నేను కాపును కాదు.. కాపు సభలో కల్యాణ్ కామెడీ!

ఇన్నాళ్లూ జనసేనపై ఎక్కడ కాపు ముద్ర పడుతుందేమోనన్న భయంతోనే పవన్ కల్యాణ్ ని కలవలేదని కాపు నాయకుడు హరిరామ జోగయ్య చెప్పడం.. నేను కాపులకే కాదు, అన్ని కులాలకు ప్రతినిధిని అని పవన్ కల్యాణ్…

ఇన్నాళ్లూ జనసేనపై ఎక్కడ కాపు ముద్ర పడుతుందేమోనన్న భయంతోనే పవన్ కల్యాణ్ ని కలవలేదని కాపు నాయకుడు హరిరామ జోగయ్య చెప్పడం.. నేను కాపులకే కాదు, అన్ని కులాలకు ప్రతినిధిని అని పవన్ కల్యాణ్ సెలవివ్వడం.. ఇవన్నీ ఇంకెక్కడో వినపడిన మాటలు కాదు. సాక్షాత్తూ కాపులతో పవన్ కల్యాణ్ భేటీలో బయటకు వచ్చిన మాటలే.

పెట్టింది కాపు సభ, వచ్చింది కాపు నాయకులు, చర్చ జరిగింది కాపుల అభివృద్ధి కోసం.. మరి కాపుల పార్టీ కాదు, అందరి పార్టీ అని ఇంకా నమ్మించాలనుకోవడం ఏంటో? ప్రతి సమావేశానికి పక్కన అంతరాత్మ నాదెండ్ల మనోహర్ ని పెట్టుకునే పవన్ కల్యాణ్ తన కులపు నాయకులు వచ్చే సరికి ఆయన్ని పక్కనపెట్టడం ఏంటి? ప్యూర్ కాపు సభ అనే ఉద్దేశంతోటే నాదెండ్లను పక్కనపెట్టారేమో?

కులం గుర్తొచ్చేసరికి స్నేహితుడు కూడా పక్కకు వెళ్లిపోయారంటే ఇక పవన్ కల్యాణ్ సామాజిక దృక్పథం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. పోనీ కాపుల మధ్యలో కమ్మబిడ్డ నాదెండ్ల కూర్చుంటే సభకు ఏమైనా మలినం అంటుకుంటుందా.. కేవలం కాపులే కూర్చుని చర్చించాలని అనుకున్నారా. అలా అయితే సెక్యూరిటీ, కెమెరామెన్లు.. కూడా సదరు కులం వారినే పెట్టుకుంటే సరిపోయేది కదా?

కబుర్లు చెప్పడంలో దిట్ట పవన్ కల్యాణ్..

ఏరికోరి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే కులం ఓట్ల కోసం పవన్ పోటీ చేయడం వాస్తవం కాదా. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కూడా కాపు సామాజిక వర్గం బలంగా ఉందనే కారణంతోనే సీటు కోసం జనసేనాని పట్టుబట్టడం వాస్తవం కాదా. అసలు కులం అంటే ఏంటో తెలియనట్టు, కులం వాసనే పడనట్టు బిల్డప్ ఇచ్చే పవన్ కల్యాణ్ నరనరాల్లో కులాన్ని జీర్ణించుకున్నవారే. కానీ అంత తొందరగా బయటపడరంతే.

రెల్లి కులాన్ని స్వీకరించిన పవన్ కల్యాణ్ అసలా రెల్లి కులం అభివృద్ధికి ఎలాంటి కృషి చేశారో చెప్పాల్సిన అవసరం లేదా? ఎన్నికలప్పుడు కులం లేదు, మతం లేదు అని రెచ్చిపోయే పవన్ కల్యాణ్.. రామతీర్థం విషయంలో అంత రాద్ధాంతం చేయడానికి కారణం మతం కాదా. మతతత్వ పార్టీ అని ముద్రపడిన బీజేపీతో కలసి సాగుతున్న పవన్ కి మతంపై అభిమానం లేదంటే ఎవరైనా నమ్ముతారా?

బీసీలకు వ్యతిరేకమే..?

కాపు రిజర్వేషన్లు కావాలంటూనే మరోవైపు బీసీలకు అన్యాయం జరగొద్దని మొసలి కన్నీరు కార్చడం పవన్ కల్యాణ్ కే చెల్లింది. కాపులకు రిజర్వేషన్ల పరంగా న్యాయం చేయండి అంటే బీసీలకు అన్యాయం చేయాలనే అర్థం. 

అలా చేయకుండా రాజ్యాంగం ప్రకారం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరని పని. అది తెలిసి కూడా పదే పదే అదే అంశాన్ని ప్రస్తావించే పవన్ కల్యాణ్ బీసీల వ్యతిరేకి కాక ఇంకెవరు? బీసీ కార్పొరేషన్లతో ఉపయోగం లేదని చెబుతున్న పవన్, ఇతర కార్పొరేషన్లను అవమానించినట్టు కాదా?

కాపు సభలో పవన్ ప్రస్తావించిన ప్రతి అంశమూ ఆయన కులాభిమానాన్ని బయటపెట్టింది. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ పై కాపు ముద్ర పడకూడదంటూనే.. ఆయనతో వెళ్లి సమావేశం పెట్టుకున్నారు కుల సంఘం నేతలు. కాపులకు ఏకైక దిక్కు పవనే అని చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికలనాటికైనా.. కాపుల్ని ఏకం చేయాలనే కృషితోనే బీజేపీ, జనసేన ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

రాజకీయ చైతన్యం కోసం చేసే ప్రయత్నాల్ని ఎవరూ కాదనరు. కానీ అదే సమయంలో కులం లేదు, మతం లేదు అంటూ నీతులు చెబితేనే కామెడీగా ఉంటుంది.

చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్న నిమ్మగడ్డ..

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?