Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఫిదా

సినిమా రివ్యూ: ఫిదా

రివ్యూ: ఫిదా
రేటింగ్‌: 3.25/5
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి, సాయిచంద్‌, రాజేష్‌, శరణ్య ప్రదీప్‌, హర్షవర్ధన్‌ రాణె తదితరులు
మాటలు: ప్రకాష్‌
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
నేపథ్య సంగీతం: జీవన్‌
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌
నిర్మాతలు: రాజు, శిరీష్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల
విడుదల తేదీ: జులై 21, 2017

వందలాది ప్రేమకథలు చూసిన కళ్లకి మరో ప్రేమకథని చెప్పి మెప్పించడం క్లిష్టమైన పని. అయితే కొందరు దర్శకులు ఎన్నిసార్లు చూసిన కథలనైనా ఇంకోసారి మెచ్చుకునేలా, హత్తుకునేలా చెప్పగలరు. ప్రేమకథా చిత్రాల్లో శేఖర్‌ కమ్ములది ప్రత్యేకమైన బాణీ. 'సినిమాల్లో' మాదిరిగా చూసీ చూడగానే ప్రేమలో పడిపోవడాలు, యాక్షన్‌ చెప్పగానే తెరపై ప్రేమ నటిస్తోన్న క్యారెక్టర్లు అతని స్టయిల్‌ ఆఫ్‌ రొమాన్స్‌ కానే కాదు. 'హీరో'లాంటి కుర్రాడిని చూడగానే ఇక సర్వస్వం అతడే అన్నట్టు ప్రవర్తించే ఫిమేల్‌ క్యారెక్టర్స్‌ రాయడానికి అతను ఇష్టపడడు. 'ఆనంద్‌'లో రూప అయినా, 'గోదావరి'లో సీతామహాలక్ష్మి అయినా, ఇప్పుడిక్కడ 'ఫిదా'లో భానుమతి అయినా 'సింగిల్‌ పీస్‌' క్యారెక్టర్లు.

హీరోని ప్రేమిస్తారు... కానీ తమకంటే ఎక్కువగా కాదు. ప్రేమలోని ఎమోషన్స్‌ అన్నీ ఫీల్‌ అవుతారు... అలా అని క్యారెక్టర్‌ మార్చుకోరు. తమదైన ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లి, తమవైన ఆలోచనలతో మననీ కన్విన్స్‌ చేసి, తమ ప్రేమని, తమ బాధని, తమ ఆనందాన్ని మనం ఫీల్‌ అయ్యేట్టు చేస్తారు. అందుకే కమ్ముల సినిమాల్లో కథ ఉండదు... లైఫ్‌ వుంటుంది. రాసిచ్చిన మాటలుండవు, సహజమైన సంభాషణలుంటాయి.

తన బలాన్ని వదిలేసి మరేదో చేయాలనే తపనతో గాడి తప్పిన శేఖర్‌ కమ్ముల తిరిగి ట్రాక్‌ ఎక్కేసాడు. తనకి మాత్రమే సాధ్యమైన ఒక ఎమోషనల్‌ లవ్‌స్టోరీని తీర్చిదిద్ది ఇప్పుడొచ్చే ప్రేమకథల మధ్య 'సింగిల్‌ పీస్‌' అనిపించే రొమాన్స్‌ని తెర మీదకి తెచ్చాడు. టైటిల్‌కి తగ్గట్టే 'ఫిదా' అయిపోయే మొమెంట్స్‌ చాలానే క్రియేట్‌ చేసాడు. ముఖ్యంగా 'భానుమతి' పాత్రని తీర్చిదిద్దిన విధానం, ఆ పాత్ర స్వభావాన్ని, ఆలోచనల్ని తెలియజేసిన వైనం అమితంగా ఆకట్టుకుంటుంది.

శేఖర్‌ గత ప్రేమకథలకీ, దీనికీ మధ్య స్పష్టమైన వ్యత్యాసమేమిటంటే... ఈసారి పాత్రలు, సంభాషణలు చాలా సహజంగా అనిపిస్తాయి. చాలా మంది రిలేట్‌ చేసుకునేలా పాత్రలు, వారి ఆలోచనలు వుండడంతో అతని మునుపటి ప్రేమకథల కంటే ఇది మరింత ఎక్కువగా కనక్ట్‌ అవుతుంది. ఎప్పటిలానే శేఖర్‌ కమ్ముల భారీ సంఘర్షణల జోలికి పోలేదు. చిన్న 'కాన్‌ఫ్లిక్ట్‌'ని మాత్రమే సృష్టించి, అది ప్రేమకి ఎలా ప్రతిబంధకం అయిందనేది చక్కగా చూపించాడు.

ఆడపిల్లలు పెళ్లి చేసుకుని ఎందుకని తమకి సంబంధించినవన్నీ వదిలేసి పోవాలి, పెళ్లి చేసుకున్న అమ్మాయి ప్రపంచంలోకి అబ్బాయి ఎందుకు రాకూడదు అనేది భానుమతి (సాయిపల్లవి) ఫీలింగ్‌. తనకి నచ్చిన వరుణ్‌ని (వరుణ్‌ తేజ్‌) సరాసరి ఆ విషయం అడగకుండా అతని ఆలోచనలని 'అర్థం' చేసుకుని దూరంగా వుంటుంది. ఆ కాన్‌ఫ్లిక్ట్‌కి సొల్యూషన్‌ ఏమిటి, ఎలా దొరుకుతుందనేది కథ.

సింపుల్‌ ప్లాట్‌ తీసుకున్నా కానీ స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ వుంటే ఆ స్టోరీతో ఎంతగా ఆకట్టుకోవచ్చుననేది శేఖర్‌ కమ్ముల మళ్లీ చూపించాడు. ఫస్ట్‌ హాఫ్‌ అంతటా వరుణ్‌, భానుమతి మధ్య బ్యూటిఫుల్‌ మొమెంట్స్‌ సృష్టించాడు. సంభాషణలు అత్యంత సహజంగా వుండడం మరో పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఎక్కువ సమయం హీరో హీరోయిన్లు మాత్రమే కనిపిస్తున్నా, కథ ముందుకు సాగకపోయినా కానీ వాళ్లిద్దరి కాన్వర్‌జేషన్స్‌తోనే అటు వినోదాన్ని అందించి, ఇటు కాన్‌ఫ్లిక్ట్‌కి అవసరమైన బేస్‌ సెట్‌ చేసాడు.

అయితే ఇద్దరి మధ్య దూరం పెరగడానికి తగిన కారణాలు చూపించడంలో మాత్రం అంత సక్సెస్‌ అవలేదు. కొన్ని మరీ సినిమాటిక్‌గా అనిపించడం వల్ల కొద్దిగా ఫీల్‌ దెబ్బతింటుంది. ఇవి సమస్యలే అయినప్పటికీ ఎమోషన్‌ క్యారీ చేయడంలో శేఖర్‌ సక్సెస్‌ అయ్యాడు. తమమధ్య పెరిగిన దూరంతో ఇద్దరూ అనుభవిస్తోన్న పెయిన్‌ని బాగా చూపించాడు. భానుమతి షార్ట్‌ డ్రస్‌ వేసుకున్నపుడు యుఎస్‌లో పెరిగినవాడే అయినప్పటికీ అది నచ్చని వరుణ్‌ దానిని ఇన్‌డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్‌ చేసే విధానం కానీ, భానుమతి కారులో బ్రేక్‌ అయి ఏడుస్తున్నపుడు ఆమె పట్ల తనకి వున్న ఫీలింగ్స్‌ తెలియజేసే పద్ధతి కానీ చూసేందుకు మామూలుగా అనిపించినా స్ట్రయికింగ్‌గా వుంటుంది.

మలయాళ 'ప్రేమమ్‌' చూసి సాయి పల్లవికి ఎందుకంతగా ఫిదా అయిపోయారో, ఆమెని అంత స్పెషల్‌గా ఎందుకు చూస్తారో ఇందులో 'భానుమతి'గా ఆమెని చూస్తే తెలుస్తుంది. సొంత డబ్బింగ్‌తో తెలంగాణ యాసని పొల్లుపోకుండా మాట్లాడుతూ, తెరపై నటిస్తోన్న హీరోయిన్‌లా కాకుండా మనకి బాగా తెలిసిన అమ్మాయి భానుమతిని మాత్రమే కనిపించేట్టు చేసిన సాయి పల్లవి ఈ చిత్రానికి బిగ్గెస్ట్‌ ఎస్సెట్‌.

వరుణ్‌తో ఆమె ఇంటరాక్షన్స్‌తో పాటు తనకి మాత్రమే సొంతమైన మొమెంట్స్‌ని కూడా పండించిన తీరుకి 'ఫిదా' అవకుండా వుండలేం. సగటు హీరోయిన్‌ అంటే ఇలాగే వుండాలనే చాలా పాయింట్స్‌ తన విషయంలో సరిపోవు. అయినప్పటికీ తన ఛార్మ్‌తో ఆమె ఆకట్టిపడేస్తుంది, ఒకలాంటి మాయ చేసేస్తుంది. పాత్రకి అనుగుణంగా నటించడం, హీరోలా కనిపించాలని తపన పడకపోవడం వరుణ్‌ తేజ్‌ స్పెషాలిటీ. ఇది హీరోయిన్‌ ప్రధానంగా సాగే కథే అయినప్పటికీ తన ఎమోషన్స్‌ అన్నీ చక్కగా చూపిస్తూ తన ఐడెంటిటీ నిలుపుకున్నాడు. పల్లవి తనకి దూరమైపోతుందనే పెయిన్‌ని అతను అభినయించిన విధానం టూ గుడ్‌ అనిపిస్తుంది. అతని పెయిన్‌ ఏమిటనేది ప్రేక్షకులకి తెలియకపోతే ఎమోషన్స్‌ ఇంతగా పండవు.

శక్తికాంత్‌ కార్తీక్‌ బాణీలు అలరిస్తాయి. 'హేయ్‌ పిల్లగాడా', 'వచ్చిండే', 'ఏదో జరుగుతోంది', 'ఊసుపోదు' పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం చాలా చక్కగా కుదిరింది. విజయ్‌ సి. కుమార్‌ సినిమాటోగ్రఫీ మరో హైలైట్‌. శేఖర్‌ కమ్ముల రాసిన సంభాషణలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి. దర్శకుడిగా శేఖర్‌లో మెచ్యూరిటీ తెలియజేసే చిత్రమిది. అదే సమయంలో తన బలమేంటనేది కూడా ఈ చిత్రం అతనికి తెలియజేస్తుంది. క్యారెక్టర్స్‌ తీర్చిదిద్దిన విధానంతో పాటు ఎమోషన్స్‌ పండించిన తీరుకి కమ్ములకి ఫుల్‌ మార్క్స్‌.

అయితే చివర్లో ఒక మాదిరి హడావిడి గోచరిస్తుంది. క్లయిమాక్స్‌కి దారి తీసే సిట్యువేషన్స్‌ సహజంగా కాకుండా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తాయి. క్లయిమాక్స్‌ ఏమిటనేది ఈజీగా చెప్పవచ్చు కానీ అటుగా తీసుకెళ్లడం స్మూత్‌గా జరిగి వుండాల్సింది. నిజానికి కారులో భానుమతికి వరుణ్‌ తన ఫీలింగ్స్‌ చెప్పడంతోనే కథ అయిపోయింది. అక్కడ్నుంచి అవసరం లేకుండా డ్రాగ్‌ చేసిన ఫీలింగ్‌ వస్తుంది. చిన్నపాటి సమస్యలు లేకపోలేదు కానీ సాయి పల్లవి అభినయం, మైమరిపించే ప్రథమార్ధం, కదిలించే భావోద్వేగాలు, హాయిగొలిపే సంగీతం 'ఫిదా'ని ఈమధ్య కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రాల సరసన నిలబెడతాయి.

బాటమ్‌ లైన్‌: భానుమతికి ఫిదా!

- గణేష్‌ రావూరి

ఫిదా పబ్లిక్ టాక్ కోసం క్లిక్ చేయండి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?