బన్నీ ఫంక్షనా..గంటా బల ప్రదర్శనా?

సరైనోడు ప్రీ సక్సెస్ మీట్ ఈ నెల 10న విశాఖలో జరపడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ తరహా ప్రీ సక్సెస్ మీట్ అన్నది కొత్త ప్రయోగం. అయితే దీనికి జరుగుతున్న ఏర్పాట్లు, అంతర్గత…

సరైనోడు ప్రీ సక్సెస్ మీట్ ఈ నెల 10న విశాఖలో జరపడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ తరహా ప్రీ సక్సెస్ మీట్ అన్నది కొత్త ప్రయోగం. అయితే దీనికి జరుగుతున్న ఏర్పాట్లు, అంతర్గత ఆదేశాలు తెలుస్తుంటే, ఇదంతా సినిమా కోసమే చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

విశాఖ  లో అడియో ఫంక్షన్ లేదా సినిమా ఫంక్షన్ చేయడం కొత్త కాదు. భారీ సభలు ఎన్నో జరిగాయి.అంతెందుకు బన్నీదే సత్యమూర్తి సభ విశాఖలోనే జరిగింది. కానీ ఇదేదో ఈ సభతో సినిమా పరిశ్రమ మొత్తం విశాఖకు తరలి వస్తుందని నమ్మ బలుకుతున్నారు గంటా శ్రీనివాసరావు. సభలు జరిగితే సినిమా పరిశ్రమ ఎలా తరలి వస్తుందో ఆయనకే తెలియాలి. 

ఇధిలా వుంటే ఈ సభకు నభూతొ.. భవిష్యతి అన్నట్లు జనం రావాలి అని అరవింద్ అండ్ గంటా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. మొత్తం స్టేట్ లో వున్న బన్నీ, మెగా ఫ్యాన్ అందరికీ ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి అని వినికిడి. కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించినట్లు వినికిడి. అలాగే విశాఖలోని కాలేజీ జనాలను కూడా సభకు తరలించేందుకు గంటా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది కాక ఆయన తన పొలిటికల్ అనుచరులు అందరితో జనాలు తరలించే వ్యూహ రచన కూడా చేసారని వార్తలు అందుతున్నాయి. 

ఇదంతా చూస్తుంటే అసలు సక్సెస్ మీట్ అక్కడ ఏర్పాటు చేసింది గంటా తన బల ప్రదర్శన కోసమా అన్న అనుమానం కలుగుతోంది. గంటాను ఇటీవల తెలుగుదేశం పార్టీ కాస్త పక్కన పెట్టిందని గుసగుసలు వున్నాయి. ఇదీ తన బలం అని బాబుకి, లోకేష్ కు అన్యాపదేశంగా చెప్పడానికే గంటా ఈ సభను వాడుకుంటున్నారా అన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

చిరు కోసం కూడా

ఇటీవల బ్రూస్ లీ తరువాత చిరంజీవి చరిష్మాను మళ్లీ పునరుద్దరించే పనులు ప్రారంభించారు. సర్దార్ గబ్బర్ సింగ్ అడియోతో అది ప్రారంభమైంది. శ్రీజ పెళ్లికి అంతలా మీడియాకు ఫొటోలు , విడియోలు పదేపదే విడుదల చేయడం వెనుక కూడా అదే స్ట్రాటజీ అని వినికిడి. పెళ్లయిన వారం తరువాత కూడా ఇంకా విడుదల చేస్తుండడం విశేషం. ఇప్పుడు సరైనోడు సభ కూడా ఆ చరిష్మాను పెంచుతుందని భావిస్తున్నారు. చిరంజీవి పదే పదే జనంలో కనిపించాలని, ఆయన పట్ల పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగాలని వ్యూహరచన జరుగుతోందని వినికిడి. దీని ద్వారా 2019 నాటికి రాజకీయ వేదిక పై చిరంజీవి ప్రముఖంగా వుండేలా ప్రణాళికల రచన సాగుతోందంటున్నారు.

ఆ రెండూ హిట్ అయితే

సరైనోడు, సర్దార్ హిట్ అయితే ఇక టాలీవుడ్  వన్ సైడ్ అయిపోయినట్లే. మెగా హీరోలదే పైచేయి అయిపోతుంది. మరోపక్క శ్రీను వైట్లతో వరుణ్ తేజ, సాయి ధరమ్ తేజ సుప్రీమ్ కూడా ఓ రేంజ్ సినిమాలుగా మారబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో  ఇక మహేష్ బాబు ఒక్కరే ఆ రేంజ్ చరిష్మా వున్న హీరోగా తెలుగుదేశం సామాజిక వర్గానికి కనిపిస్తారు. 

మొత్తం మీద 2019 దగ్గరయిన కొద్దీ టాలీవుడ్ ప్లస్ ఆంధ్ర రాజకీయాలు పూర్తిగా పరస్పర ఆధారిత వ్యూహరచనలతో ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది.