పదవులపై ఫిరాయింపుదారుల ఆశలు గల్లంతే!

కష్టపడి పనిచేసినవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, అలాంటివారికే పదవులు ఇస్తామని మీనాక్షి నటరాజన్​ చెప్పారు.

తెలంగాణ కాంగ్రెసు పార్టీకి కొత్త ఇన్​చార్జిగా మీనాక్షి నటరాజన్​ నియమితులైన సంగతి తెలిసిందే కదా. ఆమె సింప్లిసిటీ అంటే నిరాడంబరత గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె విమానంలో కాకుండా రైలులో హైదరాబాదుకు వచ్చారు. ప్రభుత్వ అతిథి గృహంలోనే బస చేశారు. నాయకులను, కార్యకర్తలు స్టేషన్​కు వచ్చి తనకు ఘన స్వాగతం పలకవద్దని, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టవద్దని, నినాదాలు చేయవద్దని ఆదేశించారు. ఆమె చెప్పిన ప్రకారమే జరిగింది.

ఆమె మొదటిసారి రావడం కాబట్టి పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కొద్దిగా గట్టిగానే మాట్లాడారు. హెచ్చరికలు చేశారు. ప్యారాచూట్​ నేతలకు అంటే ఫిరాయింపుదారులకు పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఈ మాటతో బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు కాంగ్రెసులో పదవులపై ఆశలు గల్లంతైనట్లే. ఇప్పటివరకు అంతో ఇంతో ఆశలు ఉన్నట్లయితే వాటిని తుడిచి పెట్టేయాల్సిందే.

కానీ, కాంగ్రెసు పార్టీలో సీఎం రేవంత్​ రెడ్డే ఫిరాయింపుదారుడు కదా. ఆయన టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెసు పార్టీలో చేరాడు. ఇప్పుడు ఉన్న మంత్రుల కంటే రేవంత్​ రెడ్డి చాలా జూనియర్​. కాని ఆయన వల్లనే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిందని అధిష్టానం ప్రధానంగా రాహుల్​ గాంధీ విశ్వసించాడు. అందుకే సీఎం అయ్యాడు.

మంత్రి సీతక్క, సలహాదారుడు వేంనరేందర్​ రెడ్డి ఇంకా కొందరు టీడీపీ నుంచి వచ్చినవాళ్లే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి లాంటి అయారామ్​ గయారామ్​లు కొందరు ఉన్నారు. కాని కాంగ్రెసులోనే పుట్టి పెరిగిన కొందరికి పదవులు రావడంలేదు. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి అదే ప్రశ్నించాడు. పార్టీలో 30 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న కుసుమ్​ కుమార్​కు ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్​ చేశాడు.

కష్టపడి పనిచేసినవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, అలాంటివారికే పదవులు ఇస్తామని మీనాక్షి నటరాజన్​ చెప్పారు. ఇదంతా చెప్పడంవరకు బాగానే ఉంటుందికాని ఆచరణలో జరగదు. పదవులు దక్కకపోతే అధిష్టానాన్ని ధిక్కరించడానికి చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారు.

2 Replies to “పదవులపై ఫిరాయింపుదారుల ఆశలు గల్లంతే!”

Comments are closed.