ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మాజీ ఎమ్మెల్యే, వైసీపీ చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్ బావమరిది వెంకటసుబ్బయ్య గట్టిగా నిలదీశారు. తన బావ మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీ ఏమైందని ఆయన బహిరంగంగానే నిలదీయడం చర్చనీయాంశమైంది. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య కుమారుడైన వెంకటసుబ్బయ్య ప్రస్తుతం మురికిపూడి సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
గతంలో చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేస్తూ… నిలదీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దివంగత రోశయ్య సంస్మరణ సభలో ఆయన ఆవేశంతో ఊగిపోయారు.
తమ తండ్రి దివంగత సాంబయ్య హయాం నుంచి తాము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా ఉండేవారమన్నారు. ఆ తర్వాత వైసీపీలో పదేళ్ల పాటు పార్టీ కోసం తమ స్థాయికి తగ్గట్టు డబ్బు ఖర్చు చేశామని, అవన్నీ ఏమయ్యాయని ఆయన ఆవేదనతో ప్రశ్నించారు.
కష్టపడి పని చేస్తే తమను మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరిపేట వచ్చిన జగన్ ఇక్కడ పోటీ చేసిన రజినిని గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుంటానని మర్రి రాజశేఖర్‌కు మాట ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. తన బావకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం కచ్చితంగా మోసం చేయడమేనని ఆయన తేల్చి చెప్పారు.