భారత దేశం ఇప్పటికే కరోనా తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంది. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో.. కరోనా కేసులు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రోజువారీ కేసుల సంఖ్య.. లక్షల్లో నమోదయ్యి భయాందోళనలు రేపింది. ఇలా కరోనా విలయతాండవం దేశానికి కొత్త కాకపోయినా, మూడో వేవ్ అనదగ్గ ప్రస్తుత పరిస్థితుల్లో.. కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతూ ఉండటం గమనార్హం.
ఫస్ట్ వేవ్ లో రోజువారీ కేసుల సంఖ్య పది వేల నుంచి ఇరవై వేలకు చేరడానికి ఏ వారం రోజులో వ్యవధి తీసుకుని ఉండవచ్చు. రెండో వేవ్ లో కూడా కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ పోయింది. రోజువారీ కేసుల సంఖ్య పది వేల స్థాయి నుంచి లక్షకు చేరడానికి అప్పుడు దాదాపు ఇరవై రోజుల సమయం పైనే పట్టి ఉండవచ్చు.
అయితే ఇప్పుడు మాత్రం రోజు వారీ కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతూ ఉంది. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ సమయాలతో పోల్చినా… ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతున్న తీరులో చాలా వేగం ఉంది. వారం కిందటి వరకూ దేశంలో కేసుల సంఖ్య పది వేల లోపే. అయితే.. గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కేసుల సంఖ్య యాభై ఎనిమిది వేలకు పైగా ఉండటం గమనార్హం!
వారం రోజుల కిందటి వరకూ.. దేశంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుందనే భయాలు లేకపోయినా, ఇంతలోనే పరిస్థితి మారిపోయింది. అప్పుడే రోజువారీ కేసుల సంఖ్య యాభై ఎనిమిది వేల స్థాయికి చేరింది. ఒమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాపిస్తుంది… అన్న పరిశోధకుల మాటకు అనుగుణంగా ఇప్పుడు దేశంలో రోజువారీ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నట్టుగా ఉంది.
ఇప్పుడు ఉన్న ఆశావాదం ఏమిటంటే, ఈ వేవ్ దక్షిణాఫ్రికాలో సంభించినట్టుగా వేగంగా పెరిగి, అంతే వేగంగా ముగుస్తుందనేది… అని నిపుణులు అంటున్నారు. మరేం జరుగుతుందో!