‘చిన్నారి పెళ్ళికూతురు’ ఫేం ‘ఆనందిని’ తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన విషయం విదితమే. డబ్బింగ్ సీరియల్‌తోనే తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆనందిని అలియాస్ అవికా గోర్, తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో మరింతగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
తాజాగా ఇప్పుడామె నటించిన రెండో సినిమా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘దిక్కులు చూడకు రామయ్యా’ ఫేం నాగశౌర్య ఈ చిత్రంలో హీరోగా నటించాడు. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అవికా గోర్, రెండో సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తన ప్లేస్‌ని సుస్థిరం చేసుకుంటానంటోంది.
‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాపై ధీమాగా వున్న అవిక సంగతిలా వుంటే, జర్నలిస్ట్‌గా, పీఆర్‌వోగా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితుడైన గిరిధర్ ఈ చిత్రానికి నిర్మాత కావడం గమనార్హం. చిన్న సినిమాలు ఇటీవలి కాలంలో అనూహ్య విజయాలు అందుకుంటున్న దరిమిలా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ఎలాంటి రిజల్ట్ రాబట్టుకుంటుందో.!