బీఆర్​ఎస్​ జాతీయపార్టీ కాదు.. ప్రాంతీయ పార్టీయే!

జాతీయ రాజకీయాలను వదలి మళ్లీ ప్రాంతీయవాదాన్ని నమ్ముకోవడమే కేటీఆర్​ వ్యాఖ్యల సారాంశం.

కేసీఆర్​ పార్టీ టీఆర్‌ఎస్‌గా ఉన్నంతకాలం ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించింది. పదేళ్లు అధికారంలో కొనసాగింది. కాని ఎప్పుడైతే కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన చేసి టీఆర్​ఎస్​(తెలంగాణ రాష్ట్ర సమితి)ను బీఆర్​ఎస్​(భారత రాష్ట్ర సమితి)గా మార్చాడో అప్పుడే దాని పతనం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో శూన్యంగా మిగిలింది. టీఆర్​ఎస్​ రజతోత్సవం కూడా బీఆర్​ఎస్​పేరుతోనే జరుగుతోంది.

ఈ నెల 27న రజతోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్​ తమది ప్రాంతీయ పార్టీయే అనే అర్థంలో మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే…‘రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాలేదు. బీఆర్​ఎస్​తోపాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాష్ట్రాల్లో బలం పుంజుకొని మరింత బలంగా ఎదుగుతాయి’ అని అన్నాడు. బీఆర్​ఎస్​తోపాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీలు అంటే బీఆర్​ఎస్​ కూడా ప్రాంతీయ పార్టీ అనే కదా అర్థం.

అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని అనుకోవాలా? లేదా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే పార్టీ దెబ్బతిని పుంజుకున్న ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడమా? అసలు ఈ రజతోత్సవ సభనే టీఆర్​ఎస్​ పేరుతో నిర్వహించాలని కొందరు గులాబీ పార్టీ నేతలు డిమాండ్​ చేశారట. రజతోత్సవ సమయానికి పార్టీ పేరు మార్చాలని కోరుకున్నారట. కాని కేసీఆర్​ అందుకు ఒప్పుకోలేదు. కాని కేటీఆర్​ సహా మెజారిటీ నాయకులకు ఇప్పటికీ పాత పేరు మళ్లీ పునరుద్ధరించాలని ఉంది.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చాలామంది నాయకులు తెలంగాణ సెంటిమెంట్​ వదులుకున్నాం కాబట్టే ఓడిపోయామని అభిప్రాయపడ్డారు. అప్పుడే పార్టీ పేరు మార్చాలని డిమాండ్​ చేశారు. కేటీఆర్​ కూడా దీన్ని గురించి ఆలోచిస్తున్నామని చెప్పాడు. మాజీ ఎంపీ వినోద్​ కుమార్​లాంటివారు ఒక అడుగు ముందుకేసి పేరు మార్పుపై కసరత్తు చేస్తున్నామని కూడా చెప్పాడు. గత ఏడాది పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)గా మార్చాల్సిందేనంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి చేశారు.

ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్‌ఎస్‌ యోచిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పార్టీ పేరును తిరిగి ‘టీఆర్‌ఎస్‌’గా మార్చేందుకు అనురించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే పార్టీపరంగా అధ్యయనం జరుగుతోందని కొందరు చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్‌ చేసింది. పేరు మార్పుకు బీఆర్‌ఎస్‌ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తోందని పార్టీవర్గాలు అప్పట్లో చెప్పాయి.

తిరిగి టీఆర్‌ఎస్‌గా పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం ‘కారు గుర్తు’తిరిగి దక్కుతుందా లేదా అంశాన్ని కూడా బీఆర్‌ఎస్‌ అధ్యయనం చేసింది. గత ఏడాది ఒక సందర్భంలో కేటీఆర్​ మాట్లాడుతూ ‘ప్రస్తుత ప్రభుత్వం తీరుచూసి కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలంతా ఇప్పుడు గులాబీ కండువా దిక్కే చూస్తున్నారు. మనం పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర మనకు కొత్త. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు గమనార్హం.

జాతీయ రాజకీయాలను వదలి మళ్లీ ప్రాంతీయవాదాన్ని నమ్ముకోవడమే కేటీఆర్​ వ్యాఖ్యల సారాంశం. ఇంతకీ ప్రస్తుతం బీఆర్​ఎస్​ జాతీయ పార్టీయా? ప్రాంతీయ పార్టీయా? ఆపార్టీ అధినేత అధికారికంగా చెప్పే స్థితిలో లేదు.

8 Replies to “బీఆర్​ఎస్​ జాతీయపార్టీ కాదు.. ప్రాంతీయ పార్టీయే!”

  1. peekinav le, 2024 elections ki mundu mee ayya BJP ki ee sari 200 kooda raavu annadu, AP lo Jagan full majority annadu.. edo antha meeke thelsinattu sollu cheppamante ready vuntaru father son

  2. నిజమేగా, ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవలేదు మొన్న లోకసభ ఎన్నికల్లో. సిగ్గులేని పార్టీ.

Comments are closed.