సినిమా రివ్యూ: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

రివ్యూ: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రేటింగ్‌: 3/5 బ్యానర్‌: ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ తారాగణం: సందీప్‌ కిషన్‌, రకుల్‌ ప్రీత్‌, నాగినీడు, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, బ్రహ్మాజీ, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి తదితరులు సంగీతం: రమణ…

రివ్యూ: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, రకుల్‌ ప్రీత్‌, నాగినీడు, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, బ్రహ్మాజీ, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి తదితరులు
సంగీతం: రమణ గోగుల
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాత: కిరణ్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
విడుదల తేదీ: నవంబర్‌ 29, 2013

టాలెంట్‌ ఉన్నా ఇంకా లక్‌ కలిసిరాక సక్సెస్‌ కాలేకపోతున్న సందీప్‌ కిషన్‌ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’పై చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. ‘ఆ నలుగురు’ సినిమాని పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది… అంటూ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ గురించి వర్ణించాడు సందీప్‌ కిషన్‌. కానీ ఇది పూరి జగన్నాథ్‌ సినిమాలాను లేదు, ఆ నలుగురు అంతకంటే కాదు. మంచి కథా వస్తువు ఉన్న ఒక డీసెంట్‌ ఎంటర్‌టైనర్‌. 

కథేంటి?

సందీప్‌ (సందీప్‌ కిషన్‌) తండ్రి (నాగినీడు) ఎవరు తప్పులు చేసినా కానీ సహించడు. తన ఇంట్లో వాళ్లకి కూడా తప్పుల లిస్ట్‌ తయారు చేసి, వంద తప్పులు చేసిన వెంటనే వాళ్లని ఇంట్లోనుంచి బహిష్కరిస్తాడు. అయితే ఆపదలో ఎవరు ఉన్నా సాయం చేసే అలవాటున్న సందీప్‌ తన తండ్రి దృష్టిలో 99 తప్పులు పూర్తి చేస్తాడు. మరో తప్పు చేస్తే అతడిని ఇంటినుంచి పంపేస్తారు. ఆ టైమ్‌లోనే తన అన్నయ్య పెళ్లి కోసమని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం ఫ్యామిలీ బయల్దేరుతుంది. కానీ సందీప్‌ ట్రెయిన్‌ మిస్‌ అయిపోతాడు. అతని వద్దే తాళిబొట్టు ఉండిపోవడంతో ఎలాగైనా ట్రెయిన్‌ క్యాచ్‌ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. 

కళాకారుల పనితీరు!

సందీప్‌ కిషన్‌ నటన సింపుల్‌గా, సహజంగా ఉంది. క్యారెక్టర్‌కి అనుగుణంగా కనిపించడానికి, నటించడానికి చూస్తాడు. అదే అతని బలం. ఇంతకుముందే నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న సందీప్‌ ఈ చిత్రంతో హీరోగాను గుర్తింపు పొందుతాడు. రకుల్‌ ప్రీత్‌ క్యారెక్టరైజేషన్‌ మొదట్లో ఇబ్బంది పెడుతుంది కానీ పోను పోను అలవాటవుతుంది. ఆమె ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌ పలకలేదు కానీ చూడ్డానికి బాగుంది కనుక తెలుగు సినిమా హీరోయిన్‌గా పాస్‌ అయిపోతుంది. 

తాగుబోతు రమేష్‌ తనకి అలవాటైన తాగుబోతు పాత్రలో బాగా చేశాడు. అతని సీన్లు చాలా వరకు నవ్విస్తాయి. ‘ప్రేమకథాచిత్రమ్‌’ ఫేమ్‌ సప్తగిరి మరోసారి తనదైన మార్కు హాస్యంతో నవ్వించాడు. నాగినీడు షరా మామూలే. ఎమ్మెస్‌ నారాయణ, బ్రహ్మాజీ తదితరులంతా తమ వంతు పాత్ర పోషించారు.  

సాంకేతిక వర్గం పనితీరు:

చాలా కాలం తర్వాత రమణ గోగుల మ్యూజిక్‌ అందించిన ఈ చిత్రంలో రెండే పాటలున్నాయి. అవి ఫర్వాలేదనిపించాయి. నేపథ్య సంగీతం బాగుంది. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ చిన్న చిత్రాన్ని కూడా రిచ్‌గా చూపించింది. ఎడిటింగ్‌ విషయంలో మరీ మొహమాటం ప్రదర్శించారు. సినిమా నిడివి చాలా చోట్ల అనవసరంగా పెరిగింది. కుదించి ఉంటే ఈ చిత్రానికి ఇంకా ప్లస్‌ అయ్యేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

దర్శకుడు మేర్లపాక గాంధీ అండర్‌ కరెంట్‌ మెసేజ్‌ ఉన్న ఈ సినిమాని వీలయినంత ఎంటర్‌టైనింగ్‌గా ప్రెజెంట్‌ చేసేందుకు చూశాడు. కొన్ని పాత్రల్ని తీర్చి దిద్దడంలో, కొన్ని సన్నివేశాలు పండించడంలో గాంధీ బాగానే సక్సెస్‌ అయ్యాడు. అయితే కొన్ని సందర్భాల్లో అవసరం లేని కామెడీ ఇరికించడానికి ప్రయత్నించి ఇబ్బంది పెట్టాడు. ఉదాహరణకి చివర్లో జయప్రకాష్‌రెడ్డితో ఆ టీవీ యాంకర్‌ జరిపే కామెడీ సంభాషణ. అదే విధంగా ఎక్కువ నస పెట్టకుండా ముగించాల్సిన చోట మరీ ఎక్కువ సాగదీసి విసిగించాడు. ఇలాంటి కొన్నిటిని పక్కన పెడితే గాంధీ డైరెక్షన్‌ బాగుంది. 

హైలైట్స్‌:

  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • తాగుబోతు రమేష్‌, సప్తగిరి కామెడీ

డ్రాబ్యాక్స్‌:

  • కొన్ని చోట్ల మరీ ఎక్కువ సాగదీశారు

విశ్లేషణ:

వందవ తప్పు చేయకుండా ఉండడానికి హీరో ఏమి చేశాడనే లాక్‌ని ముందే వేయడం వల్ల ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ జర్నీ ఆసక్తికరంగా మొదలవుతుంది. తర్వాత అసలు కథని ఫ్లాష్‌బ్యాక్‌ పద్ధతిలో నెరేట్‌ చేయడం ఇంట్రెస్ట్‌ సస్టెయిన్‌ చేస్తుంది. ఫస్టాఫ్‌లో దర్శకుడు కథనంపై ఫుల్‌ కమాండ్‌ చూపించాడు. అక్కడికీ ప్రథమార్థంలోను కొంత మేర ల్యాగ్‌ అనిపిస్తుంది. మధ్యమధ్యలో తాగుబోతు రమేష్‌, సప్తగిరి కామెడీ రిలీఫ్‌ ఇస్తూ ఉండడం వల్ల, ఇంట్రెస్టింగ్‌ లాక్‌ పడడం వల్ల ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ప్రయాణం సగం వరకు సాఫీగా సాగిపోతుంది. 

అవడానికి ట్రెయిన్‌ పేరున్నా కానీ ఇది రోడ్‌ మూవీ. రోడ్‌పై జర్నీ చేస్తూ, ట్రెయిన్‌ని హీరో ఎలా క్యాచ్‌ చేశాడనేది సినిమా. ఈ క్రమంలో సెకండాఫ్‌లో కాస్త పట్టు తప్పి అవసరం లేని పాత్రలు చొరబడి లెంగ్త్‌ పెంచుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అన్ని పాత్రల్నీ, సంఘటనల్నీ చివరకు లింక్‌ చేయడం బాగుంది. కాకపోతే దీనిని క్రిస్ప్‌గా, షార్ప్‌గా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించి ఉండాల్సింది. వీలున్న చోటల్లా కామెడీ ఇరికించాలని వేసిన ఎత్తులు పారలేదు. ఎమ్మెస్‌ నారాయణ క్యారెక్టర్‌లాంటివి లెంగ్త్‌ని పెంచడానికి తప్ప పెద్దగా పేలలేదు. 

సినిమాలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ రెండు గంటలు లేట్‌గా నడిచినట్టే, ఈ సినిమా కూడా అవసరానికి మించి ఒక ఇరవై నిముషాలు ఎక్కువ నిడివితో అక్కడక్కడా విసిగించింది. చిన్న చిన్న పొరపాట్లని ఓవర్‌లుక్‌ చేసినట్టయితే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ డీసెంట్‌ ఎంటర్‌టైనర్‌ అనిపిస్తుంది. జర్నీ కాసింత ‘సా…గింది’ అనిపించినా ఓవరాల్‌గా బాగుంది. మంచి ఇంప్రెషన్‌ అయితే వేయగలిగిన ఈ చిత్రాన్ని పబ్లిసిటీతో బాక్సాఫీస్‌ వద్ద సేఫ్‌గా డెస్టినీ చేరుస్తారో లేదో చూడాలి. 

బోటమ్‌ లైన్‌: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌: ఎంటర్‌టైనింగ్‌ జర్నీ

జి.కె