అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు తనపై చెప్పుతో దాడి చేసిన 10 రోజులకు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మరోసారి ఆ విషయమై వార్తలకెక్కారు. ఎట్టకేలకు శ్రీనివాసరావుపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి ఇన్ని రోజుల సమయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కాదు.
పోనీ ఫిర్యాదులోనైనా స్పష్టత ఉందా? అంటే లేదనే చెప్పాలి. తనపై దాడికి ప్రధాన కారకులైన సంస్థ, వ్యక్తులపై విష్ణు ఫిర్యాదు చేసిన దాఖలాలేవీ కనిపించడం లేదు. విష్ణు వైఖరి మరింత విమర్శలపాలవుతోంది. విష్ణు ఫిర్యాదును ఒకసారి పరిశీలిస్తే, అందులోని డొల్లతనం కనిపిస్తుంది.
గత నెల 23న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో శ్రీనివాసరావు పథకం ప్రకారం తనపై చెప్పుతో దాడి చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందస్తు పథకం ప్రకారమే చర్చలో పాల్గొన్న శ్రీనివాసరావు తన ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. ఈ వ్యవహారంతో తాను భౌతికంగా, మానసికంగా కలత చెందానని తెలిపారు.
ముందస్తు పథకం ప్రకారమే శ్రీనివాసరావు చర్చలో పాల్గొన్నారని చెబుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి, అందుకు సదరు చానల్ ప్రమేయం లేకుండానే జరుగుతుందా? అనే కోణంలో ఎందుకు ఆలోచించలేదు. ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ చానల్‌పై ఫిర్యాదు చేయడానికి విష్ణు భయపడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దాడి తర్వాత ఏబీఎన్ చానల్ వ్యవహరించిన తీరు, ఆ సంస్థ ఎండీ రాసిన కొత్త పలుకులో దాడి సరైందే అనే అభిప్రాయాన్ని పరోక్షంగా ప్రకటించడం, ఇప్పటికైనా విష్ణు ఆత్మ పరిశీలన చేసుకోవాలనే హిత వచనాలు వేటికి సంకేతమో బాధితుడికి అర్థం కాకపోవడం గమనార్హం.
ప్రతిష్టను దెబ్బ తీశారని వాపోతున్న విష్ణు… ఇంకా దేనికోసం నిజాలు దాచి పెడుతున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోలేని దయనీయ స్థితిలో ఉన్న విష్ణు …ఇక పార్టీ, సమాజ ప్రతిష్టను ఎలా రక్షిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.