కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న‌.. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే!

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసు పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో అనర్హత వేటు పడుతుందన్న భయం మొదలైంది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసు పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో అనర్హత వేటు పడుతుందన్న భయం మొదలైంది. అది కొందరిలో వట వృక్షంలా పెరుగుతోంది. దీంతో సుప్రీం కోర్టు తీర్పు రాకముందే పార్టీ మారాలని అంటే తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెసులో చేరి కాంగ్రెసు కండువా కూడా కప్పుకున్నాడు. పార్టీ సమావేశాలకు హాజరయ్యాడు. చివరకు సీఎల్పీ సమావేశానికి కూడా వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఆయన చాలా విచిత్రంగా వ్యవహరించాడు.

తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, కాంగ్రెసు ఎమ్మెల్యేను కానని తెగేసి చెప్పాడు. కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీల్లో తన ఫోటోను వాడుకుంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిరాయింపుదారుల్లో ఇప్పటివరకూ ఏ ఎమ్మెల్యే ఇలా వ్యవహరించలేదు. అంటే ఈయన ఎంత భయపడుతున్నాడో అర్థమవుతోంది.

కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. కొందరు తమకు కేసీఆర్ అంటే ఇప్పటికీ అభిమానమని చెబుతున్నారు. తమ ఇంట్లో కేసీఆర్ ఫోటో కూడా ఉంటుందని, తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా…పరోక్షంగా తాము కాంగ్రెసులో ఇమడలేమని సంకేతాలిస్తున్నారు. కొందరు ఫిరాయింపుదారులు బీఆర్ఎస్‌లో చేరడానికి కేటీఆర్, హరీష్‌రావుల‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన దాదాపు పది నెలలకే మళ్లీ తన సొంత గూటికే చేరేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది. గతంలో మూడు సార్లు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి.. 2024లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కేసుల భయంతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నాడు.

అయితే కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆయనకు అంతగా ప్రాధాన్యం దక్కలేదని, పటాన్‌చెరులో పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి గూడెం మహిపాల్ రెడ్డికి అనేక అవమానాలు ఎదురయ్యాయని, ముఖ్యంగా పటాన్‌చెరులో అధికార కార్యక్రమాలకు ఆయనకు సమాచారం లేకుండా మంత్రులు హాజరవుతున్నారని అంటున్నారు.

అంతేకాదు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన, ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమానికి కూడా ఆయనను పిలవకపోవడం గూడెం వర్గాన్ని తీవ్రంగా నిరాశకు గురి చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలతో ఆయనకున్న విభేదాలు కూడా మరింత లోతుగా మారాయని, ముఖ్యంగా కాటా శ్రీనివాస్ వర్గంతో ఆయనకు పెరిగిన దూరం, గూడెం మళ్లీ యూ-టర్న్ తీసుకునేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

3 Replies to “కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న‌.. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే!”

Comments are closed.