టీ20 ప్రపంచకప్ లో తమ ఓటమి గురించి సాకులు చెబుతూ ఉన్నారు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ. అయితే కొహ్లీ చెబుతున్న సాకుల పట్ల సీనియర్ లు పెదవి విరుస్తున్నారు. ఇక అభిమానులు అయితే సరేసరి. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడలేకపోయారు, కనీసం ఒక్కరు కూడా కఠినమైన పరిస్థితుల్లో రాణించలేకపోయారనేది ప్రధాన ఫిర్యాదు.
భారత క్రికెటర్లు పొందుతున్న ప్రశంసలకూ, టీ20 ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచ్ లలో ఆట తీరుకూ ఏ మాత్రం సంబంధం లేకపోవడంతో ఫ్యాన్స్ ఖిన్నులయ్యారు. టాస్ కలిసి రాలేదు సరే, అంత మాత్రానికే ఇలా చేతులెత్తేయాలా అనేది ప్రధానమైన ప్రశ్న.
మరి నిన్నటి మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆట తీరును గమనిస్తే.. వీళ్లు కదా ఛాంపియన్స్ అనిపించకమానదు! టీ20 లో ఛాంపియన్స్ ఆట ఎలా ఉంటుందో ఇంగ్లండ్ ఆట తీరును గమనిస్తే అర్థం అవుతుంది. ఈ సారి ప్రపంచకప్ విషయంలో ఛాంపియన్ గా ఎవరూ ఇంగ్లండ్ పేరును చెప్పలేదు. అయితే తొలి నాలుగు మ్యాచ్ లలో ఆ జట్టు విజయం సాధించిన తీరును గమనిస్తే.. ఈ సారి టైటిల్ కు హాట్ ఫేవరెట్ గా ఇంగ్లండ్ ను పరిగణించాల్సి ఉంటుంది.
షార్జా వేదికగా ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్ లో .. ఇంగ్లండ్ టాస్ ఓడిపోయింది. ముందుగా బౌలింగ్ చేసిన జట్లకే విజయావకాశాలు మెజారిటీగా ఉన్న నేపథ్యంలో శ్రీలంక మరో ఆలోచన లేకుండా ముందుగా బౌలింగ్ తీసుకుంది. అందుకు తగ్గట్టుగా ఆరంభ ఓవర్లలో శ్రీలంక బౌలర్లు రాణించారు. ఇంగ్లండ్ ను కట్టడి చేస్తున్నట్టుగా కనిపించారు.
ఆరో ఓవర్ కే ఇంగ్లండ్ కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో ఇది కూడా ఈ సారి సాగుతున్న మరో మ్యాచ్ అనే అంతా అనుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు పడే ఇబ్బందులు ఇంగ్లండ్ కు తప్పవనే అనుకున్నారు వీక్షకులు. అంతకు ముందు మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఇలాగే ఇబ్బంది పెట్టింది కూడా! ఈ సారి ఇంగ్లండ్ వంతు వచ్చినట్టుగా అనిపించింది.
అయితే అక్కడే అసలు ట్విస్టు. సిసలైన ఛాంపియన్ ఆట ఎలా ఉంటుందో ఆ తర్వాత ఇంగ్లండ్ చూపించింది. ఆరో ఓవర్ కే మూడు వికెట్లు, ఫుల్ స్వింగ్ మీద కనిపించిన లంక బౌలర్లు.. అనే స్థితి నుంచి, మొత్తం కథను మార్చాడు బట్లర్. అద్భుతమైన ఆట తీరుతో సెంచరీని కొట్టి.. తమ జట్టును పటిష్టపరిస్థితుల్లో నిలిపాడు. 67 బంతుల్లో 101 పరుగులు చేసి, ఒంటిచేత్తో సత్తా చూపించాడు. బట్లర్ చూపిన గొప్ప ఆటతీరుతో ఇంగ్లండ్ 163 పరుగుల గౌరవప్రదమైన స్కోరును చేసింది.
ఈ సారి ప్రపంచకప్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు వంద పరుగులను చేయడానికే ముక్కుతూమూలుగుతున్నాయి. 120, 130 లు చేశాడం గగనం. ఇక 150 పరుగులు అద్భుతం.. ఇక రెండోసారి బ్యాటింగ్ చేసే జట్లు ఆ పరుగులను అలవోకగా చేజ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఇంగ్లండ్ తను నిర్దేశించిన టార్గెట్ ను కాపాడుకోవడంలో కూడా విజయవంతం అయ్యింది.
రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుదే విజయం అనే పరిస్థితులను తలకిందుల చేస్తూ 19 ఓవర్లలోనే లంక జట్టును 137 పరుగులకు ఆలౌట్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ముందు మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించిన తీరు, ఈ మ్యాచ్ లో ఏటికి ఎదురీదే పరిస్థితుల మధ్యన నెగ్గిన తీరును గమనించినా, నిస్సందేహంగా ఇంగ్లండ్ ఒక ఛాంపియన్ లా ఆడుతోందని చెప్పవచ్చు.