మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రచారాన్ని ఇండియా కూటమి పెద్ద ఎత్తున చేస్తోంది. బీజేపీ మాత్రం 400 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా రాజకీయ పావులు కదుపుతోంది. ఈ సందర్భంగా ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దని బీజేపీ వ్యూహాత్మకంగా నడుచుకుంటోంది. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
దివంగత వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీంతో ముస్లింలు విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనాలు పొందారు. తాజాగా ప్రధాని మోదీ ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్స్ వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే తమకు ఏమవుతుందో అనే అభద్రతా భావం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల్లో బలంగా వుంది.
ఈ నేపథ్యంలో పదేళ్ల ఎన్డీఏ పాలనపై హైదరాబాద్ గాంధీభవన్‌లో చార్జ్‌షీట్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర ముఖ్య నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలవాలని బీజేపీ అనుకుంటోందన్నారు. రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. దీని కోసం ఆ పార్టీకి 400 సీట్లు కావాలన్నారు. ఆర్ఎస్ఎస్ అజెండాను బీజేపీ అమలు చేసిందన్నారు. అందుకే రాజ్యాంగంపై ఆఖరి యుద్ధం ప్రకటించిందని రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శ చేశారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలా? రద్దు చేయాలా? అనే దానికి రెఫరెండంగా జరుగుతున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ ఆవర్భవించి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా రిజర్వేషన్లు తొలగించబోతున్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. బీజేపీకి వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్ల రద్దుకు వేసినట్టే అని ఆయన హెచ్చరించారు.