దీన్ని భావ ప్రకటనా స్వేచ్ఛ అనేద్దామా?

ఓ యువతిపై గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడి, ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చెయ్యడమేంటి.? దాన్ని ‘డాక్యుమెంటరీ’గా ప్రదర్శించాలనుకోవడమేంటి.? ఎంత దారుణమైన విషయమిది.! Advertisement ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన ఇప్పుడు ప్రపంచ…

ఓ యువతిపై గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడి, ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చెయ్యడమేంటి.? దాన్ని ‘డాక్యుమెంటరీ’గా ప్రదర్శించాలనుకోవడమేంటి.? ఎంత దారుణమైన విషయమిది.!

ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. గతంలోనే ఈ రేప్‌ ఘటనపై ఎంత చర్చ జరగాలో అంతా జరిగింది. రోజులు గడిచిపోయాయి.. క్యాలెండర్‌ కూడా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ రేప్‌ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగడానికి కారణం, ఆ ఘటనలో నిందితుడైన ముఖేష్‌ సింగ్‌ని ఇంటర్వ్యూ చెయ్యడం. ఆ ఇంటర్వ్యూ వివరాలు బయటకు రావడం.

అత్యంత కర్కశంగా అత్యాచారం జరిపిన వారిలో ఒకడైన ముఖేష్‌ సింగ్‌, తాను చేసిన ఘనకార్యాన్ని సమర్ధించుకున్నాడు. పైగా మహిళలకు క్లాస్‌ తీసుకుంటున్నాడు. దీన్ని డాక్యుమెంటరీ రూపంలో ప్రసారం చేస్తానంటోంది ఓ ఛానల్‌. వ్యవహారం వివాదాస్పదం కావడంతో కేంద్రం ఆ డాక్యుమెంటరీ ప్రసారానికి అడ్డుకట్ట వేసింది. నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ‘ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే..’ అంటూ సదరు ఛానల్‌ న్యాయపోరాటం చేస్తామంటోంది.

ఇలాంటి విషయాల్లో ‘మానవత్వం’ అనే యాంగిల్‌లో ఎవరైనా ఆలోచించాలి. దేశ ఆర్థిక రాజధాని ముంబైపై దాడి చేసిన నరరూప రాక్షసుల్లో ఒకడు సజీవంగా పోలీసులకు చిక్కితే, అతనికి ఉరిశిక్ష వేయడానికి కేంద్రం మీన మేషాల్లెక్కెట్టాల్సి వచ్చింది. కొత్త అల్లుడ్ని మేపినట్లు మేపింది భారత ప్రభుత్వం. తనకు ఎలాంటి తిండి కావాలో జైలు నుంచి ఆర్డర్స్‌ వేశాడా నరరూప రాక్షసుడు. భారతదేశ చరిత్రలో అత్యంత ఖరీదైన ‘ఖైదీ’ అతడు. చివరికి ఎలాగోలా అతడికి ఉరిశిక్ష అమలయ్యిందనుకోండి.. అది వేరే విషయం. 

మనుషుల ప్రాణాలు తీసేవాడికి, అత్యంత కిరాతకంగా వ్యవహరించినవాడికి చట్ట ప్రకారం శిక్షించాలనుకోవడం.. ప్రపంచం దృష్టిలో మన గొప్పతనం చాటుకోవడమే కావొచ్చు. కానీ, మానవత్వం మరిచినవాడ్ని చట్ట ప్రకారమే అయినా వీలైనంత త్వరగా భూమ్మీద లేకుండా చేయాల్సి వుంటుంది. లేకపోతే, ఇదిగో.. ‘నిర్భయ’ నిందితుడి ఉదంతంలానే తయారవుతుంది.

డాక్యుమెంటరీ చిత్రించడానికి వెళితే, అయ్యగారు ఏమేం చెప్పారోగానీ, అందులో కొన్ని విషయాల్నే డాక్యుమెంటరీలో పొందుపర్చాడు. సినిమాల్లో చూపిస్తున్నారుగా.. ఎంత కిరాతకంగా రేప్‌లు జరుగుతున్నాయో. అలా తాను చేసిన వికృతం గురించీ ముఖేష్‌ విడమర్చి చెప్పాడేమో.! దాన్ని డాక్యుమెంటరీలో పొందుపర్చి, ప్రసారం చేసి.. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే కుదురుతుందా.?

ఖచ్చితంగా ఇలాంటి డాక్యుమెంటరీలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయి. సినిమా చూస్తాం. అందులో మంచిని గురించి ఆలోచించేవారు తక్కువమందే వుంటారు. హీరోయిన్‌ని హీరో టీజింగ్‌ చేస్తే, దాన్ని ఫొలో అవుతారు కుర్రకారు. అలాగే నిర్భయ నిందితుడి మీద డాక్యుమెంటరీలోనూ చివర్లో ‘ఇది తప్పు’ అని చెప్పినా, ఆ వీడియో చివరిదాకా చూసేదెందరు.?

భావ ప్రకటనా స్వేచ్ఛకీ హద్దులుంటాయి. నోరుంది కదా అని బూతులు తిడితే భరించలేం. చేతుల్లో ఆయుధం వుంది కదా అని ఎడా పెడా దాడులకు దిగితే కుదరదు. పిచ్చోడు కదా అని రాళ్ళేసినా ఊరుకోం. ఇది కూడా అంతే. మీడియాకి విజ్ఞత అవసరం. ముఖేష్‌ సింగ్‌ని అసలు మనిషిగానే లెక్కల్లో వుంచడానికి వీల్లేదు. అలాంటోడ్ని ఇంటర్వ్యూ చేయడం, డాక్యుమెంటరీ చిత్రీకరించడమే హేయం. కేంద్రం నిషేధించాక, న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామనడం దిగజారుడుతనం కాక మరేమిటి.?

కొసమెరుపు: భారత ప్రభుత్వ హెచ్చరికల్ని ‘తూనా బొడ్డు’ అనేస్తూ, సదరు ఛానల్‌, నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ ఘటన నిందితుడి ఇంటర్వ్యూని లండన్‌లో ప్రసారం చేసేసింది. భారత్‌లో మాత్రం ఈ ఇంటర్వ్యూని ప్రసారం చేయబోమంటోంది సదరు ఛానల్‌. ఇక్కడ ఇంకో పెద్ద ‘కితకిత’ ఏంటంటే, యూ ట్యూబ్‌ ఛానల్‌లో ఆ ఇంటర్వ్యూని అప్‌లోడ్‌ చేయడం.