Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: లవర్స్‌

సినిమా రివ్యూ: లవర్స్‌

రివ్యూ: లవర్స్‌
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: మారుతి టాకీస్‌, మాయాబజార్‌ మూవీస్‌
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, నందిత, తేజస్వి, చాందిని, సప్తగిరి, సాయికుమార్‌ పంపన, ఎమ్మెస్‌ నారాయణ, అనితా చౌదరి తదితరులు
సంగీతం: జెబి
కూర్పు: ఉద్ధవ్‌
ఛాయాగ్రహణం: మల్హర్‌భట్‌ జోషి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, బి. మహేంద్రబాబు
కథ, కథనం, మాటలు: మారుతి
దర్శకత్వం: హరినాధ్‌
విడుదల తేదీ: ఆగస్ట్‌ 15, 2014

డైరెక్టర్‌గా బిజీగా ఉంటూనే వేరే దర్శకుల చిత్రాలకి రచన చేస్తున్న మారుతి ఈ చిత్రానికి కూడా రచయితగా, మెంటర్‌గా వ్యవహరించాడు. మారుతి మార్కు లవర్స్‌ ఎలా ఉన్నారో చూద్దాం పదండి.

కథేంటి?

సిద్ధు (సుమంత్‌ అశ్విన్‌) ఓ అమ్మాయిని (తేజస్వి) ప్రేమిస్తాడు. కానీ ఆమె తన ఫ్రెండ్‌ చిత్ర (నందిత) మగాళ్ల సైకాలజీ గురించి చెప్పిన దాంతో ఏకీభవించి సిద్ధుతో బ్రేకప్‌ అవుతుంది. తర్వాత సిద్ధు మరొకమ్మాయితో (చాందిని) ప్రేమలో పడతాడు. ఆ లవ్‌ స్టోరీ కూడా చిత్ర కారణంగానే బ్రేకప్‌ అవుతుంది. కొన్నేళ్ల తర్వాత చిత్రని గుడిలో చూసి మనసు పడతాడు సిద్ధు. ఆమె ఎవరనేది తెలిసే సరికి ఆమెని ప్రేమలోకి దించడం అసాధ్యమని అర్థమవుతుంది. చిత్రకి తనపై ఇష్టం కలిగేట్టు చేయడానికి సిద్ధు ఏం చేస్తాడు? తన స్నేహితురాళ్ల కంట పడకుండా చిత్రని ఎలా మచ్చిక చేసుకుంటాడు?

కళాకారుల పనితీరు:

సుమంత్‌ అశ్విన్‌, నందిత ఇద్దరూ శక్తి వంచన లేకుండా తమ పాత్రలకి న్యాయం చేయడానికి కృషి చేసారు. వారిద్దరి టాలెంట్‌కి టెస్ట్‌ పెట్టేంత స్టఫ్‌ ఉన్న సీన్లే ఇందులో లేకుండా పోయాయి. సప్తగిరి సెకండాఫ్‌లో ఎంటర్‌ అయి ఈ సినిమాకి హీరో అయిపోయాడు. తనదైన శైలిలో చిత్రమైన కామెడీ చేస్తూ, నెల్లూరు యాసలో డైలాగులు పేల్చే సప్తగిరి ఈ చిత్రాన్ని ఒంటి చేత్తో నిలబెట్టేసాడు. అతని కామెడీ అన్ని సినిమాల్లోను ఒకే తరహాలో ‘ఓవర్‌ ది టాప్‌’ అనిపిస్తున్నా కానీ ప్రస్తుతానికి అతను ఇంకా బోర్‌ కొట్టలేదు. బ్రహ్మానందాన్ని శ్రీను వైట్ల, త్రివిక్రమ్‌ బ్రహ్మాస్త్రంలా ఎలా వాడుకుంటారో మారుతి ఇతడిని అలా వాడుతున్నాడు. సాయి కుమార్‌ పంపన ‘ఈ రోజుల్లో, బస్‌స్టాప్‌’ తర్వాత మరోసారి అలరించాడు. తేజస్వి, చాందిని తదితరులు ఓకే అనిపించారు. ఎమ్మెస్‌ నారాయణ విసిగించాడు. 

సాంకేతిక వర్గం పనితీరు:

జెబి పాటలకి ఇన్‌స్టంట్‌ అప్పీల్‌ కానీ, రిపీట్‌ వేల్యూ కానీ లేవు. కొన్ని పాటలు అసందర్భంగా వచ్చి ఇబ్బంది పెడతాయి. మారుతి రాసిన కామెడీ పంచ్‌లు బాగున్నాయి. గతంలో తన సంభాషణల్లో ఎక్కువగా ద్వందార్థాలు ఉండేవి. ఈ చిత్రంలో కూడా కొన్ని సెన్సార్‌ కట్స్‌ పడ్డాయి. అలాగే కొన్ని సంభాషణల్లో డబుల్‌ మీనింగ్స్‌ దొర్లాయి. మునుపటితో పోలిస్తే మారుతి వాటిని బాగా తగ్గించేసినట్టే. సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్టర్‌కి కామెడీ సీన్లు తీయడంలో మంచి గ్రిప్‌ ఉంది. మెయిన్‌ ప్లాట్‌ని ఫీల్‌ గుడ్‌ రొమాన్స్‌తో అలరించేలా డీల్‌ చేయడంలో డైరెక్టర్‌ హరినాధ్‌ విఫలమయ్యాడు. 

హైలైట్స్‌:

  • సప్తగిరి కామెడీ

డ్రాబ్యాక్స్‌:

  • బలహీనమైన కథనం
  • ఎమ్మెస్‌ నారాయణ ట్రాక్‌

విశ్లేషణ:

‘రేయ్‌.. ఎటు పోతుంది రా నీ ప్రేమకథా చిత్రమ్‌..’ అని ఓ సందర్భంలో హీరో తనలో తానే అనుకుంటాడు. నిజంగానే లవర్స్‌ చూస్తున్న వారికీ ఓ పాయింట్‌లో ‘ఎటు నుంచి ఎటు పోతోందీ సినిమా’ అనిపిస్తుంది. ఓపెనింగ్‌ సీన్‌లో పెళ్లికొడుకు డ్రస్‌ వేసుకుని హీరో చర్చికి వెళ్లి... తన గాళ్‌ఫ్రెండ్‌ని చంపేస్తానని ఫాదర్‌తో చెప్తాడు. చర్చి ఫాదర్‌తో హీరో ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పడం ముగిసిన తర్వాత కానీ అర్థం కాదు... అసలు ఓపెనింగ్‌ సీన్‌ కేవలం ‘బ్యాంగ్‌’ కోసం చేసినదే తప్ప కథలో రిలవెంట్‌ సీన్‌ కాదని. మారుతి ఈ కథని అన్యమనస్కంగా రాసుకున్నాడో.. లేక ఒక సాధారణ ప్రేమకథని ఆసక్తికరంగా మార్చే ప్రయత్నంలో దారి తప్పాడో కానీ సెకండ్‌ హాఫ్‌లో ‘లవర్స్‌’ కంప్లీట్‌గా ట్రాక్‌ తప్పింది. 

క్యారెక్టర్లని పరిచయం చేయడానికి, లీడ్‌ క్యారెక్టర్ల మధ్య బిహేవియర్‌ కాన్‌ఫ్లిక్ట్‌ క్రియేట్‌ చేయడానికి మారుతి ఫస్ట్‌ హాఫ్‌లో చాలా టైమ్‌ కేటాయించాడు. అయితే సెకండ్‌ హాఫ్‌లో సడన్‌గా ఈ ప్రేమకథ కాస్తా కామెడీ ప్రహసనంగా మారిపోతుంది. అసలు కథని ఆకట్టుకునేలా చెప్పే దారి తోచక ఇలా ఎస్కేపిజం చూపించాడేమో అనిపిస్తుంది. సప్తగిరి పాత్రని కథలోకి ప్రవేశపెట్టడానికి కారణం కానీ, ఆ తర్వాత ఆ క్యారెక్టర్‌ని కంటిన్యూ చేయడం కానీ చూస్తే ఈ విషయం క్లియర్‌గా తెలిసిపోతుంది. కమర్షియల్‌గా ఈ చిత్రాన్ని గట్టెక్కించడానికి ‘ఆక్సిజన్‌’ అవసరమనే సంగతిని గుర్తించి మారుతి తన కథనే మార్చేసాడు. సప్తగిరి కామెడీ సీన్లు బాగా రావడంతో ఇక పూర్తిగా ప్రధాన కథని పక్కన పడేసి ఆ పాత్రతోనే క్లయిమాక్స్‌ వరకు గెంటేసాడు. 

ఒక్కసారి సప్తగిరి క్యారెక్టర్‌ ఎగ్జిట్‌ అయిన తర్వాత లవర్స్‌ గందరగోళంగా ముగిసిపోతుంది. ఈ ప్రేమ వ్యవహారంలో చర్చి ఫాదర్‌ని ఇన్‌వాల్వ్‌ చేసిన ట్రాక్‌ మొత్తం అస్తవ్యస్తంగా తోస్తుంది. మామూలుగా పదునైన సంభాషణలు రాసే మారుతి ఈ ఫాదర్‌ ట్రాక్‌లో డైలాగ్‌ రైటర్‌గా బాగా వీక్‌ అయ్యాడు. అసలు కథని మొదలు పెట్టడానికి, ముగించడానికి ఒక ‘ప్రేరకం’ కావాలి కనుక ఆ ఫాదర్‌ పాత్రని సృష్టించాడు కానీ ఆ పాత్రకి ఒక స్కెచ్‌ అంటూ లేదు. 

కథలో విషయం లోపించినా, కథనంలో చాలా లోపాలు ఉన్నా కానీ ‘లవర్స్‌’ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా స్కోర్‌ చేస్తుంది. సాయి పంపన ఫస్ట్‌ హాఫ్‌లో చాలా సన్నివేశాల్లో తన మార్కు ‘నత్తి’ కామెడీతో నవ్విస్తాడు. ఇక ద్వితీయార్థంలో సప్తగిరి చేతుల్లోకి పగ్గాలు వెళ్లిన తర్వాత అతను పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతాడు. దాదాపుగా సినిమాపై హోప్స్‌ పోయిన టైమ్‌లో సప్తగిరి క్యారెక్టర్‌ని ప్రవేశ పెడతారు. అతని రాకతోనే చిత్ర గమనమే కాకుండా ఆడిటోరియంలో వాతావరణం కూడా మారిపోతుంది. ‘గగనపు వీధి వీడి...’ పాటతో ఎంటర్‌ అయిన సప్తగిరి ‘మగజాతికి ఆణిముత్యాన్ని’ అంటూ స్త్రీ ద్వేషి పాత్రలో చెలరేగిపోతాడు. ‘మగధీర’లోని వంద మందిని చంపే సీన్‌ని ఇందులో యాభై మంది ఆడాళ్లని కొట్టే సీన్‌గా పేరడీ చేసారు. ఆ సీన్‌లో సప్తగిరి విశ్వరూపమే చూపిస్తాడు. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే సినిమాకి వెళ్లినట్టయితే సప్తగిరి ఉండే ఆ కాసేపట్లోనే పైసా వసూల్‌ అయిపోతుంది. కాకపోతే ఇంతకు ముందు చెప్పుకున్న లోపాలు మరీ గ్లేరింగ్‌గా కనిపించడంతో ‘లవర్స్‌’ మోస్తరు సినిమాగా మిగిలిపోతుంది. మెయిన్‌ ప్లాట్‌ని మరీ అలా పక్క దారి పట్టించకుండా... సప్తగిరి కామెడీని కూడా ప్యారలల్‌గా నడిపించి ఉన్నట్టయితే ఈ చిత్రం మరింత రక్తి కట్టేది. 

ఏదేమైనా ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో కామెడీ సీన్లు బాగా పండితే మిగతా తప్పులన్నీ ప్రేక్షకులు క్షమించేసి కలెక్షన్లు కురిపించేస్తున్నారు. లవర్స్‌కి కూడా కామెడీ పెద్ద ప్లస్‌ కనుక ఇప్పటి ట్రెండ్‌ ప్రకారం ఇది కూడా బాగానే క్యాష్‌ చేసుకోవాలి. 

బోటమ్‌ లైన్‌: కామెడీ కోటాలో పాసైపోయే ‘లవర్స్‌’!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?