ఎమ్బీయస్‌ : ముస్లిం జనాభా పెరుగుదలపై ఆందోళన

2011 జనాభా గణాంకాలు పూర్తిగా బయటకు వచ్చేలోపుగా జనవరి 22న ఒక 'పదేళ్లలో 24% పెరిగిన ముస్లిం జనాభా' అంటూ ఒక లీకు వెలువడింది. దాని ప్రకారం 2001-11 మధ్య జనాభా పెరుగుదల సగటున…

2011 జనాభా గణాంకాలు పూర్తిగా బయటకు వచ్చేలోపుగా జనవరి 22న ఒక 'పదేళ్లలో 24% పెరిగిన ముస్లిం జనాభా' అంటూ ఒక లీకు వెలువడింది. దాని ప్రకారం 2001-11 మధ్య జనాభా పెరుగుదల సగటున 18% వుండగా ముస్లింల జనాభా మాత్రం 24% పెరిగింది. జనాభాలో 2001లో ముస్లింల శాతం 13.4% వుండగా అది 2011 నాటికి 14.2% అయింది. దేశవ్యాప్తంగా సగటు ముస్లిం జనాభా పెరుగుదల 0.8% కాగా, బంగ్లాదేశ్‌ నుండి వలసలు ఎదుర్కుంటున్న  బెంగాల్‌లో 1.8% పెరగగా అసాంలో 3.3% పెరిగింది. ఉత్తరాఖండ్‌లో 2% పెరిగింది. ఈ అంకెలు బయటకు రాగానే ఈ లెక్కన యీ దేశంలో కొన్నాళ్లకు హిందువుల కంటె ముస్లిములు పెరిగిపోతారన్న ఆందోళన ప్రారంభించారు హిందూత్వవాదులు. సాక్షి మహారాజ్‌, సాధ్వీ ప్రాచీ వంటి వారు హిందూ తల్లులు యిబ్బడిముబ్బడిగా పిల్లల్ని కనాలని పిలుపు నిచ్చారు. శివసేన నాయకుడు 'పదిమంది కంటె ఎక్కువమందిని కన్న హిందూ మహిళకు రూ.21000 బహుమతి యిస్తాం' అని ప్రకటించాడు. శివసేన ఉత్తర్‌ప్రదేశ్‌ అధ్యకక్షుడు ''ముస్లిములు కుటుంబ నియంత్రణ పాటించటం లేదు. మనమెందుకు పాటించాలి?'' అని గర్జించాడు. ముస్లిం జనాభా పెరుగుదలను ఏ కోణంలో చూడాలి? ఇండియాలో హిందువులు మైనారిటీ అయ్యే ప్రమాదం వుందా? అనే విషయం తెలుసుకోవాలంటే గణాంకాలను పూర్తిగా పరికించాలి. పాక్షికంగా వస్తున్న లీకులు అనవసరంగా గందరగోళ పరుస్తాయి.

ఈ  2011 జనగణన కంటె ముందే 2006లో వెలువడిన సచార్‌ కమిటీ ముస్లిం జనాభా గురించి సరైన అంచనాలే వేసి 2011 నాటికి 14.2% అవుతుందని చెప్పింది. నిజానికి ముస్లింలలో పునరుత్పత్తి గతంలో కంటె తగ్గింది. 1991-2001 మధ్య ముస్లిం జనాభా పెరుగుదల 29%. తర్వాతి థాబ్దంలో అది 24% అయింది.  1998-99 కాలంలో ముస్లిం మహిళల ఫెర్టిలిటీ రేటు (పునరుత్పత్తి శాతం) 3.59% వుండగా, 2005-06 నాటికి అది 3.09% అయింది. అంటే 0.50% తగ్గింది. అదే కాలంలో హిందువుల్లో 2.78% నుండి 2.65%కి తగ్గింది. అంటే తగ్గుదల 0.13% మాత్రమే. ముస్లిం మహిళలలో మార్పు వస్తోంది కాబట్టే యీ తగ్గుదల సంభవించింది. 1992-2006 మధ్య ఫెర్టిలిటీ రేటు శాతంలో తగ్గుదల ముస్లింల విషయంలో 30% కాగా, హిందువుల విషయంలో 20% మాత్రమే! హిందువుల కంటె ముస్లిం మహిళలు ఎక్కువమంది సంతానాన్ని కలిగి వుండటానికి కారణాలున్నాయి – చిన్నతనంలో పెళ్లి కావడం, తగినంత అక్షరాస్యత లేకపోవడం, ఉద్యోగాలకు వెళ్లకుండా యింటిపట్టున వుండడం, మతపెద్దల మాట విని గర్భనిరోధణ సాధనాలు వాడకపోవడం యిలాటివి! 

హిందువుల్లో జననాలు తక్కువగా వుండడానికి  మెరుగైన ఆర్థికపరిస్థితి, అక్షరాస్యత, యిద్దరూ వుద్యోగాలు చేయడం వంటి కారణాలతో బాటు గర్భంలోనో, పుట్టగానో ఆడబిడ్డను చంపివేయడం కూడా ఒకటి. ముస్లింలలో యీ అలవాటు పెద్దగా కనబడటం లేదు. పురుషుల, స్త్రీల మధ్య నిష్పత్తిని ఏ ఏజ్‌ గ్రూపులో చూసినా ముస్లిం మహిళ నిష్పత్తి ఎక్కువగా వుంటోంది. ఐదేళ్ల లోపు గ్రూపులో హిందూ బాలుర సంఖ్యతో పోలిస్తే బాలికల సంఖ్య చాలా స్వల్పంగా వుంటోంది. సగటు హిందూ స్త్రీకి 2.65 పిల్లలుంటే, సగటు ముస్లిం స్త్రీకి 3.09 పిల్లలుంటున్నారు. తేడా 0.44. అయినా హిందూ జనాభా ఎక్కువ కాబట్టి 2001-11 మధ్య 8 కోట్లు పెరిగి జనాభాలో 78.3% వున్నారు. 2001 కంటె జనాభాలో వారి శాతం 1.3% తగ్గింది. ఇదే సమయంలో ముస్లిం జనాభా 0.8% పెరిగింది. ఈ తేడాతో వాళ్లు హిందువులను దాటిపోయే ప్రమాదం ఎంతకాలంలో వుంది?

సచార్‌ కమిటీ అంచనాల ప్రకారం జనాభాలో ముస్లింల శాతం 2041 నాటికి 16.26%, 2071 నాటికి 17.57%, 2101 నాటికి 17.98% అవుతుంది. అంకెల్లో చెప్పాలంటే వారి జనాభా అప్పటికి 32 కోట్లు అయి, (ఇప్పుడు 13.81 కోట్లున్నారు) ఆ తర్వాత స్టెబిలైజ్‌ అయిపోతుంది. సామాజికపరమైన మార్పులు, ఆ వర్గాలు ఆర్థికమైన ప్రగతి సాధించగలిగితే అంతకంటె ముందే స్టెబిలైజ్‌ కావచ్చు కూడా.

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]