ఇన్నాళ్లూ జాతీయ మీడియాలో ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి ఒక వార్త ఖచ్చితంగా కనిపించేది. అది కల్వకుంట్ల కవిత బెయిలు పిటిషన్ తిరస్కరణ అనే వార్త. కానీ ఒకే రోజు తండ్రీ కూతుళ్లు ఇద్దరికీ కోర్టు నుంచి భంగపాటు ఎదురైంది.
కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై రేవంత్ సర్కారు నియమించిన న్యాయ విచారణను ఆపు చేయించాలంటూ.. కేసీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అదే సమయంలో యథావిధిగా తనకు బెయిలు కావాలంటూ కవిత వేసిన దరఖాస్తు కూడా ఢిల్లీలో తిరస్కరణకు గురైంది.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్రధారి మరియు సూత్రధారిగా అరెస్టు అయి జైలు శిక్ష అనుభవిస్తున్న కవిత.. బెయిల్ కోసం పెట్టుకున్న తాజా దరఖాస్తులను కూడా ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.
ఇన్ని రోజులుగా జైలు జీవితం లోనే ఉన్నప్పటికీ బెయిల్ కోసం కవిత చేసుకుంటున్న దరఖాస్తులు కూడా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. ఒక పార్టీకి కీలక నేతగా ఉన్నందువలన ఆమెను బెయిల్ మీద విడుదల చేయాలని ఒక పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే ఆమెను నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారని బెయిల్ పిటిషన్ లో ప్రస్తావించారు.
నిరాధార ఆరోపణలతో అరెస్టు చేయడం మీద ఇన్నాళ్లుగా జైల్లో ఉండడం అనేది ఊహకు అందని సంగతి. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా అరెస్టు యొక్క మూల స్వరూపాన్ని, తీరును ప్రశ్నించడం ద్వారా తనకు బెయిలు రూపంలో విముక్తి లభిస్తుంది అని కవిత న్యాయవాదులు ఎలా అనుకున్నారో కూడా అర్థం కావడం లేదు. అదే సమయంలో ఒక పార్టీలో నాయకురాలు అనే పేరు మీద బెయిల్ దక్కుతుందని వాళ్ళు ఎలా ఊహించారో చిత్రంగా ఉంది! చూడబోతే తిరస్కరణ గురికావడానికే.. తగిన కారణాలతో వారు బెయిలు పిటిషన్లు వేస్తున్నారేమో అని జనం నవ్వుకుంటున్నారు.
ఎందుకంటే ఇవాళ అవినీతి కేసులలో అరెస్టు అవుతున్న వారు 50- 60 శాతానికి పైగా రాజకీయ నాయకులే! భారత రాష్ట్ర సమితి పార్టీలో కల్వకుంట్ల కవిత హోదా ఏమిటి? ఆమె కేవలం ఒక ఎమ్మెల్సీ! అలాంటివారు ప్రతి పార్టీలోనూ వందల సంఖ్యలో ఉంటారు. ‘పార్టీలో కీలక బాధ్యతలు’ అంటూ కేవలం ఒక ఎమ్మెల్సీకి బెయిలు కోరడం చిత్రమైన విజ్ఞప్తిగా కనిపిస్తోంది.
రెండు రాష్ట్రాలలో అధికారం ఉన్న జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీకి సారథ్యం వహిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కే కేవలం ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే కొన్ని రోజుల షరతులతో కూడిన బెయిలును ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలాంటిది కేవలం ఒక ఎమ్మెల్సీ అయిన కవితకు- పార్టీ నాయకురాలు గనక బెయిలు ఇచ్చేయాలి- అని విచిత్రమైన డిమాండ్లతో కవిత న్యాయవాదులు మళ్లీమళ్లీ పిటిషన్లు వేస్తూ మళ్ళీ మళ్ళీ ఆమెకు భంగపాటు రుచి చూపిస్తున్నారు.