అక్రమ నిర్మాణాలను కూల్చవద్దంటున్నాడు!

హైదరాబాదులో హైడ్రా సంచలనం సృష్టిస్తూ ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులకు సంబంధించిన ఎఫ్ టీఎల్ లో, బఫర్ జోన్ లో ఉన్న పెద్ద పెద్ద నిర్మాణాలు నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య…

హైదరాబాదులో హైడ్రా సంచలనం సృష్టిస్తూ ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులకు సంబంధించిన ఎఫ్ టీఎల్ లో, బఫర్ జోన్ లో ఉన్న పెద్ద పెద్ద నిర్మాణాలు నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య జనం హైడ్రాకు జేజేలు పలుకుతున్నారు. స్వాగతిస్తున్నారు. నీరాజనాలు పడుతున్నారు.

జిల్లాల్లో కూడా హైడ్రాను విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న వాన పడ్డా హైదరాబాదు ఎలా నరకంలా మారుతుందో ప్రతి ఏటా మనం చూస్తూనే ఉన్నాం. జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. పొంగుతున్న నాలాల్లో పడి పిల్లలు , పెద్దలు చనిపోతున్నారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. సిటీలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది.

మొన్నటి వానలో ఖమ్మం సిటీ దాదాపు మునిగిపోయింది. అపార నష్టం వాటిల్లింది. దీనికంతటికీ కారణం చెరువులను చెరబట్టడం అనే సంగతి తెలిసిందే. చెరువులను ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేశారు. అపార్ట్ మెంట్లు, కాలేజీలు నిర్మించారు. ఇదంతా బడాబాబుల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాపం.

ఇదంతా గ్రహించిన రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూలగొట్టిస్తున్నాడు. రాబోయే రోజుల్లో దానికి దానికి మరిన్ని కోరలు తొడగబోతున్నాడు. మరిన్ని అధికారాలు కల్పించబోతున్నాడు. దాన్ని చట్టబద్దం చేయబోతున్నాడు. హైడ్రా ప్రతిపక్షాలకు మింగుడు పడటంలేదు. గులాబీ పార్టీ నాయకులు అండ్ కాషాయం లీడర్లు అదేపనిగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. హైడ్రా వద్దన్నట్టుగా మాట్లాడుతున్నారు.

చాలా కాలం తరువాత గులాబీ పార్టీ బాస్ అండ్ మాజీ సీఎం కేసీఆర్ పెదవి విప్పాడు. నోరు తెరిచిన కేసీఆర్ ఏమన్నాడు? అక్రమ నిర్మాణాలను కూల్చవద్దన్నాడు. తమ పాలనలో అక్రమ నిర్మాణాలే జరగలేదన్నట్లుగా మాట్లాడాడు. అక్రమ నిర్మాణాలు తెలంగాణ ఏర్పడక ముందు నుంచే ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు కూల్చివేతలు ఆపి, కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చాడు. కూల్చివేతలు పరిష్కారం కాదన్నాడు.

అక్రమ నిర్మాణాలు రాష్ట్రం ఏర్పడక ముందు నుంచీ ఉన్నాయంటే తన పదేళ్ల పాలనలో అక్రమ నిర్మాణాలు జరగలేదని చెబుతున్నాడా? కానీ అక్రమ నిర్మాణాల్లో అత్యధిక భాగం గులాబీ పార్టీ నాయకులవేనని వార్తలు వస్తున్నాయి. వాళ్ళే విచ్చలవిడిగా చెరువులను చెరబట్టారని తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పడక ముందు కూడా అక్రమ నిర్మాణాలు జరిగాయి.

అప్పటి పాలకులేమీ పత్తిత్తులు, గొప్ప నిజాయితీపరులు కాదు కదా. కానీ కేసీఆర్ ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు? వలస పాలకుల నుంచి సాధించుకున్న తెలంగాణను ప్రక్షాళన చేస్తానని, సమూలంగా పునర్నిర్మిస్తానని గొప్పలు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తానని హోంకరించాడు. గర్జించాడు. కానీ చప్పబడిపోయాడు.

ఆయన పదేళ్ల పాలనలో కూడా హైదరాబాదు అనేకసార్లు మునిగింది. అయినా చెరువులను రక్షించలేదు. ఇప్పుడేమో నిర్మాణాలు కూల్చడం పరిష్కారం కాదంటున్నాడు. మరి చెరువుల రక్షణకు మార్గం ఏముందో చెప్పవచ్చు కదా. అధికారంలో ఉన్నప్పుడూ బాధ్యతగా లేడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా బాధ్యతగా లేకపోతే ఎలా?

2 Replies to “అక్రమ నిర్మాణాలను కూల్చవద్దంటున్నాడు!”

Comments are closed.