ఓవర్ సీస్ మార్కెట్ ఇప్పుడు తెలుగు సినిమాకు అదనపు వరంగా మారింది. ఓ విధంగా శాటిలైట్, ఓవర్ సీస్ మార్కెట్ రెండూ అదనపు ఆదాయాలే. సినిమా రేంజ్ ఓ లెవెల్ లో వుంటే హీరోను బట్టి అయిదు నుంచి పది కోట్లుశాటిలైట్ లోనే వచ్చేస్తుంది. అలాగే పదిలక్షల డాలర్లు అంటే అన్ని ఖర్చులు పోయినా నాలుగు కోట్ల రూపాయిలు నిర్మాతకు ఆదాయం వస్తుంది. మీడియం సినిమాలు కూడా ఇప్పుడు ఓవర్ సీస్ లో వన్ మిలియన్ డాలర్లు వసూలు చేయచ్చని ప్రూవ్ అవుతోంది.
భలేభలే బడ్జెట్ లో సగం మేరకు ఓవర్ సీస్ లాభం వుంది అంటే ఆ ఆదాయాన్ని తక్కువ అంచనా వేయలేం. సుమారు ఆరున్నర కోట్లతో నిర్మించిన బిబిఎమ్ కు మూడున్నర కోట్ల వరకు శాటిలైట్ లోనే వచ్చింది. అమ్మడం సంగతి పక్కన పెడితే మరో రెండున్నర కోట్ల వరకు ఓవర్ సీస్ లో వచ్చింది. అంటే దాదాపు నిర్మాణం ఖర్చు అంతా రాబట్టేసినట్లే.
ఇధిలా వుంటే హీరో నానికి ఓవర్ సీస్ లొ వన్ మిలియన్ మార్కును ఇచ్చిన రెండో సినిమా ఇది. గతంలో ఈగ కూడా వన్ మిలియన్ డాలర్లు క్రాస్ అయింది. ఇప్పుడు బిబిఎమ్ ఆ మార్క్ ను మరో ఒక్క రోజులో దాటేస్తుంది.
అయితే ఓవర్ సీస్ ప్రేక్షకుల అభిరుచులు చిత్రంగా వుంటాయి. అన్ని సినిమాలను ఇలా ఆదరించేయరు. తెలుగులో చాలా సినిమాలకు నలభై కోట్ల మార్కును దాటిన రామ్ చరణ్ ఇంతవరకు ఓవర్ సీస్ లో ఈ వన్ మిలియన్ ఫీట్ ను చేయలేకపోయాడు. ఇప్పుడు రాబోయే బ్రూస్ లీ తో ఆ ఫీట్ చేస్తాడని ఆశిస్తున్నారు. ఎందుకంటే శ్రీనువైట్ల సినిమాలకు ఓవర్ సీస్ లో మంచి క్రేజ్ వుంది. ఈ సినిమా వన్ మిలియన్ రికార్డు అందుకునే అవకాశాలు చాలా వరకు వున్నాయని భావిస్తున్నారు.
అయితే ఇలా ఓవర్ సీస్ ఆదాయాన్నినమ్ముకుని నష్టపోయిన సినిమాలు వున్నాయి.ఓవర్ సీస్ లో తమ సినిమా విరగదీసేస్తుందని నమ్మకంతో, ఎవరు కొనకపోయినా, బోలెడు ఖర్చు చేసి, విడుదల చేసిన సినిమాలు వున్నాయి. వాటికి ఆ ఖర్చులు కూడా రాకపోవడం చిత్రం.