ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే యాజమాన్య వర్గం సాధ్యమైనంత వరకు కార్మికులలో ఐక్యత ఏర్పడకుండా చూసి, తన దోపిడీ కొనసాగేట్లు చూసుకుంటూ వుంటుంది. ప్రభుత్వ విధానాలు తమకు అనుకూలంగా వుండేట్లు చూసుకుంటూ వుంటుంది. ఇక్కడ ప్రభుత్వం అనేది ఏమిటి? రాజరికంలో, సైనిక నియంతృత్వంలో అయితే రాజు/నియంత చెప్పినదాన్ని అడ్డుకునేవారు లేరు. వాళ్లను మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ప్రజాస్వామ్యంలో అత్యధిక ప్రజలు ఆమోదించిన పార్టీయే ప్రభుత్వంలోకి వచ్చి నియమాలు ఏర్పరస్తుంది. దేశంలో అత్యధికులు పేదలు, కార్మికులు, శ్రామికులు, రైతులు. వాళ్లకు నచ్చే కబుర్లు చెప్పి, వాళ్లకు మేలు చేస్తానని హామీలు యిచ్చి అధికారం చేజిక్కించుకున్న పార్టీ ఏర్పరచిన ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి, తమ కనుకూలంగా చట్టాలు తయారయేట్లా మేనేజ్ చేయడానికి ఎంతో లాఘవం అవసరం. అధికార పార్టీ నాయకులకు యింతకంటె ఎక్కువ కౌశలం వుండాలి. పైకి పేదలకు మేలు చేస్తున్నట్లు కనబడాలి, కానీ ధనికులకు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించాలి. అప్పుడే ధనికులు పార్టీకి నిధులు సమకూరుస్తారు. ఆర్థికవ్యవస్థ కుంటుపడకుండా చూస్తారు. లేకపోతే తమ పరిశ్రమలు మూసేసి, వేరే చోటికి తరలించేసి, అతలాకుతలం చేయగలరు.
పేదల ఓట్లు, ధనికుల నిధులు రెండూ కావలసిన పార్టీలు రకరకాల వేషాలు వేస్తాయి. ఒక్కోప్పుడు అవి జాతీయవాదమంటూ రెచ్చగొడతాయి. మరోసారి మతం పేరు మీద సంఘిటతం చేద్దామని చూస్తాయి. ఇంకోసారి కులాల పేరు మీద విడగొడతాయి లేదా బతికున్న నాయకుడి పేరు చెప్పో, చచ్చిపోయిన నాయకుడిపై సింపతీ అనో, ప్రాంతం పేర దురభిమానాలు రెచ్చగొట్టో, మరో ఎమోషనల్ యిస్యూను సృష్టించో, పేదరికం పోగొడతామని చెప్పో, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పో – ఏదో ఒకలా ఓట్లు సంపాదిస్తాయి. ఇలాటి పార్టీలతో ఎలా వేగాలి, వారితో చేతులు కలపాలా? ఘర్షించాలా? ప్రజలు తమ మాట వినకుండా వారి మాటే వింటూన్న పరిస్థితుల్లో ఆ పార్టీల్లో మారువేషాల్లో దూరిపోయి వారి విధానాలనే మన కనుకూలంగా మార్చివేయాలా? అనే ప్రశ్నలు కార్మిక, శ్రామిక వర్గాలకై ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీలను వేధించిన ప్రశ్నలు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వారిని యీ సమస్య వేధిస్తూనే వస్తోంది.
నియంతృత్వం, రాజరికం వున్న దేశాల్లో పాలకశక్తులతో హింసాయుత మార్గాల్లో తిరుగుబాటు చేసి తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సూటియైన మార్గం. ఇవాళ గెలవవచ్చు, రేపు ఓడవచ్చు, ఎల్లుండి మళ్లీ గెలవవచ్చు. ఎవరికి శక్తి వుంటే వారిదే గెలుపు. విధానాల్లో తర్జనభర్జనలు వుండవు. ప్రజాస్వామ్యం వున్న దేశాల్లో మాత్రం అంతా గందరగోళమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల వారికీ ఓటుంటుంది. అధిక సంఖ్యాకులను ఒప్పిస్తే తప్ప ఓట్లు రావు, అధికారం సిద్ధించదు. ఏ దేశంలోనైనా పేదలే అధిక సంఖ్యలో వుంటారు. అయితే యీ పేదరికం డిగ్రీల్లో తేడాల వలన, ఆర్థికంగా సమానస్థాయిలో వున్నా భావజాలంలో వ్యత్యాసం వున్నందు వలన అనేక వర్గాలు, అంతరాల దొంతరలు ఏర్పడతాయి. ధనికుల్లో కూడా అందరూ ఒకే స్థాయిలో వుండరు. కొన్ని వర్గాలను కూడదీసుకుని క్రింది స్థాయి ధనికుడు ఎగువ స్థాయి ధనికుణ్ని చేరాలనో, గెలవాలనో ప్రయత్నం చేస్తాడు. అవసరం తీరాక ఆ వర్గాలను విస్మరించవచ్చు కూడా. ఎవరైనా వ్యక్తి ఒక వర్గంలో పుట్టినా పరిస్థితుల వలన కానీ, కృషి వలన కానీ వేరే వర్గంలోకి మారగలడు. వర్గం బట్టి అతని ఆలోచనాధోరణీ మారుతుంది. దాన్ని బట్టి అతను బలపరిచే రాజకీయ పార్టీ కూడా మారుతుంది. నిరంతర చలనశీలమైన యింతటి డైనమిక్ సిచ్యుయేషన్‌లో ఏ పార్టీ స్థిరమైన ఆలోచనావిధానాన్ని నమ్ముకుని వుండజాలదు.
ఏమీ లేని వర్గాల ఆలోచనలో పెద్ద మార్పు అక్కరలేదు. 'పక్కవాడికి అతివృష్టిగా వున్నదాన్ని లాక్కుని, మీకు పెట్టి మీ యిద్దర్నీ సమానం చేస్తాం' అంటే సరేసరే అంటారు. వాళ్లకు పోయేదేముంది, వస్తే మంచిదే! పై వర్గాల వారికి యీ విధానం అత్యంత ప్రమాదకరం. 'నాకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని, లేదా నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని పక్కవాడితో సమానంగా పంచుకోవడం' అనే ఆలోచనే దుస్సహం. అయితే ఆ మాట గట్టిగా అంటే లేనివాళ్లంతా కలిసి తంతారేమోనని భయం. వాళ్లే అధికసంఖ్యలో వున్నారు కాబట్టి విప్లవం వస్తే మొత్తం ఏమీ లేకుండా పోతుంది కాబట్టి వాళ్లకు కాస్త కాస్త యిచ్చి జోకొడుతూ, ఆ అంతరం అలాగే మేన్‌టేన్ చేద్దామని వాళ్లనుకుంటారు.
మధ్యతరగతి ప్రజలది అసలైన సమస్య. వాళ్లు ఆర్థికపరంగా చూస్తే అధోవర్గాల్లో వుంటారు, కానీ మెంటాలిటీ రీత్యా ధనికవర్గాలతో మమేకమౌతారు. కమ్యూనిజం వచ్చి అందరూ సమానమంటే మనం నష్టపోతాం అంటూ తెగ భయపడిపోతారు. వ్యవస్థ రద్దు చేసి ఉన్నదంతా అందరికీ సమానంగా పంచితే లాభపడేవాళ్లలో వాళ్లూ వుంటారు. కానీ వాళ్లు అలా అనుకోరు. ఉన్నది పోతుందని, అధోవర్గాల వారు నెత్తికెక్కి కూర్చుంటారని బెంగపడి ఆ మార్పు, ఆ విప్లవం రాకూడదని మొక్కుకుంటూ వుంటారు. మధ్యతరగతి అని సింపుల్‌గా అనేస్తాం కానీ దీనిలోనే నాలుగు వర్గాలున్నాయి. పేదలకు అతి సమీపంగా వున్న వర్గం, కింది మధ్యతరగతి, మధ్య-మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి! సమాజంలో అత్యంత డైనమిక్‌గా పొజిషన్లు మారే వర్గం యిదే. జీవనశైలిలో కొద్దిపాటి మార్పు వచ్చినా పైకో కిందకో వెళ్లిపోతారు. కమ్యూనిస్టు పరిభాషలో బూర్జువా, పెట్టీ బూర్జువా పదాలు తరచుగా వస్తాయి. ఆ వర్గాల మనస్తత్వం గురించి విస్తృత చర్చలు జరిగాయి. మన భారతదేశానికి అన్వయించుకుని నేను మధ్యతరగతి అంటున్నాను. ఇతరదేశాల్లో లేని యింకో వర్గీకరణ కూడా వుంది. కులం! అగ్రకులస్తుడు పేదవాడైనా, ఆ ముక్క చెప్పుకోడు. తనను తాను మధ్యతరగతిగానే భావించి, విప్లవాన్ని అడ్డుకోవడానికి చూస్తాడు.
ఈ మధ్యతరగతి వాళ్లే ఓటర్లలో ఎక్కువ శాతం వున్నారు. దారిద్య్రరేఖకు దిగువన వున్నవారి సంఖ్య గణాంకాలు లెక్కలోకి తీసుకోవద్దు. మానసికంగా మధ్యతరగతిలో వున్నవారిని కలిపి చెపుతున్నాను. కష్టపడి, సొంత ఆస్తి కూడబెడదామని, వేరెవరితోనూ పంచుకోకుండా దాన్ని దాచుకుందామని అనుకునేవాళ్లు కోకొల్లలు. ఇవాళ నువ్వు కష్టపడి సంపాదించి తిండి పట్టుకు రా, పక్కవాడికి జ్వరం, వాడు పనిలోకి పోలేడు కాబట్టి నీ తిండి వాడికి పెట్టు అంటే 'వాడికి జ్వరం వస్తే వాడి ఖర్మం. నన్నేం చేయమంటావ్?' అంటాడు. రేపు నాకేదైనా వస్తే వాడు చేస్తాడన్న నమ్మకం ఏమిటి? అంటాడు. ఇలాటి ఫీలింగ్స్ వుంటాయనే ప్రాచీనకాలం నుండి సామాజిక నియమాలు ఏర్పరచిన ద్రష్టలు – పక్కవాడికి పెడితే పుణ్యం వస్తుంది, స్వర్గంలో చోటు దొరుకుతుంది అని ఆశ పెట్టి బీదవాడి కడుపు కూడా కొంతైనా నిండేట్లు చూశారు. అది కూడా కొంతవరకే వర్కవుట్ అవుతుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2014)