సీఎస్‌కు షాక్‌పై షాక్‌

తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు షాక్‌పై షాక్‌. తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీగా సోమేశ్ కుమార్ కొన‌సాగింపును ర‌ద్దు చేస్తూ హైకోర్టు సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ షాక్…

తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు షాక్‌పై షాక్‌. తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీగా సోమేశ్ కుమార్ కొన‌సాగింపును ర‌ద్దు చేస్తూ హైకోర్టు సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల‌ని సోమేశ్ కుమార్‌ను కోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సోమేశ్‌కుమార్ ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం సీఎస్‌గా తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 12వ తేదీలోపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి రిపోర్ట్ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టంగా పేర్కొంది. 

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి కేటాయించింది. అయితే ఆయ‌న తెలంగాణ‌లో కొన‌సాగేలా క్యాట్ ఉత్త‌ర్వులు ఇచ్చింది. అయితే క్యాట్ ఉత్త‌ర్వుల‌ను కొట్టేయాల‌ని కోరుతూ 2017లో కేంద్ర ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వుంది.  

సోమేశ్‌కుమార్‌కు కేసీఆర్ స‌ర్కార్ ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చింది. తాజా హైకోర్టు తీర్పుతో సోమేశ్‌కుమార్ ప‌రిస్థితి త్రిశంకు స్వ‌ర్గంలో ప‌డ్డ‌ట్టైంది. అయితే సోమేశ్‌కుమార్‌ను వెంట‌నే తెలంగాణ నుంచి సాగ‌నంపేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న‌ట్టు తాజా ఆదేశాలున్నాయి. అయితే కేంద్ర‌ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి ఏపీలో జాయిన్ కావ‌డ‌మా? లేక కేసీఆర్ ఆదేశాల మేర‌కు సోమేశ్‌కుమార్ ప్ర‌త్యామ్నాయం చూసుకుంటారా? అనేది తెలియాల్సి వుంది. సోమేశ్‌కుమార్‌కు మాత్రం తేల్చుకోడానికి స‌మ‌యం చాలా త‌క్కువ‌గా వుంది.