లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా గుర్తుందా? అందులో నటించిన ఓ కుర్రహీరో గుర్తున్నాడా? ఆ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన ఆదిత్య ఓం అనే ఆ హీరో ఆ తర్వాత ధనలక్ష్మీ ఐ లవ్ యూ వంటి ఒకటీ అరా సినిమాల్లో కనిపించినా పెద్దగా ఎవరూ గుర్తు పట్టేంత సినిమా ఏదీ చేయలేకపోయాడు.
ఇటీవలే మళ్లీ సినీ రంగంలో ఈ హీరో కదలికలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే సినిమాలో ఆదిత్య నటిస్తున్నాడు. సరే ఇవన్నీ పెద్ద వార్తలు కావు గాని… సినిమాల్లో అరకొర అవకాశాలు తప్ప మరేమీ దక్కించుకోలేకపోయిన ఆదిత్య ఓం… గ్రామాల దత్తత కాన్సెప్ట్ తో ఫుల్‌గా ఇంప్రెస్ అయ్యాడు. తన వంతుగా తాను కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు.
భధ్రాచలం దగ్గర్లోని చెరుపల్లి అనే మైనర్ ఏజెన్సీ ఏరియాలోని ఒక వెనుకబడ్డ గ్రామాన్ని ఆదిత్య దత్తత తీసుకున్నాడు. అంతేకాదు… అప్పుడే ఆ గ్రామంలో ఎప్పటి నుంచో గ్రామ వాసులు ఎదుర్కుంటున్న న నీటి సమస్యను తీర్చేందుకు కూడా ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించాడట. దీని కోసం అక్కడ పనిచేస్తున్న పలు ఎన్‌జిఒ సంస్థలు ఆనందం ఫౌండేషన్, అమ్మానాన్న ఫౌండేషన్ వంటి వాటితో ఒప్పందాలు కదుర్చుకుంటున్నాడట. అలాగే ఆ గ్రామస్థులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా తయారు చేస్తున్నాడట.
సినిమారంగంలో విజయాల పరంగా గాని, ప్రేక్షకుల ఆదరణ పరంగా గాని పెద్దగా ఏమీ దక్కించుకోలేకపోయినా సామాజిక బాధ్యత నిర్వర్తించడానికి వాటితో సంబంధం లేదని నిరూపిస్తున్న ఆదిత్య ఓం అభినందనీయుడే.