌న సంగీతం.

న‌లుగురు క‌లిసి న‌వ్వే చోట ఉండు. గంధ‌పు చెక్క స్ప‌ర్శ అది. ఫోన్ చార్జింగ్ ఒక రోజు కూడా మ‌రిచిపోవు స‌రే, నిన్ను రీచార్జ్ చేసుకుని ఎంత‌కాల‌మైంది. చార్జ‌ర్ వెతికితే దొర‌క‌దు. నీలోప‌లే వుంటుంది. తాళాన్ని నువ్వే త‌యారు చేసుకుని తెర‌వాలి.

మంచీచెడులు ప్ర‌పంచంలో లేనే లేవు. ఫ్రీజ‌ర్ బాక్స్‌లు అద్దెకి ఇచ్చేవారు. స్మ‌శానంలో క‌ట్టెలు అమ్మేవాడు కూడా దేవుడికి దండం పెట్టే వ్యాపారం మొద‌లు పెడ‌తారు.

పులికి, జింక‌కి దేవుడు ఒక‌డే. ఆ రోజు మూడ్‌ని బ‌ట్టి ఎవ‌రో ఒక‌రి ప‌క్షాన వుంటాడు. ఆ మూడ్‌ని మ‌నం అదృష్ట‌మ‌ని పిలుస్తాం.

లోకంలో ఎవ‌రి లెక్క‌లు వారివి. ఇంకొకరితో మ్యాచ్ కావు. న‌త్త‌ని చూసి తాబేలు త‌న వేగానికి అబ్డుర‌ప‌డుతూ వుంటుంది. ఎంగిలాకు సంపాయించుకున్న కుక్క త‌న‌ని తాను యోధుడిగా అనుకోవ‌చ్చు. పిల్ల కాలువ‌లో జీవించే చేప‌కి స‌ముద్రం ఉంద‌ని తెలియ‌దు.

జీవితంలో పైకి రావ‌డానికి నిచ్చెన‌లు వేసే కాలం పోయింది. ఎస్క‌లేట‌ర్లు వ‌చ్చేశాయి. అయితే క‌రెంట్ పోయే ప్ర‌మాదం వుంది జాగ్ర‌త్త‌.

ప్ర‌తిదానికీ ఒక రేటు ఉన్న కార్పొరేట్ ప్ర‌పంచం. గోతులు తీయ‌డం అత్యుత్త‌మమైన క‌ళ‌. ప‌లుగు అక్క‌ర్లేదు, ప‌లుకు చాలు. వృత్తి క‌ళాకారులు పెరిగిపోయి ప‌నిలో ప‌నిగా త‌మ‌కి కూడా త‌వ్వేసుకుంటున్నారు.

జీఆర్ మ‌హ‌ర్షి

10 Replies to “గోతులు తీసే క‌ళ!”

  1. అందుకే దహనం చెయ్యడం ఉత్తమం.. ఎప్పుడైతే పాతిపెట్టడం మొదలెట్టారో గోతులు తీసే కళ అబ్బింది…

  2. Good one. Devude degivacchina they dont believe cuz Missionaries are a business. Its pyramid style hierarchy. The top lives in west bottom lives in poor countries like india.

Comments are closed.