మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా ఇచ్చేశారు. స్పీకర్ ఫార్మెట్ లోనే రాజీనామా చేసిన గంటా తాను ఉక్కు కర్మాగారం కోసం త్యాగం చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు.
అయితే గంటా రాజీనామా అంతా జనాలను మభ్యపెట్టే వ్యవహరమని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత విష్ణు కుమార్ రాజు అంటున్నారు. గంటా ఎన్నిసార్లు రాజీనామా చేసినా అక్కడ ఆమోదం పొందదు అంటూ బాంబు పేల్చేశారు.
గంటా అయిదేళ్ళూ ఎమ్మెల్యేగా ఉంటారంటూ గంభీరమైన ప్రకటన చేశారు రాజు గారు. మరి రేపో మాపో తన రాజీనామా ఆమోదం పొందుతుందని గంటా అంటూంటే ఈయన ఇలా మాట్లాడడమేంటి అంటే అక్కడే ఉంది మతలబు అంటున్నారు.
గంటా అసలైన రాజకీయం స్థానిక ఎన్నికల తరువాత స్టార్ట్ అవుతుంది అని కూడా రాజు గారు జోస్యం చెబుతున్నారు. అంటే ఆయన పార్టీ మారుతారని కూడా బీజేపీ నేత చెప్పకనే చెబుతున్నారు.
గంటా ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తర నియోజకవర్గంలో టీడీపీకి ఓట్లు వేయవద్దని కూడా ఆయన సరికొత్త పిలుపు ఇస్తున్నారు. మొత్తానికి గంటా చేరే పార్టే ఏంటో సస్పెన్స్ లో పెట్టిన రాజు గారు గంటా మాత్రం టీడీపీలో ఉండరు అని మాత్రం తేల్చేశారు అనుకోవాలేమో.