తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ఈ నెల ఆరంభంలో ప్రకటించగా.. అప్పుడు కొంతమంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆ అనుమానాల సారాంశం ఏమిటంటే..రజనీకాంత్ రాజకీయాల్లోకి నిజంగానే వస్తారా? అనేది! జనవరి నుంచి పాలిటిక్స్ అని రజనీకాంత్ దాదాపు నెల కిందట ప్రకటించగా.. ఏ జనవరి? అంటూ కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. రజనీకాంత్ జనవరిలో రాజకీయాల్లోకి వస్తారన్నారు కానీ, ఏ జనవరో చెప్పలేదంటూ సెటైర్లు వేశారు.
ఇప్పటికే రాజకీయ పార్టీ విషయంలో ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు వేసిన రజనీకాంత్ డిసెంబర్ ఆరంభంలో చేసిన ప్రకటనకు కూడా కట్టుబడే అవకాశాలు లేవని అనేక మంది అనుమానించారు. ఆయన ఏ టైములో అయినా యూటర్న్ తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
అదేం విచిత్రమో కానీ.. సరిగ్గా నెల అయినా గడవకముందే రజనీకాంత్ యూటర్న్ తీసుకున్నట్టు అయ్యింది. తను రాజకీయాల్లోకి రావడం లేదంటూ రజనీకాంత్ ట్విటర్ లో ప్రకటించారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ లో ఉన్న రజనీకాంత్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు బీపీ పెరిగిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం రజనీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందనే వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే రాజకీయాల విషయంలో కూడా రజనీకాంత్ స్పష్టతను ఇచ్చినట్టుగా ఉన్నారు.
జనవరిలో రాజకీయ కార్యాచరణ అంటూ ప్రకటించిన రజనీకాంత్ ప్రస్తుతానికి వెనక్కు తగ్గినట్టే అని స్పష్టం అవుతోంది. ఆరోగ్యం సహకరించని నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని స్పష్టం అవుతోంది.
అయితే రజనీకాంత్ ఇమేజ్ మీద ఆశలు పెట్టుకున్న కొందరు రాజకీయ వాదులు ఇంతటితో శాంతిస్తారా? అనేది మాత్రం సందేహమే! రజనీని నమ్ముకుని కొంతంది చాలా ప్లాన్లు వేశారని స్పష్టం అవుతూనే ఉంది. ఇప్పుడు అనారోగ్య కారణాలు చూపి రజనీ రాజకీయాల్లోకి రాకపోతే సదరు రాజకీయ శక్తులు ఊరికే ఉండకపోవచ్చు.
ఏదో విధంగా ఆయనపై ఒత్తిడి చేసి చివరకు తమ పార్టీ సభ్యత్వం ఇచ్చి, వీడియోల, ఆడియోల ప్రచారం అయినా చేసుకునే ప్లాన్లను అమలు చేస్తారేమో! అయితే తను ఏ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోబోనంటూ రజనీకాంత్ తన తమిళ ట్వీట్లో స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.