వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన కేసుల వ్యవహారం నుంచి తమను తప్పించాలని కోరుతూ.. కంపెనీల, ఆ కంపెనీల యజమానుల, అధికారుల పిటిషన్లపై విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు ఆ వ్యవహారాల నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చాకా సీబీఐ విచారణ, క్విడ్ ప్రో కో కేసులు, 16 నెలల పాటు జగన్ ను జైల్లో ఉంచడం వంటి పరిణామాలను ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు.
ఈ కేసులపై విచారణ కొనసాగుతూ ఉంది. అయితే క్విడ్ ప్రో కో వ్యవహారంలో ఇప్పటికే పలువురు వ్యక్తిగతంగా ఆ కేసుల నుంచి బయటకు వచ్చిన దాఖలాలున్నాయి. ఈ క్రమంలో హెటిరో తరఫున ఒక క్వాష్ పిటిషన్ విచారణలో ఉంది. అది నిన్న విచారణ జరిగింది, ఈ రోజు కూడా తెలంగాణ హై కోర్టులో విచారణ జరగనుంది.
జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టాలంటూ తమను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఆ సంస్థ కోర్టుకు విన్నవించింది. అలాగే తమకు సెజ్ లలో కేటాయించిన స్థలాలు కూడా పూర్తిగా నిబంధనలతో కూడుకున్నవే అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందులో క్విడ్ ప్రో కో ఆధారాలు ఏమీ లేవన్నారు.
జగతి పబ్లికేషన్స్ కు సంబంధించి డెలాయిట్ నివేదికను ఆధారంగా చేసుకునే పెట్టుబడులు పెట్టినట్టుగా వివరించారు. ప్రభుత్వం చేత లబ్ధి పొంది, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది సీబీఐ మోపిన ప్రధానమైన అభియోగం. దీన్నే క్విడ్ ప్రో కో గా అభివర్ణించింది.
అయితే లంచాలను ఎవరూ వైట్ మనీగా కంపెనీల్లో పెట్టుబడులుగా, షేర్లుగా పెట్టారు గా అనే వాదనతో పాటు.. నిబంధనల మేరకే తమకు కేటాయింపులు జరిగాయి తప్ప, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు కాదని వివిధ సంస్థలు వాదనలు వినిపిస్తున్నాయి. ఇండియా సిమెంట్స్, హెటిరో వంటి కంపెనీలు క్వాష్ పిటిషన్లతో కోర్టును ఆశ్రయించాయి.