Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రౌడీ

సినిమా రివ్యూ: రౌడీ

రివ్యూ: రౌడీ
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: ఏ.వి. పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
తారాగణం: మోహన్‌బాబు, విష్ణు, జయసుధ, శాన్వి, తనికెళ్ల భరణి, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు
రచన: గంగోత్రి విశ్వనాధ్‌
సంగీతం: సాయికార్తీక్‌
ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల
నిర్మాతలు: విజయ్‌ కుమార్‌. ఆర్‌, పి. గజేంద్రనాయుడు, ఎమ్‌. పార్థసారథి నాయుడు
సమర్పణ: ఎం. మోహన్‌బాబు
రచన, దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
విడుదల తేదీ: ఏప్రిల్‌ 4, 2014

‘రౌడీ’ చిత్రాన్ని సైలెంట్‌గా స్టార్ట్‌ చేసిన రామ్‌గోపాల్‌వర్మ ఒకేసారి మోహన్‌బాబు ఫస్ట్‌ లుక్‌తో ఈ చిత్రమొకటి ఉందనే సంగతిని తెలియజెప్పాడు. మోహన్‌బాబు మొదటి స్టిల్లే ఈ చిత్రంపై ఆసక్తిని రేకెత్తించింది. ట్రెయిలర్‌ని బట్టి ఇది వర్మ తీసిన ‘సర్కార్‌’కి తెలుగు వెర్షన్‌ అనే విషయం అర్థమైంది. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రానికి వీరాభిమాని అయిన వర్మ మరోసారి తన ఫేవరెట్‌ సినిమాని తనకి నచ్చిన రీతిలో తీసుకున్నాడు. అయితే ఈసారి ‘గాడ్‌ ఫాదర్‌’ పాత్రకి విలక్షణ నటుడు మోహన్‌బాబుని ఎంచుకోవడమే వర్మ సాధించిన మొదటి విజయం. 

కథేంటి?

రాయలసీమలో అన్నగారు (మోహన్‌బాబు) చెప్పిందే వేదం. ఒక ప్రాజెక్టు వస్తే అక్కడి ప్రజలు రోడ్డున పడతారని అన్నగారు అది రాకుండా అడ్డు పడుతుంటాడు. దాంతో ఆ ప్రాజెక్టుని ఎలాగైనా తెచ్చి లాభపడాలని చూస్తున్న వారు అన్నగారిని చంపాలని చూస్తారు. అన్నగారి కొడుకు కృష్ణ (విష్ణు) వారి పథకాన్ని ఎలా తిప్పికొడతాడనేది ‘రౌడీ’ కథ. 

కళాకారుల పనితీరు!

మోహన్‌బాబు పర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పాలంటే ఒకటే మాట... ‘రెస్పెక్ట్‌’! ఈ చిత్రంలో తన క్యారెక్టర్‌ పదే పదే ‘రెస్పెక్ట్‌’ గురించి మాట్లాడుతుంటుంది. మోహన్‌బాబులోని నటుడికి ఎవరైనా కానీ రెస్పెక్ట్‌ ఇచ్చే రీతిన ఆయన ‘అన్న’ పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేసారు. ఈ చిత్రానికి 1 టు 10 హైలైట్స్‌ ఉంటే అది మోహన్‌బాబే. ఆ తర్వాతే ఎవరికైనా స్థానం దక్కుతుంది. మోహన్‌బాబులోని విలక్షణతని ఇంతగా వాడుకున్న దర్శకులు ఈమధ్య కాలంలో ఎవరూ లేరు. రామ్‌గోపాల్‌వర్మ ఈ విషయంలో నూటికి నూరు మార్కులు సాధించినట్టే. 

విష్ణు ప్రథమార్థంలో పాసివ్‌గా ఉన్నా ఇంటర్వెల్‌ నుంచి యాక్టివ్‌ అవుతాడు. వరుసపెట్టి కామెడీ ప్రధాన చిత్రాలు చేసున్న విష్ణుకిది వెల్‌కమ్‌ ఛేంజ్‌. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. జయసుధ గురించి స్పెషల్‌గా చెప్పేదేముంది. శాన్వికి పెద్దగా స్కోప్‌ లేదు. తనికెళ్ల భరణి ‘వేదాలు’ కొన్ని నవ్విస్తాయి. పరుచూరి గోపాలకృష్ణ తదితరులంతా ఫర్వాలేదనిపించారు.  

సాంకేతిక వర్గం పనితీరు:

లౌడ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వర్మ సినిమాలకి కొంత కాలంగా సిగ్నేచర్‌ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఆ లౌడ్‌ బిజిఎం బాగున్నా కానీ చాలా సార్లు ఓవర్‌ అయింది. ఈ చిత్రంలో పాటల అవసరం కనిపించలేదు. పాటలన్నీ కూడా అనవసరంగా వచ్చి పడేవే. పోనీ అవేమైనా ఆకట్టుకునేలా ఉన్నాయా అంటే అదీ లేదు. ‘సీమ లెక్క’ పాట మినహా ఏవీ ఆకట్టుకోవు. కెమెరా వర్క్‌ కూడా కొన్ని ఫ్రేమ్స్‌లో మాత్రమే బాగుంది. వర్మ ఈమధ్య తీస్తున్న సినిమాలతో పోలిస్తే ఇందులో మరీ అతి అనిపించే కెమెరా యాంగిల్స్‌ లేవు. అలా అని ఒకప్పటి వర్మలోని అబ్బురపరిచే సాంకేతిక అంశాలకి కూడా ఇందులో చోటు లేదు. 

వర్మ ఇంతకుముందు తాను తీసిన సినిమాలనే కలిపి, కలిపి ‘రౌడీ’ తీసాడు. సర్కార్‌, సర్కార్‌ రాజ్‌ రెండు కథల్ని కలిపి ఒకటిగా గుదిగుచ్చాడు. శివ నేపథ్య సంగీతాన్ని వాడుకున్నాడు. రక్తచరిత్ర నేపథ్యాన్ని మరోసారి తీసుకున్నాడు. అయితే వర్మ ఈమధ్య కాలంలో తీస్తున్న సినిమాలతో పోలిస్తే రౌడీ చాలా బెటర్‌ అనిపిస్తుంది. కాస్టింగ్‌ విషయంలోనే వర్మ మాగ్జిమం స్కోర్‌ చేసేసాడు. మోహన్‌బాబు తప్ప మరెవరూ అన్న పాత్రకి న్యాయం చేయలేరు అనిపించేట్టుగా కలెక్షన్‌ కింగ్‌ ఈ పాత్రలో చెలరేగిపోయారు. ఆయనని ఇంత బాగా చూపించిన క్రెడిట్‌ వర్మకే దక్కుతుంది. 

హైలైట్స్‌:

  • మోహన్‌బాబు పర్‌ఫార్మెన్స్‌
  • క్లయిమాక్స్‌ సీక్వెన్స్‌లో విష్ణు పర్‌ఫార్మెన్స్‌
  • ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌

డ్రాబ్యాక్స్‌:

  • మ్యూజిక్‌
  • సెకండాఫ్‌లో గ్రిప్‌ తగ్గింది
  • క్లయిమాక్స్‌ మరీ సింపుల్‌గా ఉంది

విశ్లేషణ:

‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాతో పరిచయం ఉన్న వారికి, క్రైం డ్రామాలు ఇష్టపడే వారికి ‘రౌడీ’ ఓ మోస్తరు సినిమా అనిపిస్తుంది. జోనర్‌ స్పెసిఫిక్‌ సినిమా కనుక ఇందులో వినోదానికి, ఇతరత్రా వాణిజ్యాంశాలకి చోటు లేదు. స్టార్ట్‌ టు ఎండ్‌ సినిమాని సీరియస్‌గా నడిపించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్‌ అవదు కానీ క్రైమ్‌/డ్రామా నచ్చేవారిని కొంతవరకు మెప్పిస్తుంది. 

ప్రథమార్థంలో కంప్లీట్‌గా మోహన్‌బాబు షోతో బిగి సడలకుండా సాగుతుంది. కొన్ని సీన్లని కేవలం తన నటనతో మరో లెవల్‌కి తీసుకెళ్లారు మోహన్‌బాబు. ఉదాహరణకి రవిబాబుతో జరిపే సంభాషణ, పెద్ద కొడుకుని మందలిస్తున్నప్పుడు జయసుధ మధ్యలో మాట్లాడితే ఆమెని ‘మర్యాద’గా వారించే సన్నివేశం... ఆకట్టుకోవడమే కాకుండా వింటేజ్‌ వర్మ తాలూకు ఛాయల్ని అలా అలా పైపైన స్పృశించి పోతాయి. ఇంటర్వెల్‌ సీన్‌ని చిత్రీకరించిన విధానం బాగుంది. రక్తచరిత్రలో కనిపించిన ఆ రా అప్పీల్‌ మరోసారి ఈ సీన్‌లో దర్శనమిచ్చింది. 

సినిమాని మరీ తక్కువ రోజుల్లో, తక్కువ వనరులతో చుట్టి పడేసారనే భావన కలుగుతుంది. ఇదే చిత్రంపై వర్మ మరింత కసరత్తు చేసి ఉంటే ‘సర్కార్‌’ క్వాలిటీని ఇక్కడ కూడా తెచ్చి ఉండేవారు. ఒక్కోసారి మీకు ఆల్రెడీ తెలిసిన కథే కదా... ఇంక పూర్తి డీటెయిల్స్‌ ఎందుకు అన్నట్టుగా అనిపించింది వర్మ తీరు. ద్వితీయార్థాన్ని రసవత్తరంగా చిత్రీకరించే అవకాశమున్నా కానీ వర్మ పైపైన తీసుకుంటూ పోయాడు. పేలాల్సిన ట్విస్టు కూడా చాలా పేలవంగా అనిపించిందంటే వర్మ అలసత్వమే కారణం. 

మైనస్‌లకి తక్కువేం లేవు కానీ వర్మ ఇటీవలి చిత్రాలతో పోల్చుకుంటే చాలా వరకు తనని తాను కంట్రోల్‌లో ఉంచుకుని తీసినట్టు అనిపించింది. అయితే సర్కార్‌ని, రౌడీని పక్కపక్కన పెట్టి చూస్తే వర్మ క్వాలిటీ ఎంత తగ్గిపోయిందనేది కూడా స్పష్టమవుతుంది. ఈ చిత్రంలోని చాలా మైనస్‌లని మోహన్‌బాబు కవర్‌ చేసేసారనడంలో అతిశయోక్తి లేదు. ఇంటర్వెల్‌ తర్వాత కూడా మోహన్‌బాబుని అదే లెవల్లో వాడుకుని ఉంటే రౌడీ మరోలా ఉండేది. మోహన్‌బాబులోని పరిపూర్ణ నటుడిని చూడాలని ఉంటే రౌడీ తప్పక చూడాలి. వర్మ నుంచి అద్భుతాలు ఆశించకుండా ఒక మోస్తరు సినిమా చాలనుకుంటే ‘రౌడీ’ కొంతవరకు సంతృప్తినివ్వాలి. 

బోటమ్‌ లైన్‌: రౌడీ... ‘ది మోహన్‌బాబు’ షో!!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?