‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ – చిన్నప్పటి నుంచి వింటూన్న మాటే యిది. బడి గోడల మీద కూడా రాసి మనను హెచ్చరించారు. అవి ఉత్తుత్తి మాటలు, డబ్బుంటే చాలనుకున్నాం యిన్నాళ్లూ. ఇప్పుడు తెలిసిందిగా, ఆరోగ్యం లేకపోతే నిలువెత్తు ధనం ఉన్నా పనికి రాదని! కరోనా భయంతో ధనికులు కూడా గడప దాటడం లేదు. అధికారమదం, ధనమదం ఏదీ కరోనా ముందు పనికి రావటం లేదు. అగ్రరాజ్యాల వద్ద అన్ని అణ్వస్త్రాలున్నాయి, ప్రజలను కాపాడడానికి యిప్పుడేమైనా ఉపయోగపడ్డాయా? తన దేశపౌరులు పిట్టల్లా రాలిపోతూంటే, గుట్టగుట్టల శవాలుగా మారిపోతూంటే పాలకులు నిస్సహాయంగా గుడ్లప్పగించి చూస్తున్నారు. అమ్మానాన్నలకు కనీసం అంత్యక్రియలైనా చేయడానికి లేక, చేసే మనుషులు రాని దుస్థితిలో ఎంత డబ్బున్నా ఏం లాభం అని వగస్తున్నారు వారి పిల్లలు.
యుద్ధమనేది ఎప్పుడో వస్తుంది. అప్పుడు అవసరం పడుతుందంటూ – శత్రుదేశానికో, మాట వినని దేశానికో బుద్ధి చెప్పడం కోసమంటూ మిలియన్ల, బిలియన్ల డాలర్ల ప్రజాధనం ఖర్చు పెట్టి యుద్ధవిమానాలు, క్షిపణులు, ట్యాంకర్స్ కొని దాచుకున్నారు. పేదలకు వైద్యసదుపాయాలు సమకూర్చడం దండగమారి వ్యవహారమనుకున్నారు. ఎలాగోలా వారి సంఖ్య తగ్గితే అదే మేలనుకున్నారేమో తెలియదు. కానీ యిప్పుడేమైంది? అంటువ్యాధికి ఆర్థికస్థాయితో సంబంధం లేదని తేలింది. ఇప్పుడీ మిస్సయిల్స్ ఎన్ని ప్రాణాలను కాపాడగలుగుతాయి? యుద్ధమంటే మారణాయుధాలతో జరుగుతుందనే భ్రమలోంచి బయటకు వస్తే మంచిది. కరోనాను బయోవెపన్ (జీవాయుధం)గా కొందరు అనుమానిస్తున్నారు, మరి కొందరు అదేమీ కాదంటున్నారు. నిజానిజాలు ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు.
కానీ ఒకటి మాత్రం నిజం. యుద్ధం వస్తే ఒక దేశం ఆర్థికస్థితి ఆర్నెల్లపాటు వెనకబడవచ్చు, మహా అయితే ఏడాది పాటు. ఈ కరోనా దెబ్బకు కొన్నేళ్లపాటు వెనకపడవచ్చంటున్నారు. శత్రువు తన యింట్లోంచి కాలు కదపకుండా మనల్ని చావుదెబ్బ కొట్టినట్లే. ప్రస్తుతం ఇది బయోవెపన్ కాకపోవచ్చు, కానీ యీ అనుభవం తర్వాత మరో శత్రుదేశానికి యీ ఐడియా రావచ్చు కదా. కరోనా కాక మరో ‘నరోకా’ను మనపై వదలవచ్చు. అప్పుడేం చేస్తాం? అందువలన మనం తెలుసుకోవసినదేమిటంటే, ఏమొచ్చినా ఎదుర్కోవాలంటే ఒక్కటే ఉపాయం – మనలోని రోగనిరోధక శక్తి పెంచుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. శరీరాన్ని ఓ కంచుకోటగా తయారుచేసి పెట్టుకుంటే అవతలివాడు కత్తులు వాడినా, శూలాలు వాడినా, తుపాకీలు వాడినా చెక్కు చెదరదు. అందువలన సరిహద్దుల రక్షణ కోసం బోల్డంత డబ్బు తగలేసే బదులు, శరీర రక్షణ కోసం దానిలో కొంతలో కొంత ఖఱ్చు పెడితే మంచిది.
దురదృష్టవశాత్తూ మన పాలకులకు ఆ దృష్టి లోపించింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూగారు అలీనవిధానం పాటించి, పంచశీల ప్రతిపాదించి, యిరుగుపొరుగుతో శాంతి కోసం ప్రాకులాడి, రక్షణవ్యయం తగ్గించి, దాన్ని యిరిగేషన్ ప్రాజెక్టులకు, దేశనిర్మాణానికి, శాస్త్రసాంకేతిక రంగాలకు కేటాయించారు. అయితే 1963లో చైనా మన నమ్మకాన్ని వమ్ము చేసి, దాడి చేసింది. మన వద్దనున్న ఆయుధాలు కాలం చెల్లినవని, సైనికులకు సరైన తర్ఫీదు లేదని, శాంతిదూత బిరుదుకోసం నెహ్రూ దేశభద్రతపై రాజీ పడ్డారని దుమ్మెత్తిపోశారు. ఇక అప్పణ్నుంచి రక్షణ రంగంపై ఖఱ్చు పెట్టడం రివాజైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను త్రోసిరాజని, కోట్లాది రూపాయలు పెట్టి అవసరం ఉన్నా లేకపోయినా, ఏటేటా విదేశీ ఆయుధాలు కొనడం, కొన్నాళ్లకు పాకిస్తాన్ అంతకంటె మెరుగైన ఆయుధాలు కొన్నది కాబట్టి పోటాపోటీగా యింకా ఆధునికమైన ఆయుధాలు కొనాలంటూ, వీటిని మూలపడేసి మళ్లీ కొత్తవి హెచ్చుధరకు కొనడం సాగుతోంది.
ఈ 72 ఏళ్లల్లో మనం చేసిన యుద్ధాలు ఒక చేతివేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కానీ బడ్జెట్‌లో హెచ్చుభాగం దానికే పోతోంది. అగ్రదేశాలు తమ ఆయుధాల అమ్మకం నిరంతరంగా కొనసాగేందుకు ప్రపంచమంతా యిరుగుపొరుగు దేశాల మధ్య నిప్పు రాజేస్తూ యిద్దరికీ ఆయుధాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ వచ్చాయి. డిఫెన్సు లావాదేవీల్లో అధికార పార్టీకి ముడుపులు దక్కడం, వాటి గురించి ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా ముద్రవేయడం ఆనవాయితీగా జగమంతా జరుగుతున్న భాగోతం. అందువలన అనేక బడుగు దేశాలు తమ ఆదాయంలో సింహభాగాన్ని రక్షణకై వెచ్చిస్తూ కనీస మౌలికసదుపాయాలను నిర్లక్ష్యం చేస్తూ ఎప్పటికీ వెనకబడే వుంటున్నాయి.
భారతదేశం కూడా యిదే బాటలో నడుస్తోందని మనం గమనించవచ్చు. మనం కోత పెడుతున్నది అత్యవసరమైన విద్య, వైద్యరంగాలకు. ఏటేటా డిఫెన్స్ బజెట్ పెరుగుతూండగా విద్య, వైద్య రంగాల బజెట్ తరుగుతూ వస్తోంది. రాజకీయంగా బలం లేనివారిని విద్యామంత్రిగా, వైద్యమంత్రిగా నియమించడం ఆనవాయితీ అయింది. వారు తమ శాఖకు తగిన నిధులు కేటాయించమని అడగలేని నిస్సహాయులవుతున్నారు.
ఆరోగ్యం అనగానే వైద్యసదుపాయాలు అమరిస్తే చాలు కదా అనుకుంటారు. అంతకంటె విద్య ముఖ్యం. విద్య ఉంటే అనేకం సమకూడుతాయి. ఉద్యోగం, ఆదాయం, తద్వారా మెరుగైన వైద్యం పొందే అవకాశం వస్తాయి. అంతేకాదు, విద్య పెరిగినకొద్దీ మతమౌఢ్యం తరిగి కరోనా సమయంలో జరిగిన దురదృష్టకర సంఘటనలు జరగకుండా వుంటాయి. ప్రభుత్వ పాఠశాలల, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగున్నపుడే ఆ రాష్ట్రం లేదా దేశం పరిస్థితి బాగుందని చెప్పుకోవాలి. దురదృష్టవశాత్తూ ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసేసి చేతులు దుపుకుంది. ఏ దేశమైనా ముందుకు వెళ్లాలంటే సైన్సు, టెక్నాలజీ అభివృద్ధి చెందాలి. వాటికి సంబంధించిన పరిశోధనలు యూనివర్శిటీల్లో, ప్రభుత్వ రిసెర్చి సెంటర్లలో విరివిగా జరగాలి. వాటిని పరిశ్రమలు అందిపుచ్చుకుని, ఆచరణలో సాధ్యం చేసి, సామాన్యులకు అందించాలి.
అయితే ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పరిశోధనకు నిధులివ్వదు. శాస్త్రజ్ఞులకు ప్రోత్సాహమివ్వదు. దానితో వారు విదేశాలకు వలస పోతున్నారు. సరైన అధ్యాపకులు లేరు, అనేక యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లు సైతం లేరంటే విస్తుపోతాం. ప్రొఫెసరుకి ఏ మాత్రం ప్రతిభ వున్నా కార్పోరేటు కళాశాల వారు ఎగరేసుకుని పోతున్నారు.
అనేక వైద్యకళాశాల్లో బోధనాసిబ్బంది లేరు. ఎందుకంటే ఒక మంచి వైద్యుడికి – ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పేకంటె, ప్రాక్టీసు చేసుకుంటే కార్పోరేట్ ఆసుపత్రిలో ఉద్యోగిగా లేదా భాగస్వామిగా చేరితే ఎక్కువ లాభసాటిగా వుంది. ఉపాధ్యాయుడే లేనప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అబ్బుతుంది? పేరున్న యూనివర్శిటీలలో కూడా పరిశోధనలు తగినంతగా జరగటం లేదు. గ్లోబలైజేషన్ తర్వాత పరిశ్రమలు సొంత పరిశోధనాలయాలను మూసివేసి, దిగుమతుల మీదే ఆధారపడ్డారు. పరిశోధనలు చేపట్టిన పరిశ్రమలకు ప్రభుత్వం తగినంతగా నిధులు, ప్రోత్సాహకాలు సమకూర్చటం లేదు.
ఇక ప్రభుత్వ ఆసుపత్రుల వద్దకు వస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వైద్యులు లేరు, నర్సులు లేరు, మందులు లేవు, పడకలు లేవు, వసతులు లేవు, ఎక్విప్‌మెంట్ లేదు, రోగులు తిరగబడ్డారు, ఎమ్మెల్యేలు డాక్టర్లను కొట్టారు, జూనియర్ డాక్టర్లు సమ్మె చేశారు.. ఎప్పుడు చూసినా యివే కదా వార్తలు! ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైతే చెప్పనే అక్కర్లేదు. ఏవీ వుండటం లేదు. వీటిని ఎండగట్టి పేషంట్లను ఆరోగ్యశ్రీ పేరుతో కార్పోరేట్ల ఆసుపత్రులకు తోలుతున్నారు. అంటే ప్రభుత్వం తన ఆసుపత్రుల నిర్వహణ విషయంలో వైఫల్యాన్ని తనే ఒప్పుకున్నట్లయింది.
ఈనాడు కరోనా రాగానే హఠాత్తుగా ప్రభుత్వ ఆసుపత్రుల అవసరం అందరికీ గుర్తుకు వచ్చింది. ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేయబడి, యిప్పటికిప్పుడు యింద్రజాలికుడి మఱ్ఱిచెట్టులా హఠాత్తుగా ఎదిగి నీడ నివ్వాలంటే వాటికి సాధ్యమా? కార్పోరేట్ ఆసుపత్రులు వైద్యసేవల నందిస్తున్నాయి. కానీ సామాన్యుడికి అవి భారమౌతున్నాయనే ఫిర్యాదు వుంది. హైదరాబాదులో అనేక ఔషధపరిశ్రమలున్నా మందుల ధరలు చాలా ఎక్కువగా వుంటున్నాయన్న ఫిర్యాదు కూడా వుంది.
శాంతా బయోటెక్నిక్ వంటి దేశీయ సంస్థలు చౌకధరలకు మందులు, టీకాలు అందించాయి. కానీ దూరదృష్టి లోపించిన ప్రభుత్వం ఔషధ సంస్థల్లో కూడా నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడంతో అవి విదేశీ పెట్టుబడుదారుల చేతుల్లోకి వెళ్లిపోయి, వారి విధానాలకు అనుగుణంగా, వ్యాపారధోరణికి అనువుగా పని చేసే పరిస్థితి వచ్చింది. కార్పోరేట్ ఆసుపత్రుల విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రభుత్వం తన ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్యం అందించలేదు సరికదా, తన విధానాల వలన ఔషధాలు సరసమైన ధరలకు లభించే అవకాశాన్నీ చెడగొట్టింది. ఇప్పుడు అందరూ గగ్గోలు పెడుతున్నారు.
వెంటిలేటర్స్ వంటి వైద్యపరికరాలు, టెస్టింగ్ కిట్స్, టెస్టింగ్ లాబ్స్ లేవని యిప్పుడు అందరూ గోల పెడుతున్నారు. పరీక్షలు నిర్వహించే సామగ్రి లేకపోబట్టే మన దేశంలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య ఖరారుగా తెలియటం లేదని యావత్ప్రపంచం వ్యాఖ్యానిస్తోంది. మరి వీటి మీద పాలకులు ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? ఇప్పటికిప్పుడు యివన్నీ కావాలంటే పుట్టుకుని వస్తాయా? వచ్చినా వాటి నాణ్యత గురించి గ్యారంటీ వుందా? దాహమయ్యాక బావి తవ్వడానికి పూనుకుంటున్నామని అర్థమైంది కదా. ఈ స్థితికి కారకులెవ్వరు? పాలకులు! వారిని ఎన్నుకుని, వారేం చేసినా ఊరుకుంటున్న మనలాటి నిస్తబ్ద, నిస్తేజ పౌరులం! ‘మా ప్రాణాలకు ముప్పు వస్తోంది. మీ ప్రాధాన్యతాక్రమాన్ని మార్చుకోండి, లేకపోతే సహించం’ అని ముక్తకంఠంతో మనం ఎలుగెత్తి చెప్పాల్సిన సమయం వచ్చింది. ‘దేశానికి కావల్సినది అణ్వస్త్రాలు కాదు, అన్నవస్త్రాలు’ అన్నాడు శ్రీశ్రీ. ఈనాడు మనం ‘ఔషధాలు, వైద్యులు’ అని చెప్పవలసిన అవసరం వచ్చింది.
తగినంతమంది వైద్యులు తయారుకాకపోవడంలో పౌరసమాజం పాత్రా వుంది. దానిలో నేనూ, మీరూ అందరం బాధ్యులమే. రాష్ట్రంలో పుట్టెడు ఇంజనీరింగు కాలేజీలుంటే కేవలం పుంజీడు మెడికల్ కాలేజీలుంటున్నాయి. కంప్యూటరు ఒక్కటి వుంటే చాలు, వ్యవసాయం అక్కరలేదు, వ్యాపారం అక్కరలేదు, పరిశ్రమలు అక్కరలేదు, అమెరికా వెళ్లి డాలర్లు నొల్లుకుని వచ్చేయచ్చు అనుకునే ఆలోచనాధోరణిని పాలకులు ప్రోత్సహించి సమాజాన్ని అలా పోతపోశారు. దాంతో ప్రజలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బేసిక్ ఇంజనీరింగ్ శాఖల్ని కూడా మూలపడేశారు. నాలుగురాళ్లు పోగేసుకోవాలంటే వాళ్లూ కంప్యూటర్స్‌లోకి వచ్చేయాల్సిన అగత్యం కల్పించారు. ఇప్పుడు కరోనా నుంచి ఏ కంప్యూటర్ రక్షించింది? ఇన్నాళ్లూ కంప్యూటర్ వైరస్ గురించే బెంగపెట్టుకున్నవారు యీనాడు సజీవమైన వైరస్ రంగంలోకి దిగేసరికి బెంబేలెత్తుతున్నారు.
మెడికల్ కాలేజీ పెట్టాలంటే వసతులుండాలి, బోధక సిబ్బంది వుండాలి, తోడుగా ఆసుపత్రి వుండాలి. అనుమతి తెచ్చుకోవడం భగీరథ ప్రయత్నమే. అందుకని వాటి జోలికి వెళ్లటంలేదు. దాంతో మెడికల్ కాలేజీ సీటంటే గగనకుసుమం అయిపోయింది. కోటి, రెండు కోట్లు ఖర్చు పెడితే తప్ప ఎంబిబిఎస్ పూర్తవటం లేదు. దానితో ప్రభుత్వోద్యోగం రాదు. కార్పోరేట్లయితే 25 వేల లోపు స్టయిపెండ్‌తో సరిపెడుతున్నారు. అది ఓ కంప్యూటర్ ఆపరేటర్‌కు వచ్చే జీతం కంటె తక్కువుంటోంది. దాంతో పోస్టు గ్రాడ్యుయేషన్‌కి వెళుతున్నారు. అదో రెండు కోట్ల ఖర్చు. ఇంత ఖఱ్చు పెట్టి, లేటుగా ఆర్జన మొదలుపెట్టాక మరి ఫీజు భారీగా తీసుకోక డాక్టర్లకు తప్పుతుందా? దాంతో కన్సల్టేషన్ భారం, అనవసరమైన టెస్టుల భారం, మందుల భారం – వీటన్నిటితో డాక్టరు దగ్గరకు వెళ్లాలంటేనే సామాన్యుడు జంకుతున్నాడు. అస్వస్థత కలిగినా మందులషాపు వాడిచ్చిన బిళ్లలు మింగుతున్నాడు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నాడు.
మెడికల్, నర్సింగ్ కాలేజీలు పెంచమని, వైద్యుల, నర్సుల సంఖ్య పెంచమని మనం ప్రభుత్వాన్ని పట్టుబట్టాలి. మా పట్టణానికి వైద్యకళాశాల శాంక్షన్ చేయండి అని ప్రజాప్రతినిథులను డిమాండ్ చేయాలి. సామాన్య కుటుంబాల నుంచి కూడా ఎందరో ఇంజనీర్లు తయారయ్యారు. అదే విధంగా డాక్టర్లు కూడా తయారు కావాలని మనం కోరుకుని ఆ దిశగా కృషి చేయాలి.
అంతేకాదు, వారు పనిచేసేందుకు ఆసుపత్రులు కూడా కావాలి. ప్రాకృతికంగా లేక మానవ ప్రేరితాలుగా కరోనా వంటి ఇంకెన్ని అంటువ్యాధులు వస్తాయో తెలియదు కాబట్టి జిల్లాకు 200 పడకల ఐసోలేషన్ వార్డు కట్టి అత్యంత పరిశుభ్రమైన పరిస్థితుల్లో వాటిని మేన్‌టేన్ చేయాలి. ప్రతి పేషంటు రాష్ట్రరాజధానికి తరలిరానక్కరలేదు. జిల్లాకొకటి చొప్పున దేశమంతా కడితే చాలా ఖర్చవుతుందనవచ్చు. ఎంతైనా ఒక ఏడాది డిఫెన్సు బజెట్ కంటె తక్కువే! కట్టినదాకా వుండి వ్యాధులు రాకపోతే యిదంతా వృథా కదా అంటారేమో, యుద్ధం వస్తే తయారుగా వుండాలి కదాని మనం సైన్యాన్ని మేన్‌టేన్ చేయడం లేదా? ఎప్పుడో నిప్పంటుకుంటుందేమోనని ఫైర్ డిపార్టుమెంటును నిర్వహించటం లేదా? అక్కడేమైంది యీ లాజిక్! ఇదంతా డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే చూడాలి.
మన జీవనవిధానం మార్చుకుని రోగనిరోధకశక్తి పెంచుకునే లోపున యింకొన్ని వైరస్‌లు రావచ్చు. అప్పుడు హడావుడిగా, అరకొర సదుపాయాలతో క్వారంటైన్‌లు కట్టబోతే వాటి కారణంగా రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది. ఇదే మనం సమకూర్చుకోగలిగిన మొదటి వాక్సిన్. ఈ వాక్సిన్ పాత, కొత్త, సరికొత్త – అన్ని రోగాలకూ పని చేస్తుంది. ఇక రెండో వాక్సినంటారా? అది వ్యక్తిగతమైంది.(సశేషం)
డా. కె.ఐ. వరప్రసాద్ రెడ్డి
వ్యవస్థాపక ఛైర్మన్, శాంతా బయోటెక్నిక్స్ లి.