పూలే విగ్రహంపై పట్టువీడని కేసీఆర్ కూతురు

కవిత, బీసీలలో అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటును ఒక సెంటిమెంట్‌గా మార్చారు.

బీసీల పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తన పట్టిన పట్టును వీడటం లేదు. ఆమె కొంతకాలంగా అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఏప్రిల్ 11న పూలే జయంతి రోజున ఆయన విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. అందుకోసం ధర్నా చౌకిలో దీక్ష కూడా చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఆమె డిమాండ్‌ను అంగీకరించలేదు.

అయినా కవిత, బీసీలలో అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటును ఒక సెంటిమెంట్‌గా మార్చారు. పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే, రేవంత్ రెడ్డి బీసీలకు వ్యతిరేకమనే ప్రచారం ఊపందుకుంటోంది. ఏ ఎన్నికల్లోనైనా బీసీ ఓట్లు చాలా కీలకం కదా. కానీ కవిత డిమాండ్ చేస్తున్నట్లు అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే, దానివల్ల బీఆర్‌ఎస్‌కు రాజకీయ లాభం ఉంటుంది. “తమ డిమాండ్ వల్లే, తమ పోరాటం వల్లే అసెంబ్లీలో విగ్రహం పెట్టారు” అని ప్రచారం చేయవచ్చు.

చివరకు రేవంత్ రెడ్డి పూలే విగ్రహం పెట్టాలని నిర్ణయించారు. కానీ కవిత డిమాండ్ చేసినట్లు అసెంబ్లీలో కాకుండా నెక్లెస్ రోడ్డులో పెట్టాలని నిర్ణయించారు. ఆ స్థలాన్ని అధికారులతో, నేతలతో కలిసి పరిశీలించారు. త్వరలోనే నెక్లెస్ రోడ్డులో పూలే విగ్రహం ఏర్పాటు కావొచ్చు.

నెక్లెస్ రోడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని కవిత స్వాగతించారు. రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. అయినా ఆమె తృప్తి చెందలేదు. విగ్రహం అక్కడ పెట్టినా, తాను డిమాండ్ చేసినట్టు అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు.

“అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేవరకు పోరాటం సాగిస్తాం” అని కవిత చెప్పారు. ఇందుకోసం సీపీఎం మద్దతు కూడా తీసుకున్నారు. గతంలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ కవిత ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి తయారుచేసిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమె అంగీకరించలేదు. అప్పట్లో “ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊరూరా పెడతాం” అని ప్రకటించారు. ఆ ఉద్యమం ఆ తర్వాత ఏమైందో తెలియదు.

ఇప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం పట్టుబడుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అసెంబ్లీలో పూలే విగ్రహం గురించి కవిత ఎప్పుడూ మాట్లాడలేదు.

11 Replies to “పూలే విగ్రహంపై పట్టువీడని కేసీఆర్ కూతురు”

  1. ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడ డానికి అనుమతిస్తున్న మన రాజ్యాంగాన్ని మార్చాలి

Comments are closed.