వివాదాస్పద, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దిమ్మ తిరిగేలా ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం నియంత్రించడాన్ని వర్మ తప్పు పడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన పది ప్రశ్నలు సంధించారు. కింది స్థాయి నుంచి అందరికీ అండగా నిలవడానికే ప్రభుత్వానికి అధికారమని.. తమ తలపై ఎక్కి కూర్చోవడానికి కాదని అర్థం చేసుకోవాలంటూ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి వర్మ ట్వీట్ చేయడం వైరల్ అయింది.
సినిమా పరిశ్రమలోని సహచరులంతా ఈ సమస్యపై మాట్లాడాలని, ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడూ నోళ్లు తెరవలేరని వర్మ అభిప్రాయపడ్డారు. ట్విటర్, వీడియోల ద్వారా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన వర్మకు అంతే సూటిగా, ఘాటుగా పేర్ని నాని తన మార్క్ పంచ్‌లతో సమాధానాలిచ్చారు.
మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదని వర్మ కామెంట్స్‌పై నాని ట్విటర్ వేదికగా స్పందించారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు…సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? అంటూ సుతిమెత్తగా దెప్పి పొడిచారు.
రూ.100 టికెట్‌ను రూ.1000, రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్, సప్లయ్ అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? అని పేర్ని నాని నిలదీశారు. గత 66 సంవత్సరాలుగా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదనే ప్రభుత్వం సినిమా టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
నిత్యావసరాల ధరల్నే ప్రభుత్వం నియంత్రించవచ్చని, సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని మీరు ప్రశ్నించారని…. సినిమా థియేటర్లు ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు అని నాని దీటైన జవాబిచ్చారు. బలవంతంగా ధరలు తగ్గిస్తే ప్రోత్సాహం తగ్గుతుందని వర్మ అనడంపై నాని విరుచుకుపడ్డారు. ప్రోత్సాహం తగ్గేదెవరికి.. కొనేవారికా? లేక అమ్మేవారికా? నిర్మాతల శ్రేయస్సు తప్ప ప్రేక్షకుల గురించి ఆలోచించరా? అని వర్మను గట్టిగా ప్రశ్నించారు.
అలాగే మరో ప్రశ్నకు సమాధానంగా…. సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా గానీ తమ ప్రభుత్వం భావించడం లేదని తేల్చి చెప్పారు. రెమ్యూనరేషన్, సినిమాకు పెట్టిన ఖర్చు చూసి ఏ ప్రభుత్వమూ టికెట్ ధర నిర్ణయించదని మంత్రి స్పష్టం చేశారు. తాము చేసింది టికెట్ ధరల నియంత్రణే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మూటికీ కాదని వర్మకు తనదైన శైలిలో నాని కౌంటర్ ఇచ్చారు.
కౌంటర్, ఎన్‌కౌంటర్‌లతో సినిమా టికెట్ల ధరల పెంపు వివాదం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య ఆరోగ్యకర వాతావరణాన్ని చెడగొడుతోందని టాలీవుడ్‌కు చెందిన ముఖ్యులు వాపోతున్నారు. సినిమాలే తీయని వర్మ.. సినిమా టికెట్ల ధరల పెంపుపై జోక్యంతో కంపు చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.