హీరో నాని కోరిక అదే

ఎప్పటికైనా బెన్ హర్ లాంటి ఎపిక్ సినిమా చేయాలన్నది తన కోరిక అని నాని వెల్లడించారు.

తనను తాను మలుచుకుంటూ వెళ్లే హీరోల జాబితాలో నాని కూడా వుంటారు. సరైన కథలు ఎంచుకుంటూ, సరైన పాత్రలు చేస్తూ తన మార్కెట్ ను క్రమేపీ పెంచుకుంటూ వంద కోట్ల మార్క్ దాటేసారు. ఇప్పుడు త్వరలో హిట్ 3 సినిమా విడుదలకు రెడీ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మోస్ట్ వయిలెంట్ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ సినిమా ఇది. ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇంటర్వూ ఇచ్చారు.

హిట్ 3 చేస్తానని అనుకోలేదని, ఇది ప్లాన్ చేసింది కాదని నాని వెల్లడించారు. హిట్ 2 చివర్లో చిన్న కామెయో క్యారెక్టర్ వుంటే బాగుంటుందని దర్శకుడు అనడంతో, తాను చేయాల్సి వచ్చిందన్నారు. క్యారెక్టర్ డిజైన్, పేరు అన్నీ అప్పటికప్పుడు సెట్ చేసుకున్నామన్నారు. అప్పటికి తనకు చాలా సినిమాలు లైన్ లో వున్నాయని, అందువల్ల హిట్ 3 అన్నది తీసినపుడు చూద్దాం అని అనుకున్నా అన్నారు. కానీ తాను పైప్ లైన్ లో పెట్టుకున్న ఓ సినిమా వెనక్కు వెళ్లడంతో గ్యాప్ వచ్చిందని, శైలేష్ ను పిలిచి కథ వుందా అని అడిగితే, చెప్పడం, అది నచ్చడం జరిగిపోయిందన్నారు. అలా హిట్ 3 మొదలైందన్నారు.

కిల్, యానిమల్ లాంటి సినిమాలు జనాలు ఆదరించారు అనే ఆలోచనతో హిట్ 3 ని ప్లాన్ చేయలేదని, నిజానికి ఆ పేర్లు అవన్నీ సినిమా పూర్తయిన తరువాత మీడియాతో ఇంట్రాక్ట్ అవుతుంటే ఇప్పుడు తెలుస్తున్నాయన్నారు. తెల్లకోటు, దాని మీద ఎర్రటి రక్తం మరకలు ఇవన్నీ యానిమల్ సినిమా ఇన్సిపిరేషన్ కాదని, సినిమా చూస్తే ఆ క్లారిటీ వస్తుందని అన్నారు.

హిట్ 3 లో వయిలెన్స్ అన్నది ఎక్కువ వుంటుందన్నది వాస్తవమే అయినా, పరిశోధన అనేది కూడా అంతకు అంతా వుంటుందన్నారు. పరిశోధన సాగి సాగి చివరకు వయిలెన్స్ తప్పనిసరి అన్న స్టేజ్ కు వెళ్తుందన్నారు. యాక్షన్ సీన్లు అనేవి సినిమా అంత పరుచుకుని వుంటాయన్నారు.

మన సినిమా కంటెంట్ ఏమిటో ముందుగా క్లారిటీ ఇచ్చేస్తే, అది నచ్చేవారే థియేటర్ కు వస్తారని, అలా చెప్పకుండా దాచితే, థియేటర్ కు వచ్చాక వాళ్లు ఒకటి అనుకుని, మనం ఒకటి చూపించి, ఇలాంటి సమస్యలు వుంటాయన్నారు. ఏదైనా సరే మార్నింగ్ షో పడే వరకే అని అందువల్ల సినిమాకు హాని కలగనంత వరకు క్లియర్ గా చెప్పేయడం బెటర్ అని నాని అన్నారు. తన పిన్నికి తన కామెడీ సినిమాలు నచ్చుతాయని, దసరా సినిమా నచ్చలేదని, హిట్ 3 టీజర్, ట్రయిలర్ చూడ వద్దని ముందే క్లారిటీగా చెప్పేసానని అన్నారు.

ఎప్పటికైనా బెన్ హర్ లాంటి ఎపిక్ సినిమా చేయాలన్నది తన కోరిక అని నాని వెల్లడించారు. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయడం అన్నది కష్టం అని, అయితే ఇప్పటికి తనకు ఆ మార్కెట్ వచ్చిందని నాని చెప్పారు. సుజిత్ దర్శకత్వంలో సినిమా తప్పకుండా వుంటుందన్నారు. ఈ ఏడాదికి హిట్ 3 ఒక్కటే సినిమా అని, దాని తరువాత పారడైజ్ వచ్చే ఏడాది వుంటుందని వివరించారు.

One Reply to “హీరో నాని కోరిక అదే”

Comments are closed.