జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వద్ద నాగబాబుకు అంత సీన్ లేదా అంటే…అవుననే సమాధానం వస్తోంది. పవన్‌కు నాగబాబు స్వయాన అన్న అవుతారు. అంతేకాదు తమ్ముడికి రాజకీయంగా అండగా నిలిచేందుకు జనసేనలో నాగబాబు చేరారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి మూట కట్టుకున్నారు. తమ్ముడిపై చిన్న విమర్శ వచ్చినా…సోషల్ మీడియా వేదికగా నాగబాబు బలంగా తిప్పికొడుతుంటారు. మరి తమ్ముడిపై అంతగా ప్రేమ చూపే నాగబాబుపై…పవన్ అంతే స్థాయిలో అభిమానాన్ని ప్రదర్శిస్తారా అంటే…లేదనే చెప్పొచ్చు.
రెండో అన్నకు పవన్ అంతగా ప్రాధాన్యం ఇవ్వరనేందుకు…తాజాగా నాగబాబు చెప్పిన మాటలే నిదర్శనం. పవన్‌కళ్యాణ్ కొత్త సినిమాల గురించి అప్డేట్ ఉంటే చెప్పాలని సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని నాగబాబును ప్రశ్నించాడు. దీనికి నాగబాబు…సినిమాలకు సంబంధించి అప్డేట్లు తనకు ఆలస్యంగా తెలుస్తుంటాయని సమాధానమిచ్చారు. పవన్ సినిమాల అప్డేట్స్ వాట్సప్, సోషల్ మీడియాలోని ఇతర వేదికలపై వేగంగా తెలుస్తుంటాయని చెప్పుకొచ్చారు.
కానీ పవన్-క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని ఆయన పంచుకున్నారు. ఆ సినిమా మొగలాయ్ల కాలం నాటి కథతో తెరకెక్కుతోందన్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, వారియర్ కథ అని అంటున్నారని నాగబాబు వెల్లడించారు. కోహినూర్ వజ్రం నేపథ్యంలో కథ సాగుతుందని చెబుతున్నారని ఆయన అన్నారు. సినిమా టైటిల్ తనకు తెలియదన్నారు. సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు నాగబాబు చెప్పుకొచ్చారు.
నాగబాబు చెప్పిన విషయాలను జాగ్రత్తగా గమనిస్తే…ఏదీ స్పష్టంగా చెప్పలేకపోయారు. నాకు తెలిసినంత వరకు, ఆంధ్రప్రదేశ్, వారియర్ కథ అని అంటున్నారని, కోహినూర్ వజ్రం నేపథ్యంలో కథ సాగుతుందని చెబుతున్నారని….ఇలా ఎవరో అనామకులు జవాబులు చెప్పినట్టు ఉందే తప్ప…స్వయంగా పవన్ అన్నగా, జనసేనలో కీలక నేతగా స్పందించినట్టు లేదు. అందుకే తమ్ముడి వద్ద అన్న నాగబాబుకు అంత సీన్ లేదనే ప్రచారం ఊపందుకుంది.