మరో రెండు నెలల్లో పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని యావత్ దేశమంతా ఇప్పటి నుంచే ఉత్కంఠ నెలకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 18 స్థానాలు గెలవడంతో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వం వహిస్తున్న పార్టీలో వణుకు పుట్టింది. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో 294 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలోకి వలసలు పెరిగాయి. దీంతో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ పాగా వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిస్తుండగా, బీజేపీలో జోష్ నింపుతోంది. మరోవైపు కాంగ్రెస్ -వామపక్షాలు కూటమిగా ఏర్పడి ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి.
ఇప్పటికే వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలుపొందిన మమతాబెనర్జీ …ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తారా? లేక బీజేపీకి అధికారం అప్పగిస్తారా? అనే అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై సీఎన్‌ఎక్స్, ఏబీపీ ఆనంద అనే సంస్థలు పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా గత నెల 23 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సర్వే నిర్వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,960 మంది నుంచి వివరాలు సేకరించారు.
ఈ ప్రజాభిప్రాయంలో ఆసక్తికర, సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు 146 నుంచి 156 స్థానాలు, బీజేపీకి 113-121 సీట్లు, కాంగ్రెస్-వామపక్షాల కూటమికి 20 నుంచి 28 స్థానాలు దక్క వచ్చని తేలింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 148 సీట్లు. అంటే మమతాబెనర్జీ అధికారానికి రెండు సీట్ల దూరంలో ఉన్నట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఒకవేళ అదే పరిస్థితే తలెత్తితే కాంగ్రెస్ -వామపక్షాల కూటమి మమతాబెనర్జీకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.