రివ్యూ: నేను శైలజ
రేటింగ్: 3.25/5
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
తారాగణం: రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్, ప్రదీప్ రావత్, రోహిణి, ప్రిన్స్, శ్రీముఖి, ధన్య బాలకృష్ణన్, కృష్ణభగవాన్, నరేష్ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: శ్రీకర్ ప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: 'స్రవంతి' రవికిషోర్
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: కిషోర్ తిరుమల
విడుదల తేదీ: జనవరి 1, 2016
అమ్మాయిని ప్రేమించే అబ్బాయి.. అబ్బాయిని ప్రేమించినా కానీ తండ్రి దగ్గర లాక్ అయిపోయే అమ్మాయి. పెళ్లి సెటిల్ అయిందని తెలిసి అమ్మాయింటికి అబ్బాయి వెళ్లి ఆ పెళ్లి అయ్యేలోగా ఆమె కుటుంబాన్ని మెప్పించి, తన ప్రేమకథని సుఖాంతం చేసుకోవడం. సింపుల్‌గా చెప్పుకుంటే 'నేను శైలజ' కథ ఇంతే. చాలా ప్రేమకథా చిత్రాల్లానే ఇది కూడా ప్రథమార్ధంలో లవ్ ట్రాక్ మీద, ద్వితీయార్ధంలో ఫ్యామిలీ ఎమోషన్స్ మీద రన్ అవుతుంది. ఎన్నోసార్లు చూసేసిన వ్యవహారం కనుక 'నేను శైలజ' నిజానికైతే బోర్ కొట్టాలి. క్లయిమాక్స్ ఏంటనేది ముందే తెలుసు కనుక మిగతాదంతా సాగతీత అనిపించాలి. కానీ ఈ రొటీన్ ప్లాట్‌ని మెప్పించేలా.. కాదు 'ప్రేమించేలా' చెప్పడంలోనే దర్శకుడు కిషోర్ తిరుమల సక్సెస్ అయ్యాడు.
ఎవరిని ప్రేమించాలో తెలియని అయోమయం, అసలు నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అర్థం కాని గందరగోళం.. హరిది (రామ్). తండ్రి ప్రేమకి దూరమై, మనసులోని భావాలని మాటలివ్వలేని ఇంట్రావర్ట్ శైలజ (కీర్తి). ప్రేమ వద్దు అనుకున్న హరికి తారసపడుతుంది శైలజ. మళ్లీ కనిపిస్తే చూద్దామనుకుంటాడు. మళ్లీ మళ్లీ కనిపించేస్తుంటే.. దేవుడెక్కడో లేడు.. ప్రపంచంలో ప్రేమ మాత్రమే ఉందనుకుంటాడు. 'ఐ లవ్యూ.. బట్ ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ' అని చెప్పి పోతుంది శైలజ. ప్రేమ లేదు.. దేవుడు మాత్రమే ఉన్నాడు అని రియలైజ్ అవుతాడు హరి. మరి ఈ హరికథ అంతటితో ముగిసినట్టేనా? అక్కడే ఒక క్యూట్ ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు కిషోర్.
ఈ చిత్రంలో పలు చోట్ల దర్శకుడి ముద్ర కనిపిస్తుంది. ఉంగరం చుట్టూ అల్లిన డ్రామా, శైలజతో తిరిగి కనెక్షన్ కోసమని వాడిన ప్రిన్స్-శ్రీముఖి ట్రాక్, పిల్లల భవిష్యత్తు కోసం వారికి దూరమైన తండ్రి పడే మానసిక క్షోభ.. చెప్పుకుంటే ఇలాంటివి చాలానే ఒక రొటీన్ కథకి కళ్లతో పాటు మనసప్పగించి చూసేట్టు చేస్తాయి. ప్రేమకథా చిత్రాల్లో అరుదుగా కనిపించే భావుకత, మనసుని తాకే గుణం ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే కథ పాతదైనా, కథనం తెలిసిన దారిలో వెళుతున్నా 'నేను శైలజ' మనసుల్ని గెలుస్తుంది. తెరపై పాత్రలు నవ్వుతుంటే ఆనంద పడుతూ, బాధ పడితే కళ్లు చెమర్చుతూ, విడిపోతుంటే కలవాలని ఆరాట పడుతూ చూసామంటే ఇక అంతకుమించిన ఎమోషనల్ కనెక్షన్ అక్కర్లేదు. ఈ సినిమాలో ఒక సీనుంది. హీరోయిన్ ఫ్యామిలీ ఫీలింగ్స్‌ని వారికి తెలీకుండా వీడియో తీస్తాడు హీరో. ఆ సందర్భంలో హీరోయిన్ తండ్రి చెప్పే మాటలకి కళ్లు తడవకుండా ఉండగలగడం కష్టం. 'ఆడపిల్లని పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపాలనేది ఎవడు రాసాడో కానీ ఖచ్చితంగా వాడికి కూతురు ఉండి ఉండదు' అంటూ ఒక తండ్రి తన కూతురిపై అపారమైన ప్రేమని వ్యక్తం చేస్తుంటే భావోద్వేగానికి గురి కాకుండా ఉండలేం.
అంతా తెలిసిన ధోరణిలోనే సాగుతున్నా కానీ ఎమోషన్స్ అన్నీ వర్కవుట్ చేయడంలోనే దర్శకుడు టాలెంట్ చూపించాడు. కామెడీ కోసమని ప్రత్యేకంగా సందర్భాలని సృష్టించకుండా ఉన్న పాత్రలతోనే వినోదం మిస్ అవకుండా చూసుకున్నాడు. తెలుగు సినిమా నుంచి చాలా గొప్ప క్లాసిక్స్‌గా నిలబడ్డ లవ్‌స్టోరీస్ వచ్చాయి. 'నేను శైలజ'కి వాటికి సరసన నిలబడేంత గొప్పతనం లేదేమో కానీ ఈమధ్య కాలంలో ఈ విధంగా అన్నీ చక్కగా కుదిరిన లవ్‌స్టోరీలు చాలా అరుదైపోతున్నాయి. రామ్ ఈ సినిమా విషయంలో ముందు నుంచీ చాలా ఎక్సయిటెడ్‌గా ఉన్నాడు. ఒక నటుడు తన పాత్రని బాగా ప్రేమిస్తే, దాంతో బాగా కనెక్ట్ అయితే అవుట్‌పుట్ ఎలా ఉంటుందనేది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. ప్రతి మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్‌ని, చిన్న డైలాగ్‌ని కూడా రామ్ అద్భుతంగా పలికించాడు, పలికాడు. ప్రేమకథలు ఎక్కువ చేయకుండా మాస్ సినిమాల మీద మోజు చూపించడమేంటో అర్థం కాదు. ఈ చిత్రంలో రామ్ ఒక ప్రేమికుడి భావోద్వేగాలని ఆవిష్కరించాడు.. హరి పాత్రకి ప్రాణం పోసాడు. కీర్తి సురేష్‌ది ఇంట్రావర్ట్ క్యారెక్టర్ కనుక కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాటికి లోబడి తన పాత్రకి న్యాయం చేసింది. సత్యరాజ్ క్యారెక్టర్‌కి చివర్లో కానీ ఎలివేషన్ ఉండదు. కీలకమైన సన్నివేశాల్లో తన అనుభవాన్ని ప్రదర్శించారు. ప్రదీప్ రావత్‌తో కామెడీ పాత్ర చేయించారు. ఒక టఫ్ విలన్‌తో ఇలాంటి పాత్ర చేయించడమనేది ఇంట్రెస్టింగ్ థాట్ కావచ్చు కానీ ప్రదీప్ కంటే ఎక్స్‌ప్రెసివ్ యాక్టర్ అయితే ఈ క్యారెక్టర్‌తో ఎక్కువ ఫన్ పండేది. ప్రిన్స్, శ్రీముఖి, సుధీర్, ధన్య అందరూ బాగా చేసారు. రోహిణి నటన సహజంగా ఉంది. విజయ్‌కుమార్‌కి కూడా కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి.
సాంకేతికవర్గం నుంచి పూర్తి సహకారం అందింది. సినిమాటోగ్రఫీ ప్లెజెంట్‌గా ఉంది. దేవి మ్యూజిక్ ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఎమోషనల్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. దర్శకుడిగానే కాకుండా సంభాషణల రచయితగాను కిషోర్ తిరుమల రాణించాడు. నవ్వించే డైలాగులతో పాటు ఆలోచింపజేసేవి, మనసుని తట్టేవి కూడా చాలా మాటలున్నాయి. ఈ తరహా ప్రేమకథలని ఇష్టపడే వారిని ఆకట్టుకునే అంశాలు 'నేను శైలజ'లో పుష్కలం. యువతని, ఫ్యామిలీస్‌ని కూడా సమానంగా ఆకట్టుకోగలదు కనుక విజయం కూడా తథ్యం.
బోటమ్ లైన్: అలరించే 'హరి శైలజ'ల ప్రేమకథ!
– గణేష్ రావూరి