హమ్మయ్య.. ధోనీ పాసైపోయాడు.!

ఎట్టకేలకు టీమిండియా, సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ఇండియాలో సౌతాఫ్రికా టూర్‌ ఇప్పటిదాకా టీమిండియాకి నిద్రలేని రాత్రుల్నే మిగిల్చింది. రెండు టీ20ల్లో పరాజయం.. ఒక టీ20 వర్షార్పణం.. వెరసి టీ20 సిరీస్‌ సౌతాఫ్రికా కైవసం. ఇంకేముంది,…

ఎట్టకేలకు టీమిండియా, సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ఇండియాలో సౌతాఫ్రికా టూర్‌ ఇప్పటిదాకా టీమిండియాకి నిద్రలేని రాత్రుల్నే మిగిల్చింది. రెండు టీ20ల్లో పరాజయం.. ఒక టీ20 వర్షార్పణం.. వెరసి టీ20 సిరీస్‌ సౌతాఫ్రికా కైవసం. ఇంకేముంది, వన్డే సిరీస్‌ కూడా సౌతాఫ్రికాకి అప్పగించేయడమేనని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్టుగానే తొలి వన్డేని సౌతాఫ్రికాకి సమర్పించేసుకుంది టీమిండియా. రెండో వన్డే చూడటమే వేస్ట్‌.. అనుకుని కూడా, ఓ లుక్కేశారు భారత క్రికెట్‌ అభిమానులు. హమ్మయ్య.. అనుకునే విజయం టీమిండియా సొంతం చేసుకుంది. అభిమానులూ ఊపిరి పీల్చుకున్నారు. 

నేడు జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయాన్ని అందుకుందంటే, అందులో కీలక పాత్ర కెప్టెన్‌ ధోనీదే. బ్యాట్‌తో సత్తా చాటాడు.. వికెట్ల వెనుక ఉత్సాహంగా కనిపించాడు. టీమిండియాని విజయపథాన నడిపించాడు. బ్యాటింగ్‌ చేస్తున్నంతసేపూ ధోనీలో మునుపటి 'దూకుడు' కనిపించలేదుగానీ, సౌతాఫ్రికా వికెట్లు పడ్తున్న కొద్దీ ధోనీలో ఉత్సాహం పెరిగిందంటే, గత కొన్ని రోజులుగా ధోనీ ఎంత నెర్వస్‌గా ఫీలయ్యాడో అర్థమవుతుంది. 

ఎలాగైతేనేం, అతి త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ముందు ధోనీ కొత్త ఉత్సాహాన్ని అందుకున్నాడు. ధోనీ ఫామ్‌లోకి వస్తే, ఆటోమేటిక్‌గా టీమిండియా ఫామ్‌లోకి వచ్చేస్తుంది. వరుస పరాజయాలు ఏ కెప్టెన్‌ని అయినా కుంగదీసేస్తాయి. ధోనీ ఇందుకు మినహాయింపేమీ కాదు. టీమిండియాకి వైట్‌ ఎలిఫెంట్‌లా తయారయ్యాడన్న విమర్శల నేపథ్యంలో, సరైన విజయం కోసం ధోనీ ఎదురు చూశాడు. తన బ్యాటింగ్‌ సత్తా మరోమారు తానే తెలుసుకున్నాడు.. వికెట్ల వెనకాల మెరుపులా కదిలాడు, వెరసి.. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు ధోనీ. 

భారత బౌలర్లు గొప్పగా బౌలింగ్‌ చేసేశారని అనలేం. ఫీల్డింగ్‌లో మాత్రం చురుగ్గా కనిపించారు టీమిండియా ఆటగాళ్ళు. అప్పుడప్పుడూ బౌలర్లూ మెరిశారంతే. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ తొందరపడ్డారు.. అయినాసరే, చివరిదాకా టీమిండియా అభిమానుల్ని టెన్షన్‌ పెట్టారు సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌. చివరి వికెట్‌ పడేముందు కూడా భారత క్రికెట్‌ అభిమానులకు టెన్షన్‌ తగ్గలేదంటే, మన టీమ్‌ మీద మనకెంత నమ్మకం వుందన్న విషయం స్పష్టమవుతోంది. 

ఆట అన్నాక గెలుపోటములు సహజం. వరుస వైఫల్యాలు, అందునా వీళ్ళు ఒకప్పటి ఛాంపియన్లేనా.. ఇది బలమైన జట్టేనా.. అని విస్తుపోయేలా చేసిన పరాజయాలతో అభిమానులనుంచీ విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా కాస్త గాడిన పడ్డట్టే కన్పిస్తోంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే, సౌతాఫ్రికాని మన పిచ్‌ల మీద బోల్తా కొట్టించేయడం పెద్ద కష్టమేమీ కాదు. చూద్దాం.. ఇప్పటికైతే ధోనీ పాసయ్యాడు.. మిగతా ఆటగాళ్ళంతా రానున్న మ్యాచ్‌లలో చెలరేగిపోతారో లేదో.!