Advertisement

Advertisement


Home > Articles - Special Articles

దళితయోధుడు బాహుబలి

దళితయోధుడు బాహుబలి

'బాహుబలానికేనా బహుమతి?' అంటూ ఒకానొక వెబ్‌ మ్యాగజైనులో  ప్రచురించిన వ్యాసం ఎందరో దళితులను మనోవేదనకు గురిచేస్తున్నది. బాహుబలి సినిమాకు ఉత్తమ సినిమాగా జాతీయ పురస్కారం లభించటం చాలామంది దళితవిరోధులకు కంటగింపుగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ సినిమా వందల కోట్ల వ్యాపారం చేయటం వలన దీన్ని పాపులర్ సినిమాగా పరిగణించటంలో వీరి అసూయాద్వేషాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమాను ఒక పాపులర్ సినిమాగానే చూస్తు, కోట్ల వ్యాపారం చేయగలిగిందనే అసూయతో, ఆర్ట్ సినిమాలకు ఇప్పటివరకూ ఒరగబెడుతున్న గౌరవానికి భంగం కలిగించిందనే అపవాదులు కూడా వేస్తున్నారనేది నిష్ఠూర సత్యం. ఇంతకు ఈ సినిమా చేసిన పాపం ఏమిటి? అంతకు మించి సో కాల్డ్ ఆర్ట్ సినిమాలు చేసుకున్న పుణ్యం ఏమిటి? అనే విషయాలని చర్చించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.

ఇప్పటిదాకా, అందరినీ అలరిస్తున్న పాపులర్ సినిమాలకు కాకుండా, కొందరు మేధావులు సృజించిన, మేధావులకే అర్ధమయ్యే సినిమాలకు మాత్రమే అవార్డులు రివార్డులు ఇస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఇంతకి ఆర్టు సినిమాల గొప్పదనం ఏమిటి? అత్యాచారాలకు గురౌతున్న స్త్రీలను అబలలుగా చూపించటమే ఈ సినిమాల గొప్పదనం. అలాగే, వివక్షకు గురౌతున్న దళితుల బాధలను కళాత్మకత పేరుతో గ్లోరిఫై చేసి అవార్డులు సాధించటమే ఈ ఆర్టు సినిమాల గొప్పదనం. ఇటువంటి సినిమాలలో ఏనాడైనా విప్లవాత్మకంగా విజృంభించి సమాజ స్థితిగతులు మార్చిన అబలలను గానీ, దుర్బల దళితులను గాను గ్లోరిఫై చేసారా?

కేవలం జనరంజకతను ప్రామాణికంగా తీసుకొని బాహుబలికి సత్కారం జరిగిందనేది అవాస్తవం. ప్రత్యామ్నాయ సినిమాలకే ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన సినిమా, వ్యాపారపరంగా కూడా సఫలం కావటం యాధృచ్ఛికమే కానీ మరోటి కాదు అనే విషయాన్ని ఈ విమర్శకులు కావాలనే మరుస్తున్నారు, ఏమారుస్తున్నారు. ప్రత్యామ్నాయపు సినిమాలలో కూడా స్త్రీని ఆటవస్తువుగా చూపించే ప్రయత్నాలు జరిగినా, వాటి గురించి వీసమెత్తు ఉలిక్కిపడని వ్యక్తులే ఇప్పుడు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను భూతద్దాలలో చూపిస్తూ స్త్రీలను కించపరిచారని ప్రస్తావించటం శోచనీయం. ప్రతిసినిమాకు వీళ్ళ ప్రమాణాలు మారుతాయనేది విషాదమైనా అది ఒక యధార్ధం.

సాహిత్యం, సినిమా చేయాల్సిన పనులేమిటో చెబుతూ, జీవితపు కిటికీలన్నిటినీ తెరిచి వెలుగు ప్రసరింపచేయటమే కాదు, ఆ వెలుగును సొగసుగా పట్టిచూపిస్తే మంచి సినిమా ఔతుందని ‘బాహుబలానికేనా బహుమతి’ అన్న వ్యాసంలో రచయిత్రి అభిప్రాయపడ్డారు. అంతవరకూ సంతోషమే. ఆ వెలుగుల సొగసును చూపటంలో బాహుబలి ఎక్కడ విఫలమయ్యిందనే విషయం మీద మాత్రం చర్చ జరగనే లేదు. అరివీరభయంకరులుగా వెండితెర మీద వెలుగొందుతున్న అగ్రవర్ణ హీరోల సరసన సూపర్‌హీరోగా ఓ దళితపాత్ర సృజింపబడటం కూడా వీరికి సుతరామూ ఇష్టంలేదు.

రాచరికపు జిత్తులకు బలైపోయిన ఓ దళిత రాచబాలుడు మూలవాసులకు దొరకటం, మూలవాసులతో కలసిమెలసి పెరుగుతూ తానే మూలవాసిగా మనగలగటం, వారి నివాసప్రాంతంలో ఉన్న ఓ విప్లవ వనితతో ప్రేమలో పడటం, బహుశా ఈ విమర్శకులకు నచ్చినట్లు లేదు. నిజానికి, ఆ రాచబాలుడు కూడా మూలవాసే. ఆ మూలవాసుల రాజ్యానికి వారసుడే. మూలవాసుల రాజుల బిడ్డ అయినా, ఓ దళితుడు తెల్లని ఓ అప్సరసలాంటి ఓ స్త్రీతో ప్రేమలో పడటం ఈ మనువాద రాచరికవాదులకు నచ్చకపోవటంలో ఆశ్చర్యం లేదు.

మూలవాస దళితులకు పూజనీయుడైన మహిషుని పేరుతో ఏర్పాటు చేసుకున్న మాహిష్మతి రాజ్యం ఈ విమర్శకులకు బహుశా ఒక పెద్ద అవరోధమయ్యుంటుంది. ఇక అతని తండ్రి పెద్ద బాహుబలి దగ్గరకు వద్దాం. చిన్నతనంలోనే, మూలవాసులకు బానిసగా ఉన్న సైన్యాధ్యక్షుడిని మామ అని సంభోదించటం ఈ మనువాదులకు నచ్చిఉండదు. అంతేకాక, ఆ బానిస దగ్గర భోజనం చేయటం కూడా వీరికి నచ్చదు. ఎందుకంటే, తమకన్నా హీనులుగా భావించబడిన వాళ్ళతో మమేకమవ్వటమనేది ఈ మనువాదులకు నచ్చదు గాక నచ్చదు. ఇకపైగా, ఆ బానిస ఆ మాహిష్మతి అనే ఆ దళితరాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు కావటం కూడా పుండు మీద కారం చల్లినట్లు ఉండిఉంటుంది!

అంతేకాక, బ్రాహ్మణవాద పురోహితుడు చెప్పినా, మనువాద రాచరికాన్ని పాటించే ప్రతినాయకులు చెప్పినా వినకుండా యుద్ధానికి బయలుదేరే ముందు మహిషిని బలి ఇవ్వకపోవటంలోని ఔదార్యం, సహృదయత ఈ విమర్శకులకు నచ్చి ఉండకపోవచ్చు. వీటన్నిటికీ తోడు మూలవాసుల పైన రాజ్య విస్తరణ కాంక్షతో కాలకేయులనే ఆర్యులు చేసిన దండయాత్రలో మూలవాసులైన దళిత బహుజనులు పోరాడి గెలుపొందటం వీరికి ఒకింత విస్మయాన్ని, మరింత బాధను కలుగచేసింది. అందుకే బాహుబలికి ఉత్తమ చలనచిత్రంగా నచ్చి మెచ్చి భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తూర్పారబెడుతున్నారు.

ఏదేమన్నా బాహుబలి మూలవాసులైన దళితుల కధ, వారి వ్యధ. మనువాద ఆధిపత్యధోరణికి వ్యతిరేకంగా ఉద్యమించిన దళిత అస్తిత్వ పోరాట చరిత్ర. రాజ్యసాధనకు మూలవాసులు చేసిన మహాసంగ్రామం. రెండు పక్షాలుగా విడిపోయిన మూలవాసులైన ఇద్దరు వారసుల మధ్య జరిగిన పోరాటం. మూలవాసి అయినా, మనువాదిగా రూపాంతరం చెందిన ఒక దుర్మార్గుడికి, మూలవాసులైన దళితబహుజనుల ప్రయోజనాలకు కంకణబద్ధుడైన ఒక యోధునికి మధ్య జరిగిన సంగరం బాహుబలి.  రాబోయే మరో పార్టులో ఈ మనువాద, మత అహంకార, కుల దురహంకార, బ్రాహ్మణవాదులకు బాహుబలి మరోసారి బుద్ధి చెబుతుందని ఆశిస్తూ, మరోసారి జాతీయ అవార్డు కూడా గెలుస్తుందని ఆశిస్తూ..

చేతన 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?