ప్రీ-వెడ్డింగ్ వేడుకలకే 2500 రుచులతో భోజనాలు పెట్టారు. ఇక అతిపెద్ద వేడుకైన పెళ్లిలో ఎన్ని వేల రుచులు ఉంటాయో ఊహించుకోవచ్చు. అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన ముచ్చట ఇది. మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు అనంత్. అతడి పెళ్లిలో దాదాపు 3వేల రుచులు కొలువుదీరనున్నాయి.
దేశవిదేశీ ప్రముఖుల్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రుచులతో పాటు, కాంటినెంటల్ వంటకాలన్నింటినీ పెళ్లిలో వడ్డించబోతున్నారు. ఆ మేరకు పలు దేశాల నుంచి చెఫ్ లు ముంబయి చేరుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ మేరకు చెఫ్ లకు కౌంటర్లు కేటాయించారు. రేపట్నుంచే వాళ్లు ప్రిపరేషన్ మొదలుపెడతారు.
ప్రపంచం నలుమూలల్లో దొరికే దాదాపు అన్ని రకాల ప్రధాన వంటకాల్ని అనంత్ అంబానీ పెళ్లిలో వడ్డించబోతున్నారు. ఆహుతులకు పూర్తిస్థాయిలో వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెస్టివల్ ను అందించబోతున్నారు. కేవలం ఈ భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారట.
రీసెంట్ గా నీతా అంబానీ కాశీ వెళ్లారు. అక్కడ కాశీ ఛాట్ భండార్ లో రుచులు ఆస్వాదించారు. అవి నచ్చడంతో, ప్రత్యేకంగా ఆ కౌంటర్ ను కూడా అనంత్ పెళ్లి భోజనాల మెనూలో చేర్చారు. టిక్కీ ఛాట్, టమాట ఛాట్, పాలక్ ఛాట్, కుల్ఫీ ఇక్కడ ప్రత్యేకతలు.
మార్చి 1న మొదలైన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఈనెల 14వ తేదీతో ముగియనున్నాయి. 12వ తేదీన జియో కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లి ఉంటుంది. 14వ తేదీన జరిగే రిసెప్షన్ తో వేడుకలు ముగుస్తాయి.