అవంతి జనసేన రూటు?

టీడీపీలో చేరుతారని మొదట్లో ప్రచారం సాగింది. కానీ ఇపుడు జనసేన వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

వైసీపీలో చేరి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం పార్టీని వీడారు. ఆయన వైసీపీ మీద విమర్శలు చేస్తూనే వైదొలగారు. అయితే ఆయన కుమార్తె జీవీఎంసీలో ఆరవ వార్డు కార్పోరేటర్ అయిన ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక మాత్రం పార్టీలోనే ఉన్నారు. ఆమె ఇపుడు వైసీపీకి రాజీనామా చేశారు.

జీవీఎంసీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం కూటమి నేతలు పెట్టిన క్రమంలో ఆమె వైసీపీని వీడడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. కూటమికి సరైన సమయంలో అండగా నిలిచిన అనంతరం ఆమె తన తండ్రితో పాటే జనసేనలో చేరుతారని అంటున్నారు.

అవంతి శ్రీనివాస్ కి అయితే జనసేన ఒక విధంగా పాత పార్టీయే అని అంటున్నారు. స్వగృహ ప్రవేశంగా కూడా చెప్పుకోవాలని అంటున్నారు. ఆయన ప్రజారాజ్యం నుంచే రాజకీయంగా పరిచయం అయ్యారు. 2009 ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన వైసీపీని వీడడం వెనక కూడా కూటమి వైపు వెళ్ళాలన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.

ఇంతకాలం ఆయన రాజకీయ వైఖరి బయటపడకపోయినా ఇపుడు కుమార్తె కూటమి వైపుగా మొగ్గు చూపుతున్న క్రమంలో అవంతి రూట్ కూడా అటే అని అంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారని మొదట్లో ప్రచారం సాగింది. కానీ ఇపుడు జనసేన వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. జనసేన కూడా సీనియర్ నేతలకు ఆహ్వానం పలుకుతోంది.

జీవీఎంసీ మేయర్ మీద అవిశ్వాస ఘట్టం పూర్తి అయిన తరువాత అవంతి రాజకీయ నిర్ణయం మీద ఒక స్పష్టత రావచ్చు అని అంటున్నారు. అవంతి రాజకీయం చూసుకుంటే ప్రజారాజ్యం- కాంగ్రెస్- తెలుగుదేశం- వైసీపీలలో కొనసాగారు.

5 Replies to “అవంతి జనసేన రూటు?”

Comments are closed.