అమరావతి రాజధాని నాటకంలో చివరికి జనసేన-బీజేపీ బలి అవుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఎటూ చెల్లకుండా పోతున్నాయి. అమరావతి రాజధాని వ్యతిరేక, అనుకూల పార్టీలుగా ప్రధానంగా వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందాయి.
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అమరావతిలోనే ఏకైక రాజధాని వుండాలనే డిమాండ్‌ను సమర్థించే పార్టీల జాబితాలో వామపక్షాలు, జనసేన, బీజేపీ చేరాయి. సీపీఎం, సీపీఐ పార్టీలకు ఓట్లు, సీట్ల పరంగా ఎలాంటి ఆలోచన లేదు. కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇక జనసేన, బీజేపీ విషయానికి వస్తే… రానున్న ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినక తప్పదు. 2024లో అధికారమే టార్గెట్‌గా ఆ రెండు పార్టీలు గాలిలో మేడలు కడుతున్న సంగతి తెలిసిందే. అమరావతికి అనుకూలమని జనసేన, బీజేపీ మద్దతు ప్రకటించి, ప్రస్తుతం పాదయాత్రలో పాల్గొంటున్నప్పటికీ, వాటిని ఆ ప్రాంత ప్రజానీకం ఆదరించే పరిస్థితి లేదు.
ఎందుకంటే అమరావతి రాజధాని అనేది ఒక సామాజిక వర్గ ఆర్థిక పునాదులను బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారమనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఆ సామాజిక వర్గం మద్దతు ఏ పార్టీకో అందరికీ తెలిసిందే.
ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని కాదని మరో పార్టీకి రాజకీయంగా అమరావతి ప్రాంత ప్రజలు మద్దతు ఇచ్చే ప్రసక్తే వుండదు. దీంతో అమరావతికి మద్దతు ఇవ్వడం వల్ల ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన, బీజేపీ ప్రజావ్యతి రేకత ఎదుర్కోక తప్పదు. అమరావతి పేరుతో చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా టీడీపీ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే అని చెప్పక తప్పదు.
అమరావతి మహాపాదయాత్ర చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఈ నెల 17న చేపట్టిన భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. దీని బట్టి అమరావతి పరిరక్షణ సమితి ఎంత వ్యూహాత్మకంగా రాజకీయం నడిపిందో ఇప్పటికైనా జనసేన, బీజేపీలకు అర్థమై వుంటుంది.
జనసేన, బీజేపీ మద్దతును టీడీపీకి కూడగట్టే ఎత్తుగడలో భాగంగానే మహాపాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు పాల్గొనేలా చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఎంతగా వేడుకుంటున్నా కలుపుకెళ్లడానికి బీజేపీ అగ్ర నేతల మనసు కరగడం లేదు. బాబు వెన్నుపోటునే గుర్తు చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు అమరావతి ఉద్యమాన్ని ఎర వేయడం, దానికి బీజేపీ-జనసేన కూటమి చిక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాబు పాల్గొనే సభలో జనసేన, బీజేపీ పాల్గొనడం అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల ఆకాంక్షలకు సమాధి కట్టడమే అని ఆ ప్రాంతాల ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాబు కోసం ఇతర వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలను, ఆత్మగౌరవాన్ని బీజేపీ, జనసేన బలి పెడతాయా? అనేదే ప్రశ్న.