తెలంగాణ బీజేపీలో సొంత పార్టీని ఇష్టం వచ్చినట్లు విమర్శించే ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనే హైదరాబాద్ సిటీలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. క్రమశిక్షణగల పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఇలా ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం, మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంటుంది. రాజాసింగ్ పార్టీ నాయకులను చాలాసార్లు విమర్శించాడు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని ఆక్రోశించాడు. పార్టీని విమర్శించడానికి ఆయనకు ఏదో ఒక సందర్భం దొరుకుతూనే ఉంటుంది.
సొంత పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఒకసారి అన్నాడు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన ఇక భరించలేకపోతున్నానని, పార్టీకి తాను అవసరం లేదు వెళ్లిపో అంటే వెళ్లేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశాడు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తాను సూచించగా, వారి పేర్లను పక్కనపెట్టి.. ఎంఐఎంతో తిరిగే వారికి ఇవ్వడం ఏంటని రాజాసింగ్ ప్రశ్నించాడు. ఇప్పటివవరకూ తాను బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో యుద్ధం చేశానని ఇప్పుడు సొంత పార్టీతో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరమని అన్నాడు.
వాస్తవానికి తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని కూడా అన్నాడు. మరోసారి పాత సామాను బయటకు పోతేనే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నాడు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని, ఇలాంటి సీక్రెట్ మీటింగ్ లు పెడితే పార్టీ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించాడు. చాలాసార్లు రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన నోటి దురుసుకు విసిగిపోయిన పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది కూడా.
ఆయన ఎంత బతిమాలుకున్నా చాలాకాలం సస్పెన్షన్ ఎత్తేయలేదు. చివరకు జాతీయ నాయకత్వం దయతలచి సస్పెన్షన్ ఎత్తేసింది. చాలాసార్లు పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఇంత జరిగినా రాజాసింగ్లో మార్పు రాలేదు. నోటి దురుసు తగ్గలేదు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశాడు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయడం కోసం బీజేపీ తరపున డాక్టర్ గౌతమ్ రావును ఎంపిక చేయగానే రాజాసింగ్ రెచ్చిపోయాడు.
పార్టీలో ఎంత ముఖ్య నాయకుడైతే మాత్రం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి (అది కిషన్‌రెడ్డి నియోజకవర్గం) చెందిన వారికే అవకాశం ఇస్తారా.. అని ప్రశ్నించాడు. మిగతా పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇంకెవరూ కంటికి కనిపించలేదా అని ఫైర్ అయ్యాడు. మీకు గులాంగిరీ చేసేటోళ్లకే పోస్టులు, టికెట్లను పంచిపెడతారా అంటూ నిలదీశాడు.
ఈ మధ్య పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అధ్యక్ష పదవి నిఖార్సైన పార్టీ నేతలకు మాత్రమే ఇవ్వాలన్నాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో రహస్యంగా సమావేశాలు అయ్యే వారికి ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఇవ్వొద్దన్నాడు. మరి కేంద్ర మంత్రిని టార్గెట్ చేసుకొని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో?
జాయిన్ కావాలి అంటే
జాయిన్ కావాలి అంటే