జగన్‌ వ్యూహం సక్సెస్‌

కేడర్‌కు  ఊపిరి పోసిన మహాదర్నా కనిపించని కొణతాల ప్రభావం ఫ్యాన్‌ నీడనే ముగ్గురు ఎమ్మెల్యేలూ Advertisement విశాఖలో వైసీపీ నానాటికీ క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో అధినేత జగన్‌ వ్యూహాత్మకంగా నగరంలో భారీ ఆందోళనకు ఇచ్చిన…

కేడర్‌కు  ఊపిరి పోసిన మహాదర్నా
కనిపించని కొణతాల ప్రభావం
ఫ్యాన్‌ నీడనే ముగ్గురు ఎమ్మెల్యేలూ

విశాఖలో వైసీపీ నానాటికీ క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో అధినేత జగన్‌ వ్యూహాత్మకంగా నగరంలో భారీ ఆందోళనకు ఇచ్చిన పిలుపునకు కేడర్‌ అంతే ఉత్సాహంగా స్పందించింది. (ఆరు నెలల తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకు, రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ శుక్రవారం చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది. నగరంలోని కలెక్టరేట్‌ వద్ద భారీ జనసందోహం మధ్య ధర్నాను నిర్వహించారు. 

అధినేత వైఎస్‌ జగన్‌ ఆధ్వర్వంలో జరిగిన ఈ మహాధర్నాలో జిల్లాలోని ముఖ్య నాయకులతో పాటు, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పాలుపంచుకున్నారు. జిల్లాలో వైసీపీ పని అయిపోయిందన్న వారికి సమాధానంగా పెద్ద సంఖ్యలో కేడర్‌ హాజరు కావడం విశేషం. అలాగే, పార్టీ నుంచి మరిన్ని ఫిరాయింపులు ఉంటాయని, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వీడుతారన్న ప్రచారం ఉత్తది అని రుజువు చేసేలా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా హజరయ్యారు. ప్రత్యేకించి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మహాధర్నాకు హాజరుకావడం ద్వారా తన రాజకీయ గురువు కొణతాల రామకృష్ణ బాటలో తాను నడవడంలేదని స్పష్టం చేశారు. 

అలాగే, జిల్లాలోని ముఖ్య నాయకులు కూడా పార్టీని వీడలేదన్నది ఈ ధర్నా ద్వారా తెలియవచ్చింది. నగరానికి చెందిన ఓ ముఖ్య నాయకుడు చొక్కాకుల వెంకటరావు పార్టీని వీడినా ఉత్తర నియోజకవర్గం నాయకులు మాత్రం వైసీపీతోనే ఉన్న విషయం కూడా మహాధర్నాలో తెలిసింది.  ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ మహాధర్నా  సాగింది. జిల్లా పార్టీలో లుకలుకలు ఉన్నాయన్న  వదంతుల నేపథ్యంలో అంతా హాజరై తాము వైసీపీలోనే ఉన్నామని స్పష్టం చేయడం విశేషం. జిల్లాలో కొణతాల అనుచరులుగా ఉన్నవారు అనేకమంది వైసీపీలో కొనసాగడం ద్వారా మాజీ మంత్రి ప్రభావం, పట్టు వైసీపీలో లేదని తేల్చేశారు. 

కొణతాలకు ప్రియ శిష్యునిగా పేరు పొందిన కిడారి సర్వేశ్వరరావు మహాధర్నాకు హాజరుకావడమే కాకుండా ఉత్తేజపూరితమైన ప్రసంగాన్ని చేశారు. అలాగే, పార్టీని వీడతారనుకున్న పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఇక, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలరావు కూడా జగన్‌ అడుగులో అడుగులు వేశారు.  అనకాపల్లిలో కొణతాలకు మద్దతుగా నిలుస్తారనుకున్న బొడ్డేడ ప్రసాద్‌ వంటి వారు కూడా వైసీపీలోనే ఉన్నారన్న సత్యం మహాధర్నా ద్వారా తెలిసివచ్చింది.

ఇక, నగరంలో కూడా పలువురు కీలకమైన నేతలు వైసీపీలోనే ఉండాలని నిశ్చయించుకున్నారన్నది అవగతమైంది. మాజీ ఎమ్మెల్యేలు, స్వతహాగా బలం ఉన్న మళ్ల విజయప్రసాద్‌, తైనాల విజయకుమార్‌ వంటి వారు నగరంలో వైసీపీకి అండగా ఉన్నారు. అలాగే, పార్టీ గోడ దూకుతారని విస్తృత ప్రచారం జరిగినా కూడా సీనియర్‌ నేత వంశీకృష్ణ శ్రీనివాస్‌ జగన్‌తోనే ఉండాలనుకోవడం కూడా అర్బన్‌ జిల్లాలో వైసీపీకి బలమైన సంకేతంగానే భావించాలి. 

మొత్తం మీద మహాధర్నా వంటి భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లాలో వైసీపీ పట్టు సడలలేదని నిరూపించుకున్నట్లైంది. రానున్న రోజులలో జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ బలమైన పోటీ ఇస్తుందనడానికి మహాధర్నా ఓ సాక్ష్యంగా ఉంది. ఇక్కడకు వచ్చిన వారిలో అనేకమంది జీవీఎంసీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు కావడం విశేషం. 

జగన్‌ సైతం మహాధర్నాను విశాఖలో నిర్వహించడం ద్వారా కేడర్‌కు మంచి భరోసా ఇచ్చారనే చెప్పాలి. రానున్న రోజులలో కూడా పలుమార్లు విశాఖకు వస్తానని, పార్టీకి అండగా ఉంటానని చెప్పడం ద్వారా విభజన తరువాత అతి పెద్ద నగరమైన విశాఖ నుంచే బాబుకు బస్తీ మే సవాల్‌ అని జగన్‌ విసిరినట్లైంది. మొత్తం మీద వైసీపీ ధర్నా రాజకీయంగానే కాకుండా, సంస్ధాగతంగా కూడా బలోపేతం చేసినట్లైంది.

పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌,
విశాఖపట్నం,