రివ్యూ: 365 డేస్
రేటింగ్: 1/5
బ్యానర్: జెడ్ 3 పిక్చర్స్, డి.వి. సినీ క్రియేషన్స్
తారాగణం: నందు, అనైక సోటి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, సత్యకృష్ణ తదితరులు
సంగీతం: నాగ్ శ్రీవత్స, ఎల్.ఎమ్. ప్రేమ్
కూర్పు: అన్వర్ అలీ
ఛాయాగ్రహణం: అనిత్
నిర్మాత: డి. వెంకటేష్
కథ, మాటలు, దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ
విడుదల తేదీ: మే 22, 2015
క్రైమ్, హారర్, యాక్షన్… ఇలా తన సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించేవి ఏమీ లేని ఒక ఫక్తు ఫ్యామిలీ సినిమా అంటూ రామ్‌గోపాల్ వర్మ ‘365 డేస్’కి ప్రచారం చేసుకున్నాడు. ఆ అంశమే ఆయనని ఎక్సయిట్ చేసి ఈ చిత్రం తీయడానికి బీజం వేసి ఉండొచ్చు. ఇంతకుముందు తాను తీయనిది తీయడమే రామ్‌గోపాల్ వర్మకి కొత్త అనుభూతిని కలిగించిందేమో కానీ ఈ జోనర్‌లో ఎన్నో సినిమాలు చూసిన ప్రేక్షకుల్ని ఎక్సయిట్ చేయడానికి తగ్గ ఎలిమెంట్స్ ఏమీ ‘365 డేస్’లో లేవు. ఒక జంట ప్రేమకి ముందు ఎలా ఉంటుంది, పెళ్లి తర్వాత వారి మధ్య ఎలాంటి గొడవలు తలెత్తుతాయి అనేది వర్మ చెప్పాలనుకున్న పాయింట్. ఒకరిని విడిచి ఒకరం బతకలేమని భావించి పెళ్లి చేసుకున్న వాళ్లు ఆ తర్వాత ఎందుకని కలిసి బతకడానికి ఇబ్బంది పడి విడాకులు తీసుకుంటున్నారనేది వర్మ ఇందులో డిస్కస్ చేసాడు.
ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఒక టైమ్ ఫ్రేమ్‌లో బంధించాలని చూడడమే పెద్ద మిస్టేక్. 365 రోజుల్లోగా ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని, ఆపై విడిపోవడం కూడా జరిగిపోతే ఎలాగుంటుంది అనేసుకుని టైటిల్ కూడా ఫిక్స్ చేసేసినట్టుంది. వాళ్లు ప్రేమించుకోవడానికి తగిన కారణాలు కనిపించనట్టే, గొడవ పడడానికి, విడిపోవాలని నిర్ణయించుకోవడానికి కూడా చెప్పుకోతగ్గ కారణాలేం ఉండవు. ఏడాదిలోగా ఇవన్నీ జరిగిపోవాలంటే అందుకు స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి. అలాంటి సిట్యువేషన్స్ సృష్టించాలి. ఈమధ్య కాలంలో వర్మ తీస్తున్న చాలా సినిమాల్లానే ఇదీ ఒక హాఫ్ బేక్డ్ ఐడియాలానే అనిపిస్తుంది తప్ప ఒక పూర్తి స్థాయి స్క్రిప్ట్ పట్టుకుని సెట్స్‌కి వెళ్లినట్టు కనిపించదు.
ఈ తరహా సినిమాల్లో కదిలించే డ్రామా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి బతుకుదామని నిర్ణయించుకున్న కొన్ని రోజులకే విడిపోవాలని నిర్ణయించుకోవడానికి తగిన సంఘర్షణ ఉండాలి. కాంటెంపరరీ ఇష్యూనైతే టచ్ చేసారు కానీ బేసిక్ హోంవర్క్ కూడా చేయకుండా తోచిన సీన్లు రాసేసుకుని సినిమా తీసేసిన భావన కలుగుతుంది. ఎంతో డెప్త్ ఉండాల్సిన స్క్రిప్ట్‌లో కనీసం ఒకటి, రెండు లేయర్లు కూడా లేని ఫ్లాట్ ట్రీట్‌మెంట్‌తో ‘365 డేస్’ మొదలైన కొన్ని నిముషాలకే కొన్ని యుగాలని తలపిస్తుంది. రెండు గంటల లోపు నిడివి ఉన్న సినిమాలో లెక్కకు మించిన పాటలున్నాయంటేనే విషయం లేక పాటలతో కాలక్షేపం చేసేసారనేది స్పష్టమవుతుంది.
వర్మ ఇంతకుముందు ఎంత తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తీసినా కానీ తన కథా వస్తువులు కానీ, పాత్రల నడుమ సంభాషణలు కానీ టీవీ సీరియల్స్‌ని తలపించలేదు. 365 డేస్ చిత్రంలోని సన్నివేశాలు, సంభాషణలు, చిత్రీకరణ అన్నీ కూడా టీవీ సీరియల్ స్టాండర్డ్‌లో ఉన్నాయి. అమ్మాయిని అప్రోచ్ అవడానికి చెయ్యి చూసి జాతకం చెప్తాననడం, ‘అన్నం ఉడికిందో లేదో తెలియడానికి మెతుకు చూస్తే చాలు’ అనే మాటలతో ప్రేయసిని ఇంప్రెస్ చేయాలని చూడడం… రామ్‌గోపాల్ వర్మ స్థాయి దర్శకుడి సినిమా నుంచి ఊహించలేం.
ఒక చిన్న ట్వీట్ చేసినా కానీ అది ఎంతో కొంత సంచలనం సృష్టించేలా ఉండాలనుకునే వర్మ నుంచి ఈ కాన్సెప్ట్‌తో సినిమా వస్తున్నప్పుడు అది చాలా బోల్డ్‌గా ఉంటుందని, తన ఆలోచనలతో వివాహ వ్యవస్థని కడిగి పారేసేలా ఉంటుందని, లేదా షాకిచ్చే సంచలనాత్మక ముగింపు ఉంటుందని అనుకోవచ్చు. ఇటీవల ఎంత బ్యాడ్ మూవీస్ తీస్తున్నా కానీ వర్మ ఎప్పుడూ ఆలోచనల పరంగా ఇంత మైల్డ్‌గా అనిపించలేదు. ఆయననుంచి ఇలాంటి టీవీ సీరియల్ స్టఫ్ వస్తుందనే ఊహ.. తనెంత బ్యాడ్ మూవీస్ తీసిన రోజుల్లో కూడా తలపుకి వచ్చి ఉండదు.
పెళ్ళయిన నలభై ఏడవ రోజుకే ఏదో కోల్పోయిన వారిలా గాల్లోకి చూస్తూ గడిపేసేంత నిస్సారంగా ఎవరి జీవితాలుంటాయి? అంతగా నీరసం రావడానికి తగ్గ కారణాలేవి? ఏదో రకంగా టైటిల్ జస్టిఫికేషన్ కోసమని 365వ రోజులోగా విడగొట్టేయాలని ఏదోటి చూపించడానికి కాకపోతే. కనీసం విడాకులు తీసుకునే పెద్ద డెసిషన్ తీసుకోవడానికి అయినా తగిన కారణం చూపించాడా అంటే అదీ లేదు. పోనీ పెళ్లికి ముందు ఉన్న ప్రేమ.. పెళ్లి తర్వాత కనిపించదు అంటూ కన్‌క్లూడ్ చేసాడా అంటే అది కూడా జరగలేదు. విడిపోయిన వాళ్లు మళ్లీ కలిసిపోయి, పిల్లల్ని కూడా కంటారు.
ఈ సినిమాతో వర్మ ఏం చెప్పదలచుకున్నాడో, ఆ ముగింపుకి అర్థమేంటో అర్థం కాదు. సన్నివేశ బలం లేనప్పుడు, సంభాషణలు అత్యంత పేలవంగా ఉన్నప్పుడు, పాత్రల్లో జీవం లేనపుడు నటీనటుల అభినయంలో తప్పొప్పులు ఎంచుకోవడం అనవసరం. టెక్నికల్‌గా పాతికేళ్ల క్రితమే విప్లవం తీసుకొచ్చిన వర్మ సినిమాలో ఇప్పుడు సాంకేతికత గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదన్నట్టు అవుట్‌పుట్ ఉంటోంది. సహనానికి అతి పెద్ద పరీక్ష పెట్టిన ఈ 365 డేస్ వర్మ నుంచి ఈమధ్య వచ్చిన బ్యాడ్ మూవీస్ సరసకి పొందిగ్గా చేరిపోతుంది.
బోటమ్ లైన్: నూట పది నిముషాల నస!
-గణేష్ రావూరి