సినిమా రివ్యూ: లవ్‌ యు బంగారమ్‌

రివ్యూ: లవ్‌ యు బంగారమ్‌ రేటింగ్‌: 0.5/5 బ్యానర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌, మారుతి టాకీస్‌ తారాగణం: రాహుల్‌, శ్రావ్య, రాజీవ్‌ తదితరులు సంగీతం: మహిత్‌ నారాయణ్‌ నేపథ్య సంగీతం: జెబి కూర్పు: ఎస్‌.బి. ఉద్ధవ్‌…

రివ్యూ: లవ్‌ యు బంగారమ్‌
రేటింగ్‌: 0.5/5
బ్యానర్‌:
క్రియేటివ్‌ కమర్షియల్స్‌, మారుతి టాకీస్‌
తారాగణం: రాహుల్‌, శ్రావ్య, రాజీవ్‌ తదితరులు
సంగీతం: మహిత్‌ నారాయణ్‌
నేపథ్య సంగీతం: జెబి
కూర్పు: ఎస్‌.బి. ఉద్ధవ్‌
ఛాయాగ్రహణం: అరుణ్‌ కె. సూరపనేని
నిర్మాతలు: మారుతి, వల్లభ
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: గోవి
విడుదల తేదీ: జనవరి 24, 2014

మారుతి టాకీస్‌ బ్యానర్‌నుంచి వచ్చే సినిమాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికే అందరికీ ఒక క్లియర్‌ ఐడియా ఉంది. ‘ప్రేమకథా చిత్రమ్‌’ ఒక్కటి మినహా మారుతి నుంచి, అతని అనుబంధ సంస్థల నుంచి వచ్చిన చిత్రాల్లో అడల్ట్‌ కంటెంట్‌ కట్టలు తెంచుకుంది. ఈ సినిమా కూడా అలాంటిదే అనుకుని ఉండొచ్చు… కాకపోతే ఈ చిత్ర నిర్మాణంలో ప్రతిష్టాత్మక క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ కూడా భాగం పంచుకునే సరికి క్వాలిటీ కంటెంట్‌ ఉంటుందని భావిస్తే విస్తుపోవాల్సిందే. ఎందుకంటే అంతటి నిర్మాణ సంస్థ బ్రాండ్‌ వేసిన ఈ చిత్రంలో కూడా బూతు రాజ్యమేలింది. ఫిలిం మేకింగ్‌ అనే ఆర్ట్‌ ఫార్మ్‌ని ఎన్నో మెట్లు దిగజార్చి తెలుగు సినిమాకి మరింత మురికి అంటించింది. తెలుగు చిత్ర పరిశ్రమకి ఈమధ్య కాలంలో పట్టిన చీడ తారాస్థాయికి చేరుకున్న వైనం… ఈ ‘లవ్‌ యు బంగారమ్‌’!

కథేంటి?

ఓ సెల్‌ఫోన్‌ కంపెనీలో మేనేజర్‌ అయిన ఆకాష్‌కి (రాహుల్‌) ఇన్‌సెక్యూరిటీ ఎక్కువ. మీనాక్షిని (శ్రావ్య) ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయిన కొద్ది రోజులకి ఆమె ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ జాయిన్‌ అవుతుంది. అక్కడ్నుంచీ ఆకాష్‌కి ఆమెపై అనుమానం పెరుగుతుంది. అందుకు తగ్గట్టే మీనాక్షి కూడా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. వీరి వైవాహిక జీవితం ఏమైందనేది మిగతా కథ. 

కళాకారుల పనితీరు!

‘హ్యాపీడేస్‌’ సినిమాలో నత్తి నత్తిగా మాట్లాడితే యువ ప్రేక్షకులు లైక్‌ చేసారని మరోసారి అదే తరహా పాత్రలో కనిపించాడు రాహుల్‌. హ్యాపీడేస్‌ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించాడు కానీ నటుడిగా అతనిలో ఎలాంటి పరిణితి రాలేదు. భావ ప్రకటన శూన్యం. వాచకం కర్ణ కఠోరం. శ్రావ్య నటన గురించి చెప్పుకోడానికేమీ లేదు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ ఒక చిన్న క్యారెక్టర్‌ చేసాడు. హీరో స్నేహితుడి క్యారెక్టర్‌, ఎఫ్‌బి అనే మరో క్యారెక్టర్‌ చేత అడల్ట్‌ జోక్స్‌ చెప్పించి నవ్వించే ప్రయత్నం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాలో అవసరానికి మించి పాటలున్నాయి. ఒక్కటి కూడా వినేసాక గుర్తుండదు… ఇంకోసారి వినాలనిపించదు. అత్యంత ఘోరంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇన్ని పాటలు ఉండడం కూడా ప్రేక్షకులకి ఒకింత రిలీఫే. సినిమాటోగ్రఫీ లో బడ్జెట్‌ సినిమా స్టాండర్డ్స్‌కి తగినట్టే ఉంది. విలువల్లేని సినిమా తీసిన నిర్మాతలు ఈ చిత్రంతో క్యాష్‌ చేసుకునే ప్రయత్నమే చేసారు కాబట్టి ఆట్టే ఖర్చు కూడా పెట్టలేదు. క్వాలిటీ కోసం పాకులాడలేదు. 

దర్శకుడు గోవి కూడా మారుతి స్కూల్‌ని ఫాలో అయిపోయాడు. డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకోవడానికి కాకుండా, కమర్షియల్‌గా పాస్‌ అయిపోవడానికి చీప్‌ స్టఫ్‌ని నమ్ముకున్నాడు. సినిమాలో ఎంత వల్గారిటీ ఉంటే అంత సేఫ్‌ అని నమ్మే దర్శకుల జాబితాలో తొలి సినిమాతోనే చేరిపోయాడు. అతని ఆలోచనలు ఎంత హేయంగా ఉన్నాయనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే తప్ప వాటిని వివరించడం చాలా కష్టం. 

హైలైట్స్‌:

  •  ఈ కథకి నిర్మాతలు దొరకడం!

డ్రాబ్యాక్స్‌:

  •  ఈ సినిమాకి ప్రేక్షకులు రావడం!

విశ్లేషణ:

కథనో, కళనో నమ్మి తీసిన చిత్రాలకి అయితే ప్రత్యేకంగా తప్పొప్పులు విశ్లేషించుకోవచ్చు. ఈ చిత్రం తీసిన వాళ్ల హోల్‌ అండ్‌ సోల్‌ ఎయిమ్‌ ఒక్కటే… ఎంత ఛండాలాన్ని అయినా తెరకెక్కించి క్యాష్‌ చేసేసుకోవాలని. ఇక అలాంటి లక్ష్యంతో తీసిన చిత్రంలో కథా విలువలు కానీ, సాంకేతిక అద్భుతాలు కానీ ఏముంటాయి? 

ఒక సినిమాలో స్టూడెంట్స్‌ లైఫ్‌ స్టయిల్‌ని, ఇంకో సినిమాలో హాస్టల్‌ గాళ్స్‌ డే టు డే యాక్టివిటీస్‌ని, ఇంకో దాంట్లో అపార్ట్‌మెంట్స్‌లో జరిగే భాగోతాలని… ఏదో ఒక అంశం తీసుకుని నిజ జీవితంలోను ఇలా జరుగుతున్నాయంటూ ‘బూతు’ని ఎంజాయ్‌ చేసే ప్రేక్షకుల్ని టార్గెట్‌ చేస్తూ డబ్బు చేసుకుంటున్న మారుతి టాకీస్‌ ఈసారి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కార్యకలాపాలని ‘గ్లోరిఫై’ చేసింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగులు నిత్యం జేబులో కండోమ్‌ ప్యాకెట్స్‌ పెట్టుకుని, ఆడ… మగ తేడా లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుని గడిపేస్తుంటారని, ఆఫీస్‌లోనే మందు కొడుతూ.. పనీ పాటా లేకుండా మానిటర్స్‌లో పోర్న్‌ వీడియోస్‌ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారని… దర్శకుడు తనకి తెలిసిన జ్ఞానమంతటినీ ఈ సినిమాలో నింపేసాడు. 

ఆ చెత్త చుట్టూ ఒక ప్రేమకథ, ఒక క్రైమ్‌ కథ కూడా అల్లాడు. ప్రేమకథలో మనం చూడనిదంటూ ఏమీ ఉండదు. చాలా రొటీన్‌ లవ్‌స్టోరీ. ఒక ప్రాస్టిట్యూట్‌ పాపకి బాలేదని తెలుసుకుని ఆమెకి సాయపడే హీరోని చూసి హీరోయిన్‌ గాఢంగా ప్రేమించేస్తుంది. హీరోయిన్‌ని లవ్‌ చేయడానికి ఆ కారణం కూడా అక్కర్లేదనుకోండి. పెళ్లయిన తర్వాత తన ‘అందమైన’ భార్య మీద అతగాడికి అనుమానం. దాని చుట్టూ ఓ నాలుగైదు సన్నివేశాలు. దానికి లింక్‌ చేస్తూ ‘ఎంఎంఎస్‌ వీడియోస్‌’ తీసి ఆడాళ్లని బ్లాక్‌మెయిల్‌ చేసే విలన్‌. ఆ విలన్‌ చేసే పనులన్నీ సుదీర్ఘంగా సాగే క్లయిమాక్స్‌ సీన్‌లో మైన్యూట్‌ డీటెయిల్స్‌తో సహా వివరిస్తారు. 

రెండున్నర గంటల పాటు సాగే సినిమాలో ఆసక్తి కలిగించే అంశమంటూ ఉండదు. ఏదో ఒక సాకుతో తమ పర్‌వర్టెడ్‌ ఆలోచనల్ని తెరకెక్కించే దర్శకుల క్రియేటివిటీని అప్రీషియేట్‌ చేసి… కాసేపు ఆ వల్గారిటీతో కాలక్షేపం చేయాలని చూసే చీప్‌ టేస్ట్‌ ఉన్న వారికి తప్ప ఇలాంటివి సినిమాలని కూడా ఎవరికీ అనిపించవు. తెలుగు సినిమా దైన్య స్థితి ఏమిటంటే… ఇలాంటి చిత్రాల రూపకల్పనకి పేరున్న నిర్మాణ సంస్థలు కూడా ముందుకి రావడం! సినిమా పేరిట ఇలా వెండితెరపై మరకలు వేయడం కంటే డైరెక్ట్‌గా పోర్న్‌ సినిమాలు తీసుకోవడం నయం. 

బోటమ్‌ లైన్‌: లవ్‌ యు బంగారమ్‌… మన వల్ల కాదీ దరిద్రమ్‌!

– జి.కె.