ఎమ్బీయస్‌: రేవంత్‌ అంశం ఎంతదూరం వెళుతుంది?- 3

పర్యవసానాలు ఎలా తేలతాయో తెలియదు కాబట్టి రేవంత్‌ను పట్టివ్వడం కెసియార్‌ తీసుకున్న పెద్ద రిస్కే అనాలి. ఈ స్థాయిలో గ్యాంబుల్‌ చేయడం దేనికి? తెలంగాణలో టిడిపి బలంగా లేదు. ఉన్న లీడర్లందర్నీ కెసియార్‌ వూడ్చేస్తున్నారు.…

పర్యవసానాలు ఎలా తేలతాయో తెలియదు కాబట్టి రేవంత్‌ను పట్టివ్వడం కెసియార్‌ తీసుకున్న పెద్ద రిస్కే అనాలి. ఈ స్థాయిలో గ్యాంబుల్‌ చేయడం దేనికి? తెలంగాణలో టిడిపి బలంగా లేదు. ఉన్న లీడర్లందర్నీ కెసియార్‌ వూడ్చేస్తున్నారు. రేవంత్‌ ఒక్కరు తప్ప తక్కినవాళ్లు గట్టిగా పోరాడడం కూడా లేదు. బాబుపై కసి వుంది అనుకోవడానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ వుండరు, మిత్రులూ వుండరు. ఎంత కసియైనా యింత దూరం వెళతారా? రేవంత్‌, బాబులలో ఎవరు ఎ1యో, ఎవరు ఎ2యో త్వరలో తెలుస్తుంది. బాబు ఎమ్మెల్యేతో మాట్లాడినట్లు ఆడియో సాక్ష్యం వుందని తెలంగాణ హోం మంత్రి అంటున్నారు. అలా అయితే బాబు ఎ1 అయి, రేవంత్‌ బాబు ఏజంటుగా ఎ2 అవుతారు. ఎ1 అయినా ఎ2 అయినా ముఖ్యమంత్రిపై కేసు బుక్‌ చేస్తే అది పెద్ద స్కాండలే అవుతుంది. కేసు బుక్‌ చేయడానికి గవర్నరు అనుమతి వంటి బోల్డు తతంగం వుంటుంది. ఫైనల్‌గా కోర్టులో కేసు వీగిపోవచ్చు, కానీ యీ లోపున రాజకీయంగా మాత్రం బాబు యిరకాటంలో పడతారు. 

ఇప్పటికే యిరకాటం సంగతి అర్థమవుతోంది. ఈ విషయంలో బాబు మౌనం, టిడిపి నాయకుల మౌనం, బై అండ్‌ లార్జ్‌ తెలుగు మీడియా మౌనం యివన్నీ చాలా విషయాలు చెపుతున్నాయి. 'సైలెన్స్‌ యీజ్‌ ఎలాక్వెంట్‌' అని ఇంగ్లీషులో ఎక్స్‌ప్రెషన్‌ వుంది. 'మౌనం సుదీర్ఘంగా భాషించింది' అంటారు రమణగారు ఓ చోట. ఇలాటి సమయంలో మౌనంగా వుండడమే అనేక విషయాలు చెప్పేసినట్లు లెక్క! 'వాళ్లు ఎమ్మేల్యేలను కొని మాపై కేసు పెట్టారు' అని బాబు చేసిన కామెంటు రేవంత్‌ వ్యవహారంపై వివరణ కాదు. చూపించిన వీడియో ఫేక్‌ అనో, మరోటనో, రేవంత్‌ స్వతంత్రంగా వ్యవహరించారనీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దూకుడుగా వెళ్లారని అంటే ఆ సంగతి వేరు. అవేమీ అనలేదు. టిటిడిపి నాయకులైతే 'కెసియార్‌ చేసినది రైటయితే, రేవంత్‌దీ రైటే' అని ప్రకటన చేశారు. కెసియార్‌ చేసిన ప్రలోభాలపై ఆధారాలు లేవు, రేవంత్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి. తేడా అది!

ప్రస్తుతం వున్న యిరకాట పరిస్థితిలోంచి బయటపడడానికి బాబు ఏదైనా చేయవచ్చు, రాష్ట్రప్రభుత్వ ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తారేమోనని భయంగా వుంది అంటూ కొందరు పాఠకులు రాశారు. ఎలా బయటపడతారో మనకూ తెలియదు, బయటపడడానికి కొంతకాలం పడుతుందనుకోండి, యీలోగా ఏమౌతుంది అన్నది ఆలోచించి చూడండి. చట్టం తన పని తాను చేసుకుని పోతే మాత్రం బాబు కొంతకాలం అధికారానికి దూరంగా వుండవలసి వస్తుంది. జయలలితకైతే పన్నీర్‌ సెల్వమ్‌ వున్నారు. బాబుకి అంత నమ్మదగిన వ్యక్తి ఎవరున్నారు? ఉపముఖ్యమంత్రులిద్దరిలో ఎవరిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారని అడిగితే అందరం తెల్లమొహం వేయాల్సిందే. సర్వే నిర్వహిస్తే లోకేశ్‌ను కూర్చోబెడతారని ఫలితాలు వస్తాయి. లాలూ తన భార్యను కూర్చోబెట్టినట్లు, బాబు కొడుకుని కూర్చోబెట్టి రిమోట్‌ కంట్రోలుతో పనులు చక్కబెట్టవచ్చు. కానీ ఎపి ముఖ్యమంత్రిగా బాబు లేకపోతే పరిస్థితిలో చాలా మార్పు వస్తుందనడంలో తభావతు లేదు. బాబు యిప్పటిదాకా పెద్దగా ఏమీ చేయకపోయినా, ఆయన పరిపాలనాసమర్థుడని, కార్యదకక్షుడని, కేంద్రాన్ని ఒప్పించి ఏదో ఒకటి చేస్తారనీ ఆశ పెట్టుకున్నవారు లక్షల మంది వున్నారు. బాబు ఆ సీట్లో లేరు అనగానే సింగపూరు వాళ్ల దగ్గర్నుంచి అందరూ తటపటాయిస్తారు. తెలంగాణ నుంచి తరలి వెళదామనుకున్న పారిశ్రామికవేత్తలు అక్కడ ఎవరొస్తారో చూసి వెళదాం అని జాప్యం చేస్తారు. ఎందుకంటే టిడిపిలో బాబు భుజాల దాకా వచ్చే లీడరు లేరు. అలా లేకుండా బాబు జాగ్రత్త పడుతూ వచ్చారు. పార్టీ పదవి, సిఎం పదవి రెండూ తనే నిర్వహిస్తూ, ఎక్కడా తనకు పోటీ లేకుండా చూసుకున్నారు. 

ఆంధ్ర ప్రగతి కుంటుపడితే తెలంగాణకు, తెలంగాణ సిఎంగా వున్న కెసియార్‌కు లాభం. అందుకే యింత గ్యాంబుల్‌ చేశారని అనుకోవాలి. తెరాస, వైసీపీ, కాంగ్రెసు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని యిబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నాయి అని బాబు ఆక్రోశించడం వెనుక యిదే ఆలోచన వుందేమో! టిడిపిని యిబ్బందుల్లోకి నెడుతున్నారనడం వరకు కరక్టే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని ఓడిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని యిబ్బందుల్లో నెట్టడం ఏమిటి? ఇబ్బందేమిటంటే ఆంధ్ర అంటే బాబు అయిపోయింది. బాబు దెబ్బ తింటే ఆంధ్ర పరిస్థితి అయోమయం. అదే కెసియార్‌కు కావలసినది. రేవంత్‌తో ఆగితే లక్ష్యం నెరవేరినట్లు కాదు. 

బాబును దెబ్బ తీయడానికి కెసియార్‌ చాలా పెద్ద వ్యూహం పన్నారు. ఆంధ్ర నాయకుల ఫోన్‌లు ట్యాపింగుకు గురయ్యాయని తెలుస్తోంది. హైదరాబాదు వదిలిపెడితే మళ్లీ తెలంగాణలో టిడిపి పుంజుకోలేదేమోనన్న భయంతో బాబు రాజధానిని హైదరాబాదు నుండి తరలించడానికి సుముఖంగా లేరు. ఏడాది క్రితం 'ఆంధ్రకు వెళ్లి గుడారాల్లో పని మొదలుపెడతాం, 1953లో కర్నూల్లో అలా వుండలేదా' అంటూ కబుర్లు చెప్పారు. తాత్కాలిక రాజధాని గుర్తించాం అన్నారు, దసరా నుంచి అక్కడ నుంచే పని అన్నారు. కానీ ఉద్యోగులు సుముఖత వ్యక్తం చేయలేదు, ఉమ్మడి రాజధానిగా పదేళ్ల వ్యవధి వున్నపుడు వదులుకుని పోవడం దేనికి అని నాయకులు, ఉద్యోగులు వాదించారు. బాబు కూడా హైదరాబాదు వదిలేస్తే బొత్తిగా పరాయివాళ్లమై పోతామని బెదిరారు. తెలంగాణ పోలీసులు తమ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి కేసుల్లో యిరికించడం చూశాక 'ఇక్కడ ఎందుకున్నారాం బాబూ' అనుకుని వుంటారు. అదే ఆంధ్రలో వుంటే పోలీసు వ్యవస్థంతా తమ చేతిలో వుండేది. 

కెసియార్‌ ట్యాపింగ్‌ చేయించి, ఎసిబి ద్వారా రేవంత్‌ను పట్టించారు. కానీ ఎసిబిని పూర్తిగా నమ్మలేదని, ప్రయివేటు డిటెక్టివ్‌ల ద్వారా స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి, చివరి నిమిషంలో ఎసిబిని రంగంలోకి తెచ్చారని తెలుగుగ్లోబల్‌ డాట్‌కామ్‌ రాసింది. అంటే ఆంధ్ర నాయకులకే కాదు, తెలంగాణ సిఎంకు కూడా తెలంగాణ అధికారులపై నమ్మకం లేదన్నమాట. బాబు వలన ఉపకారాలు పొందిన అధికారులు పోలీసు వ్యవస్థలో, న్యాయవ్యవస్థలో వున్నారని, వారు తన పథకం పారనివ్వరని కెసియార్‌కు సైతం అనుమానమన్నమాట. వీడియో రికార్డింగు బయటకు వచ్చేదాకా బింకం చూపిన టిడిపి, ఆ తర్వాత కొలాప్స్‌ అయిపోయి జవాబిచ్చే స్థితిలో లేకుండా పోయింది. రేవంత్‌ నోరు విప్పితే ఏమవుతుందోనన్న భయం పట్టుకుంది. స్మార్ట్‌గా. యంగిష్‌గా వుండే ఆయన కూడా అరెస్టవగానే తనకు అర్జంటుగా అనారోగ్యం ముంచుకు వచ్చిందన్నాడు. ములాఖత్‌కు వచ్చినవాళ్లను కలవటం లేదు. ఏ స్టేటుమెంటు యిస్తే ఏం మునుగుతుందో తెలియదు. తెలంగాణ ప్రభుత్వం వద్ద వున్న ఆధారాలను నిర్ధారించుకుని అప్పుడు మాట్లాడితే బెటరు అనుకుంటున్నారు లాగుంది. ప్రపంచంలో దేని గురించైనా వ్యాఖ్యానించడానికి రెడీగా వుండే ఆంధ్ర సిఎం, ఆయన మీడియా సలహాదారు యీ విషయంలో గప్‌చుప్‌గా వున్నారు. 'తనకు నిద్రపట్టడం లేదని సిఎం అన్నారని వచ్చిన వార్తలో నిజం లేదు' అని మాత్రమే పరకాల ప్రభాకర్‌ ప్రకటించారు తప్ప రేవంత్‌ చర్యను సమర్థిస్తూనో, వ్యతిరేకిస్తూనో బాబు తరఫున స్టేటుమెంటు యివ్వలేదు. 

కెసియార్‌ గేమ్‌ ఏ మేరకు సక్సెసవుతుందన్నదే యిప్పుడు సస్పెన్స్‌. మోదీ సహకారం వుంటేనే కథ రక్తి కడుతుంది. లేకపోతే నీరుకారుతుంది. అప్పుడే పీయూష్‌ గోయల్‌ బాబు యింటికి, కెసియార్‌ యింటికి వచ్చి వెళ్లారట. రాజీ ప్రతిపాదనలు జరుగుతున్నాయనుకోవాలా? మోదీ ధోరణి ఎలా వుంటుందో కాస్త వూహించి చూద్దాం. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]

Click Here For Archives