ఎమ్బీయస్‌ : దీపావళి సందర్భంగా ఢిల్లీలో అల్లర్లు

ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు ప్రకటించడానికి కాస్త ముందు, అసెంబ్లీని అలాగే వుంచి మూడు స్థానాల్లో ఉపయెన్నికలు జరిపిస్తారని అనుకున్నారు. ఆ సందర్భంగా మతపరంగా ఓట్లను చీల్చవలసిన అవసరం వున్న పార్టీలు మతకల్లోలాలు…

ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు ప్రకటించడానికి కాస్త ముందు, అసెంబ్లీని అలాగే వుంచి మూడు స్థానాల్లో ఉపయెన్నికలు జరిపిస్తారని అనుకున్నారు. ఆ సందర్భంగా మతపరంగా ఓట్లను చీల్చవలసిన అవసరం వున్న పార్టీలు మతకల్లోలాలు రగిలించాయని అనుమానం వచ్చింది – దీపావళి సందర్భంగా తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో జరిగిన అల్లర్లు గమనిస్తే. 1976లో వెలసిన త్రిలోక్‌పురి కాలనీలో చాలా బ్లాకులున్నాయి. వాటిల్లో హిందువులే మెజారిటీలో వున్నారు. 15, 27 బ్లాకుల్లో మాత్రమే ముస్లిములు అధిక సంఖ్యలో వున్నారు. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన శిఖ్కు వ్యతిరేక అల్లర్లలో 350 మంది శిఖ్కులను చంపిన సంఘటన తర్వాత త్రిలోకపురిలో మతకలహం ఎప్పుడూ జరగలేదు. అక్కడ అగ్గి రగిలించాలని సంకల్పించిన కొందరు దసరా సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఒక మసీదు దగ్గర్లో దసరా పందిరి వేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు. దుర్గాదేవి ఫోటోను ఓ బల్లమీద పెట్టారంతే విగ్రహం అదీ ఏమీ లేదు. బిజెపి ఎమ్మెల్యే మహేష్‌ గిరి వచ్చి దాన్ని అవిష్కరించి 51 వేల రూ.లు కానుకగా యిచ్చాడు. దసరా అయిపోయినా ఆ పందిరి తీసేయలేదు. అలాగే కొనసాగించారు. గురువారం దీపావళి నాడు 20 నెం. బ్లాకులో ఒక హిందూ కుర్రాడు, ఒక ముస్లిము కుర్రాడు కొట్టుకున్నారు. అది కాస్త పెరిగి పెద్దవాళ్లు కూడా యిన్‌వాల్వ్‌ అయ్యారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పి రాత్రికల్లా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే శుక్రవారం పొద్దున్న కొత్తగా గొడవ ప్రారంభమైంది. అదీ ఏ సంబంధం లేని 27 వ నెం. బ్లాకులో! అక్కడ వున్న 500 యిళ్లల్లో 460 యిళ్లు ముస్లిములవే. అలా జరగడానికి వెనుక సునీల్‌ వైద్‌ బిజెపి అనే మాజీ ఎమ్మెల్యే, రామ్‌ చరణ్‌ గుజరాతీ అనే బిజెపి నాయకుడు కారణమని కొందరంటున్నారు. గురువారం రాత్రి రామ్‌ గుజరాతీ 11, 13, 18 బ్లాకుల్లోని దళితులతో మీటింగులు పెట్టాడట. సునీల్‌ వైద్‌ తన యింట్లోనే 200 మందితో సమావేశం ఏర్పాటు చేశాట్ట. 

అంతే శుక్రవారం మిట్టమధ్యాహ్నం వేళలో ముస్లిములు మెజారిటీ వున్న బ్లాకుల్లో రాళ్లు విసురుకోవడం మొదలైంది. ఎక్కణ్నుంచో 150 మందిని ట్రక్కులో తెచ్చుకుని వచ్చి గొడవలు చేయించారని కాలనీవాసులు అంటున్నారు. బజారులో పడి దుకాణాలు దోచారు. కానీ తగలబెట్టలేదు. ఎటు జెడ్‌ అనే ఒక ముస్లిము దుకాణానికి మాత్రం నిప్పు పెట్టారు. పోలీసు స్టేషను ఐదు ని||ల దూరంలో వున్నా రెండు గంటల తర్వాత పోలీసులు వచ్చారు. ఎందుకని అడిగితే 'మాకు పొద్దుటి నుంచి 190 బోగస్‌ కాల్స్‌ వచ్చాయి. దీని గురించి వచ్చిన ఫోన్‌కాల్‌ కూడా బోగస్సే అనుకున్నాం' అని వాళ్లు చెప్పారు. అంటే ఆ ఫేక్‌ కాల్స్‌ కూడా ప్రణాళిక ప్రకారం చేసినవన్నమాట. సాయంత్రానికి సిఆర్‌పిఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌ దళాలను కూడా దింపారు. అయితే అరెస్టులు చేయలేదు. శనివారం ఉదయం 10 గంటలకు గొడవలు మళ్లీ మొదలై సాయంత్రం 4 గంటలదాకా సాగాయి. పోలీసులు 60 రౌండ్లు బాష్పవాయుప్రయోగం చేశారు. 144 సెక్షన్‌ విధించారు. ప్రస్తుతం ఢిల్లీ గవర్నరు పాలనలో వుంది. ఢిల్లీ పోలీసులు డైరక్టుగా కేంద్ర హోం శాఖకే రిపోర్టు చేస్తున్నారు. ఈ త్రిలోక్‌పురి పార్లమెంటు నుండి 10 కి.మీ.ల దూరంలో వుంది.  అయినా 144 విధించడానికి మూడు రోజులు పట్టింది. త్రిలోక్‌పురి నుండి ఆప్‌ అభ్యర్థి చేతిలో బిజెపి అభ్యర్థి 17 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మోదీ విజయం తర్వాత యీ సారి అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గాలని బిజెపి ఆశించడంలో ఆశ్చర్యం లేదు. అందుకే త్రిలోకపురిలో అమ్మవారి ఆ టెంపరరీ పందిరి తీసేయలేదు సరి కదా, అక్కడ గుడి కడతామంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. మసీదు, దాని ఎదురుగా గుడి అంటే యిక మతరాజకీయాలు నడిపేవారికి సందడే సందడి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]